Entertaining dances………………
తెలుగు సినిమాల్లో ‘ఐటెం సాంగ్’ అనే పదం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, ఈ సంప్రదాయం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రారంభ దశ లో ఎక్కువగా క్లబ్ డాన్సులు ఉండేవి. ఆ కాలంలో వీటిని ఐటెం సాంగ్స్ అనే వారు కాదు. కథలో భాగంగా విలన్ అడ్డాలోనో లేదా క్లబ్‌లోనో తారలు వేసే డాన్సులను ‘క్లబ్ డాన్సులు’గా పిలిచేవారు.
జానపద సినిమాల్లో మాంత్రికుడి గుహల్లో తారలు వేసే డాన్సులు కూడా ఉండేవి. జ్యోతిలక్ష్మి, విజయలలిత, ఎల్ విజయ లక్ష్మి, రాజసులోచన కాంచన తదితర తారలు ఇలాంటి డాన్సులు చేసేవారు. నృత్యం ద్వారా కథలో ఒక మలుపును తీసుకురావడం లేదా విలన్ స్వభావాన్ని చూపడం ఈ డాన్సుల ఉద్దేశ్యం.
1970 – 1990 మధ్యకాలంలో ఈ తరహా డాన్సులు పెరిగాయి.ఈ తరహా ప్రత్యేక గీతాలకు ఒక గుర్తింపు వచ్చింది.జ్యోతిలక్ష్మి,జయమాలిని హవా జోరుగా సాగింది.ఇంకా హలం,జయకుమారి,అనురాధ వంటి వారు తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు..కేవలం ఒక పాట కోసమే సినిమా చూసే ప్రేక్షకులు పెరిగారు.
ఈ క్రమంలోనే సిల్క్ స్మిత ఒక ప్రభంజనం సృష్టించారు.. ఆమె పాట కోసం పంపిణీ దారులు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చేవారు..సిల్క్ స్మిత పాట ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం అప్పట్లో ఉండేది. ఈ పాటలు శృంగారభరితంగా, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండేవి. సంగీత దర్శకులు, కవులు ఇలాంటి పాటలపై మరింత శ్రద్ధ పెట్టేవారు.
2000వ సంవత్సరం తర్వాత ఐటెం సాంగ్స్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు కేవలం డాన్సర్లకే పరిమితమైన ఈ పాటల్లోకి మెయిన్ హీరోయిన్లు ప్రవేశించారు. మణిశర్మ, దేవి శ్రీ ప్రసాద్ వంటి సంగీత దర్శకులు ఈ పాటలకు హై-వోల్టేజ్ మ్యూజిక్ అందించడం మొదలుపెట్టారు.
‘ఆర్య’లో “అ అంటే అమలాపురం”, ‘పోకిరి’లో “ఇప్పటికింకా నా వయసు”, ‘పుష్ప’లో “ఊ అంటావా మావ” వంటి పాటలు అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాయి. సమంత, పూజా హెగ్డే, తమన్నా వంటి టాప్ హీరోయిన్లు ప్రత్యేక గీతాల్లో నటించడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది.
సినిమా ప్రమోషన్ కోసం ఐటెం సాంగ్స్ ఒక బలమైన అస్త్రంగా మారాయి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించడానికి ఇవి తోడ్పడుతున్నాయి. ఈ పాటలు మహిళలను వస్తువులుగా చూపిస్తున్నాయని.. కథకు సంబంధం లేకుండా కేవలం గ్లామర్ కోసమే వీటిని పెడుతున్నారని విమర్శలు కూడా ఉన్నాయి.
మొత్తానికి, తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కల్చర్ అనేది కేవలం వినోదం నుంచి ఒక పెద్ద బిజినెస్ మోడల్‌గా రూపాంతరం చెందింది. తెలుగు సినిమాల్లో పాతకాలం నుంచి క్లబ్ డాన్స్‌లు (క్యాబరే లేదా స్పెషల్ సాంగ్స్) చేసిన ప్రముఖ నటీమణులు ఎందరో ఉన్నారు.
జ్యోతిలక్ష్మికి తెలుగు తెరపై మొదటితరం క్లబ్ డాన్సర్‌గా ప్రత్యేక గుర్తింపు ఉంది.విజయలలిత జ్యోతిలక్ష్మికి సమకాలీనంగా ఉంటూ, తనదైన శైలిలో క్లబ్ డాన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు. ఎల్. విజయలక్ష్మి శాస్త్రీయ నృత్యంతో పాటు అనేక చిత్రాల్లో క్లబ్ డాన్స్‌లు, స్పెషల్ సాంగ్స్ చేశారు.
తరువాత కాలంలో ఈ పాటలకు ప్రాముఖ్యత పెరిగి ‘వ్యాంప్’ పాత్రలు మరింత గుర్తింపు పొందాయి. తెలుగు సినీ చరిత్రలో క్లబ్ డాన్స్‌లకు, స్పెషల్ సాంగ్స్‌కు పర్యాయపదంగా సిల్క్ స్మిత మారారు.. జ్యోతిలక్ష్మి సోదరి జయమాలిని కూడా వందలాది సినిమాల్లో క్లబ్ సాంగ్స్ ద్వారా రాణించారు. ఆ కాలంలో సిల్క్ స్మితకు పోటీ గా అనురాధ ఎన్నో క్లబ్ డాన్స్‌లు చేశారు.
డిస్కో శాంతి కూడా 1980, 90వ దశకాల్లో చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి మాస్ క్లబ్ సాంగ్స్ చేశారు. ‘పోకిరి’ వంటి చిత్రాల్లో క్లబ్ తరహా పాటలతో ముమైత్ ఖాన్ విపరీతమైన క్రేజ్ సంపాదించారు. హంసా నందిని, అభినయశ్రీ కూడా అనేక చిత్రాల్లో ప్రత్యేక గీతాల ద్వారా సుపరిచితులయ్యారు. ఈ డాన్సులు చేసే తారలకు పారితోషకం కూడా పెద్ద మొత్తాల్లోనే ఇస్తున్నారు.

