Guna Sekhar mark movie…………..
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో ‘చూడాలని ఉంది’ కూడా ఒకటి.. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.
దర్శకుడు గుణశేఖర్ కి ఇది నాలుగో సినిమా.. ఆయన కథ చెప్పిన తీరు అశ్వనీదత్ కి, హీరో చిరంజీవికి నచ్చడంతో కొత్త డైరెక్టర్ అయినప్పటికీ అవకాశమిచ్చారు. ఈ సినిమాలో సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్స్ గా చిరు సరసన నటించారు.
సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ‘రామా చిలకమ్మా’ పాట ట్రెండ్ సెట్టర్.. గా నిలిచింది. ఈ పాట ను ఉదిత్ నారాయణతో పాడించారు మణిశర్మ. నలుగురు నాన్ తెలుగు సింగర్స్ పాడిన మొదటి ఆల్బమ్ ఇదే అని చెప్పుకోవచ్చు. ‘యమహా నగరి’ పాటతో సినిమాలో చిరు పరిచయం మొదలవుతుంది.
చిరంజీవి ని రొటీన్ కి భిన్నంగా చూపించడానికి దర్శకుడు గుణశేఖర్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కొత్తదనం ఉన్న కథ ఇది. ఆ రోజుల్లో 20 కోట్లు కలెక్ట్ చేసిందని ఫిలిం వర్గాల సమాచారం. ఆగస్టు 27, 2024 నాటికి ఈ సినిమా 26 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమా తీసి అన్నేళ్లు అయినప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తుంది.
మొదట ఈ సినిమాకు కాళికా'(కాళీ దేవత) అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ‘చూడాలని ఉంది’ అన్నటైటిల్ ను చిరంజీవే సూచించారు.. అది బాగుందనిపించి దాన్నే ఖరారు చేశారు. సాఫ్ట్ టైటిల్ అయినప్పటికీ ప్రేక్షకులకు నచ్చింది.
అల్లు అరవింద్- అశ్వినిదత్ కలిసి ‘చూడాలని ఉంది’ చిత్రాన్ని ‘కోల్కతా మెయిల్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అనిల్ కపూర్,రాణి ముఖర్జీ,మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించారు.సుధీర్ మిశ్రా హిందీ వెర్షన్ ను డైరెక్ట్ చేశారు.ఈ సినిమాతో తాను అరవింద్ రూ. 12 కోట్లు పోగొట్టుకున్నట్టు అశ్వినిదత్ అప్పట్లో మీడియాకు చెప్పారు.
బాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ దివంగత సరోజా ఖాన్ కోసం ముంబయి వెళ్లగా చిరు సాంగ్ కి కంపోజ్ అనగానే బిజీగా ఉన్నాసరే ఆమె ఒకే చేసింది. ‘ఓ మారియా సాంగ్’కు గాను ఆమెకు నంది అవార్డు లభించింది.
ఇందులో చిరు-అంజలా జావేరి ల మధ్య తొలి ప్రేమ సన్నివేశాలు డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో కూడి ఉంటాయి. ఈ లవ్ సీన్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో తీశారు. చిరు ఆమె తో కలసి పారిపోయే సన్నివేశాలు బాగా తీశారు. సినిమా మొత్తం రిచ్ గా ఉంటుంది. క్లైమాక్స్ కూడా భారీగానే తీశారు. ప్రకాశ్‌రాజ్ ప్రతినాయకుడిగా మెప్పించారు. ఆయన తండ్రి గా ధూళిపాళ నటించారు.
బ్రహ్మాజీ ఇందులో చిన్నసైజు విలన్ గా నటించాడు. కథలో చాలాసేపటివరకు చిరంజీవి కలకత్తా ఎందుకు వచ్చాడు అనేది సస్పెన్స్.సినిమాలో చేజింగ్ సీన్లు ఆకట్టుకుంటాయి. అల్లు రామలింగయ్య కూడా చిన్న పాత్రలో కనిపిస్తారు. సౌందర్య ది చిన్న పాత్ర .. ఉన్నంతలో ఆమె బాగానే చేసింది. అంజలా జావేరి అంతే. అపార్ట్మెంట్ లో బ్రహ్మానందం,ఎమ్మెస్ నారాయణల హాస్య సన్నివేశాలు అలరిస్తాయి.
‘గుంటూరు బాంబు తీయ్’ అంటూ బ్రహ్మానందం చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. రచయిత దివాకర్ బాబు సంభాషణలు అందించారు. పాత్రోచితంగా ఆయన డైలాగులు రాశారు. చోటా కె నాయుడు కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. మణిశర్మ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను అలరిస్తుంది. రెండు నంది అవార్డులు .. ఫిలిం ఫేర్ అవార్డులను సినిమా గెలుచుకుంది.యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది.. చూడని వారు చూడొచ్చు.