‘గుత్తి కోట’ను చూతము రారండి !

Sharing is Caring...

గుత్తి కోట నిర్మాణం అద్భుతం. అపూర్వం .. అనంతపూర్ కి 50 కిమీ దూరంలో ఉండే ఈ కోట… తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 2000 ఏళ్ల పరిపాలన చరిత్ర.. కొన్ని వందల రాజుల రాజరికం.. అరుదైన అద్భుతమైన కట్టడాల సమూహారం.. ఎంతో ఎత్తున మేఘాల సయ్యాటల మధ్య కట్టడాలు… ఆది మానవుల నుండి మొన్నటి బ్రిటిష్ పాలన వరకు అధికారం అంతా కొండపైన కోటల మధ్యనే..20 ఏళ్ల క్రితం ఉన్న కోట ఇప్పుడు లేదు.

గుప్తనిధుల ఆశతో ఎంతో పురాతన విలువైన కట్టడాలను, కోట గోడలను, గుళ్లను ,రాజరికపు అనవాళ్లను నేలమట్టం చేశారు.. ఇంత చేసినా కొండ ఎక్కగానే ఆ రాజరికపు సౌందర్యాల మధ్యన విస్తు గొలిపే నిర్మాణాలను చూస్తూనే ప్రపంచాన్ని మర్చిపోతాం. ఆ పురాతన కట్టడాల మధ్యకు వెళ్ళగానే చరిత్ర జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతాము. ఇక్కడి సొరంగ మార్గాలు, చెక్కు చెదరని రాతి కట్టడాలు మనసును కట్టి పడేస్తాయి.

ఇక ఇక్కడ వర్షాలు సరిగ్గా పడితే రాయలసీమ అందాలు తన విశ్వరూపం ప్రదర్శిస్తాయి. కొండ పైకి కాలి నడకనే వెళ్లాలి. మొదట విశాలమైన మైదానం కనిపిస్తుంది. అక్కడి నుంచి నాలుగడుగులు నడిస్తే.. వ్యాయామశాల, ఆయుధ గిడ్డంగి, సైనికుల కవాతు మైదానం, అశ్వ, గజశాలలు, వంట గది, నేల మాలిగలు ఆనాటి వైభవాన్ని గుర్తుకు తెస్తాయి.

కోటపైకి ఎక్కే కొద్ది కన్పించే 101 బావులు ఆనాటి రాజుల ముందుచూపును తెలియజేస్తాయి. కోట గోడలు రాజసాన్ని ఒలకబోస్తూ కనిపిస్తాయి. అప్పట్లో ఇక్కడున్న ధాన్యాగారంలో రెండేళ్లకు సరిపడా ధాన్యం నిల్వ ఉంచేవారట. కరవొచ్చినా, ఏదైనా యుద్ధం వచ్చినా.. కొంతకాలం కోట ద్వారాలు మూసినా.. ధాన్యానికి కొరత లేకుండా ఏర్పాటు చేసుకున్నారు.

కొండ అగ్ర భాగాన శిథిల శిల్పాలు కోటల మధ్యన దూరాన ఉన్న కొండలను చూస్తూ కాలం గడిపెయ్యవచ్చు.. ఏకంగా 101 బావుల సౌందర్యం చూడచ్చు..కానీ ప్రస్తుతం వాటిలో చాలా వరకు పూడ్చి వేశారు.. కోట పైన మీరే రాజులు … రాణులు … రక్షక భటులు.. మంత్రులు … సేనాధిపతులు..ఏనుగు సాల, గుర్రపు సాల, రాణి వాసం, రంగంటపం,కోడిగుడ్డు బావి నుండి అక్కచెల్లెళ్ల బావి వరకు ఎన్నో ఎన్నెన్నో.. ఊహకందని విస్తుగొలిపే కట్టడాలు వాటి ఆనవాళ్లు చూసి తీరాల్సిన ప్రదేశం.

అత్యద్భుతమైన పచ్చదనపు లోగిళ్లలో విహరించాలంటే గుత్తి కోట ను చూడాల్సిందే. గుత్తి పట్టణం కోట చుట్టూ విస్తరించి ఉంది. శత్రు దుర్బేద్యమైన ఈ కోట ను కేంద్రంగా చేసుకునే శాతవాహనులు , పల్లవులు , విజయనగర రాజులు , గోల్కొండ నవాబులు తమ పాలనను సాగించారు.

చివరికి 17 వ శతాబ్దంలో మైసూర్ రాజు హైదర్ అలీ కుతంత్రానికి అప్పటి మారాటి రాజు మురారి రావు ఘోర్పడే ని లొంగ దీసుకొని కొన్ని సంవత్సరాలు తమ ఆధీనంలో ఉంచుకొని , కోటను బ్రిటీషు వారి కి అప్పగించారు.ఈ గుత్తి కోట చాళుక్యుల కాలములో నిర్మితమైనదని అంటారు.

విజయనగర రాజుల హయాంలో మరింత పటిష్టమైంది. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడం , సంస్కృతం లో ఉన్నాయి. అవి 7వ శతాబ్ది నాటివని అంచనా. ఒక శాసనం లో ఈ కోట పేరును  గదగా పేర్కొన్నారు. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనం లో గుత్తి కోట ను  దుర్గ రాజముగా కీర్తించారు.

రాజా రాయలసీమ, విజయభాస్కర్ వంటి మరి కొందరు యువకులు గుత్తి కోట సంరక్షణ సమితి గా ఏర్పడి చారిత్రిక ఆనవాళ్లను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గుత్తి కోట గత వైభవాన్ని భావి తరాలకు తెలియజేసే బాధ్యతను చేపట్టారు. ఇటీవల కన్నడ మీడియా మాస్టర్ సంస్థ ప్రసిద్ధి గాంచిన గుత్తి కోట ను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిని అనుసంధానం చేస్తూ కన్నడంలో ఒక వీడియో ను తీసి విడుదల చేసింది.

————– రాజ రాయలసీమ 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!