Govardhan Gande……………………………..
Whose madness delights them…………………………. “బహిష్టు సమయంలో….వంట చేస్తే …… ఆ మహిళ మరుజన్మలో ‘వ్యభిచారిణి”గా జన్మిస్తుంది.”తనకు తాను ఆధ్యాత్మికవాదిగా చెప్పుకునే/ప్రకటించుకున్న ఓ నయా బాబా వారు చేసిన సూత్రీకరణ ఇది. ఆ బాబా వారు వంట,స్త్రీ పట్ల తనకు ఉన్న , కలిగిన “ఉన్నత”మైన అభిప్రాయాన్ని పై విధంగా సెలవిచ్చారు మరి.దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా చూడాలి? బహిష్టు అనే అంశాన్ని చూద్దాం.
————
మనుషుల్లో పునరుత్పత్తి కోసం స్త్రీ శరీరంలో క్రమం తప్పకుండా సంభవించే ఓ ప్రకృతి సహజమైన ప్రక్రియ బహిష్టు/ఋతుక్రమం( menstruation/period).ఈ ప్రక్రియ లేకుంటే మనం ఉండేవారమే కాదు కదా.,ఈ బాబా వారు ఎలా జన్మించారో? జన్మించారో? లేక ఆకాశం! నుంచో,,రోదసి నుంచి ఊడి పడ్డారో ఏమో తెలియదు. సాధారణ మానవులమైన మనం మాత్రం ఉండేవారం కాదు. మానవ జాతే ఉండేది కాదు.
ప్రతి స్త్రీకి నెలలో మూడు, నాలుగు రోజుల పాటు ఈ బహిష్టు/రుతుస్రావం/నెలసరి బాధ తప్పదు కదా. బహిష్టు సమయంలో చంటి పిల్లలకు “ఆ మూడు రోజులు” పాలివ్వడం లేదా?,పసిగుడ్డుకు పాలే ఆహారం కదా. మూడు రోజులు పాలివ్వకపోతే ఆ పసి ప్రాణం నిలిచే అవకాశం ఎంత?మన సమాజంలో వంట చేసేది చేస్తున్నది ఆడవారే కదా. నెలలో ఆ మూడు రోజులు ఇతరులు వంట చేస్తున్నారా?
బ్రాహ్మణుల ఇళ్లలో ఆ సమయాల్లో ఇంట్లోని ఇతర స్త్రీలు వంట చేస్తుండవచ్చు. ఇతర కులాల్లో ఆ సమయాల్లో ఆ స్త్రీలు వంటకు దూరంగా ఉంటున్నారా? ఒక వేళ ఉంటున్నట్లైతే అప్పుడు ఇతర స్త్రీలు,ఇంట్లోని పురుషులు వంట చేస్తున్నారా? ఇవన్నీ సహజంగా తలెత్తే ప్రశ్నలే కదా. వీటికి జవాబు మనలోని అందరికీ దాదాపుగా తెలుసనుకుంటాను. సరే ఇదంతా పక్కన పెడదాం.
ఇప్పుడు వ్యభిచారిణులు/వేశ్యలుగా ఉన్న వారంతా తమ గత జన్మల్లో ఆ సమయాల్లో వంట చేసిన వారే అనుకోవాలి కదా.ఇంత శాస్త్రీయ సూత్రీకరణ చేసిన ఆ బాబా వారికి నోబెల్ కంటే పెద్దదైన ఓ బహుమతి ని సృష్టించి ఇవ్వవచ్చును కదా. ఏమంటారు?
జీవించడానికి,జీవితాన్ని కొనసాగిస్తూ మనుగడను నిలుపుకోవడానికి కడుపు నింపుకోవాలి కదా. ఇందు కోసం వంట తప్పదు కదా. తిండి లేకుంటే పూట కూడా గడవదు కదా. ఈ సంగతి ఆ బాబా వారికి స్పష్టంగానే తెలిసి ఉండాలి. ఇది తెలికపోతే అతగాడికి ఏవైనా “అతీత” శక్తులు ఉండి ఉండాలి. ‘మానవాతీత అంశ’ ఏదైనా ఉందేమో! ,’ కారణ’ జన్ముడు కావచ్చు! లేక “దైవాoశ సంభూతుడు” కావచ్చును!అందుకేనేమో అతగాడికి క్షుద్బాధ లేదేమో! అందుకే గాలి పీలుస్తూ జీవిస్తున్నారేమో!
కానీ మన లాంటి “సాధారణ అల్ప మానవ” ప్రాణులు/మాత్రులకైతే ఆహారం భుజించక తప్పదు కదా.
అందుకేనేమో వంట,ఆహారం అంటే అంత తేలిక భావం ఆ బాబావారికి.వంట కు బహిష్టు కి సంబంధం ఏమిటి? మరో జన్మ లో వ్యభిచారిణిగా పుట్టడం ఏమిటి?అసలు వ్యభిచారిణిగా పుట్టడం ఎలా సాథ్యం?పుట్టి పెరిగి యుక్త వయసు వచ్చిన తరువాత కదా అలాంటి అవకాశం ఉండేది.
ఇలాంటి తలా తోక లేని మూఢమైన నమ్మకాలను విస్తరింపజేసే వారిని ఏమి చేయాలంటారు?ఇలాంటి విచిత్రమైన/ అహేతుకమైన/ తర్కానికి అందని పిచ్చి సూత్రీకరణలు చేసే వారు మన సమాజంలో జ్ఞానులూ/బాబాలు/ గురువులుగా చలామణి అవుతున్నారు. ఇంకో సంగతి కూడా ఇక్కడ ప్రస్తావించ వలసి ఉన్నది.శ్రీనివాసులు అనే పేరు కలిగిన వారు జీవితంలో అన్నీ కష్టాలే అనుభవిస్తారని… స్థిరపడరని,ఓ సరికొత్త “సిద్ధాంతాన్ని” ప్రతిపాదించారు ఈ బాబా వారు.