స్క్రీన్ పై ‘చిరు’ కనిపించిన తొలి సినిమా !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi ……………………………..

ఈ ప్రాణం ఖరీదు సినిమా గురించి చెప్పటానికి చాలా విశేషాలే ఉన్నాయి . మెగా స్టార్ చిరంజీవి మొదట సంతకం చేసిన సినిమా పునాదిరాళ్ళు . కానీ మొదట రిలీజ్ అయిన సినిమా ఈ ప్రాణం ఖరీదు. సీఎస్ రావు రాసిన ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు.

ఈ నాటకం లో విలన్ పాత్ర ను కోట శ్రీనివాసరావు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలో మాత్రం ఆ పాత్రను రావు గోపాలరావు చేశారు. ఇదే సినిమాలో ఒక చిన్న పాత్రలో కోట నటించారు. ఇదే ఆయన మొదటి సినిమా.

నటన పరంగా మరో సారి చంద్రమోహన్ తన నట విరాటరూపాన్ని ప్రదర్శించారు. చెవిటి , మూగవాడిగా నటించి ప్రేక్షకులను మెప్పించటం అంత సులభం ఏమీ కాదు. చంద్రమోహన్ మెప్పించారు. కొత్త నటుడు అయిన చిరంజీవి చాలా గొప్పగా నటించారు .

పునాదిరాళ్ళు , ప్రాణం ఖరీదు , మన ఊరి పాండవులు ఇవన్నీ చిరంజీవికి మొదటి సినిమాలే . అయినా ఎంతో అనుభవం కల నటుడిగా ప్రేక్షకులను మెప్పించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. NTR , ANR , కృష్ణ , కృష్ణంరాజు ల్లాగా  చిత్ర పరిశ్రమలో మెగా స్థాయికి ఎదిగారు. ఓ సినీ మెగా కుటుంబం ఏర్పడటానికి స్వేదాన్నిచిందించారు .

ఈ సినిమాలో జయసుధ అద్భుతంగా నటించింది. ఈ ముగ్గురి తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పాత్ర సత్యనారాయణదే . ప్రేక్షకులు మరచిపోలేని ఆ పాత్రలో నటించి మెప్పించారు.  భూస్వామిగా , పెత్తందారుగా రావు గోపాలరావు క్రౌర్యాన్నిప్రేక్షకులు మరచిపోరు. మునసబు గా  నూతన్ ప్రసాద్ , విలన్ మొదటి భార్య కూతురిగా మాధవి , జయసుధ బేవార్స్ అన్నగా చలం , రమాప్రభ నటించారు . ఓ చిన్న పాత్రలో ఆర్ నారాయణమూర్తి కూడా నటించారు. 

ఈ సినిమాలో చిరంజీవి జోడీ బంగారిగా ఒరియా నటి రేష్మా రాయ్ హుషారుగా నటించింది. ఆమెది ఈ సినిమాలో మరో కీలక పాత్ర. స్వాతంత్య్రం రాక ముందు ఓ మారుమూల గ్రామంలో జరిగిన కధగా సినిమా మొదట్లోనే చెబుతారు. చట్టాలు , న్యాయాలు , మానవత్వం వంటి అంశాలు లేని నేపధ్యంలో కథ నడుస్తుంది.’పేదవాడి ప్రాణం ఖరీదు పాతిక రూపాయలు’ అనే డైలాగ్ చాలాసార్లు వినిపిస్తుంది. 

నిర్మాత క్రాంతి కుమార్.  ప్రముఖ దర్శకుడు కె ప్రత్యగాత్మ కుమారుడు కె వాసు ఈ సినిమాకు దర్శకుడు. పెత్తందారీ అరాచకాన్ని ప్రతిఘటిస్తూ చిరంజీవి ముందు నిలవగా, సత్యనారాయణ పిలుపుతో పెత్తందారు రావు గోపాలరావుని , బేవార్స్ చలాన్ని ఊరి జనం చంపేయటంతో సినిమా ముగుస్తుంది.

జయసుధ , చంద్రమోహన్ పాత్రల్ని రావు గోపాలరావు చంపేస్తాడు. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ ప్రాణం ఖరీదు నచ్చుతుంది. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . ముఖ్యంగా ‘యాతమేసి తోడినా యేరు యెండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’అనే పాట బాగా హిట్టయింది. రచయిత జాలాది కి ఈ పాట మంచి పేరు తెచ్చిపెట్టింది.  ఈ పాటలో పొగిలి , పొంత అనే మాటలు నేను ఎప్పుడూ వినలేదు.

ఆ తర్వాత ‘ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాక యాలమీద పోయేరమ్మ గూటిచిలకా’ , నోమల్లో మామల్లో తోట కాడ గలగల్లా పరుగెల్లీ ఏటి కాడ’ , ‘బండ మీద బోడి గుండోడి దెబ్బ రామయ్యో రామచంద్రయ్యా’ పాటలు బాగుంటాయి.  తెరపై వాటి చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. 

గ్రామీణ పదాలతో అన్నిపాటలను జాలాది చాలా గొప్పగా వ్రాసారు . బాలసుబ్రమణ్యం , చంద్రశేఖర్ , ఆనంద్ , యస్ పి శైలజ , యల్ ఆర్ ఈశ్వరి , యస్ జానకిలు చాలా శ్రావ్యంగా , డిఫరెంటుగా గ్రామీణ జానపద శైలిలో పాడారు.  

మార్చి 22 , 1978 న రిలీజ్ అయిన ఈ సినిమా ధవళేశ్వరం వద్ద పొత్తిలంక గ్రామంలో , ఒకే షెడ్యూల్లో పూర్తి చేసారట . క్రాంతి కుమార్ ప్రొడక్షన్ ప్లానింగ్ రామానాయుడు ప్లానింగ్ లాగానే ఉంటుంది కదా ! సినిమా , సినిమాలోని కీలక సీన్లు , పాటల వీడియోలు అన్నీ యూట్యూబులో పుష్కలంగా ఉన్నాయి. చిరంజీవి , చంద్రమోహన్ , జయసుధ అభిమానులు చూడవచ్చు . A watchable movie .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!