చైనా రూటే వేరు కదా !

Sharing is Caring...

Govardhan Gande…………………………………………….

మీ కోసం కాదు.. మా కోసం.. మా కలలు కోసం.. మా లక్ష్యం కోసం… మా ఆశయాల సాధన కోసం.. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలనుకుంటున్న మా కాంక్ష కోసం మాత్రమే పని చేయండి. లక్ష్యాలకు అనుగుణంగా వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయండి! సరికొత్త వస్తువుల ఉత్పత్తి కోసం ఆలోచించండి! మొత్తం ప్రపంచం చైనా వస్తువులతో నిండి పోవాలి!

ప్రకృతి వనరులన్నీ మన సొంతం అయిపోవాలి.. మొత్తం ప్రపంచానికి వాటిని ఆమ్ముకుందాం/అంటగడదాం.. మొత్తం ప్రపంచంపై పెత్తనం చేద్దాం. ఇదండీ చైనా పాలక వర్గం తీరు. ఈ లక్ష్యాలలో వారు కొంతమేరకు విజయం సాధించారు. ఇతర దేశాలను ఆధార పడే దేశాలుగా మార్చేశారు.

మొత్తం మానవ జాతిలో 20 శాతాన్ని (140 కోట్లు)కి పైగా జనాభా కలిగిన దేశం. అత్యధిక జనాభా కలిగి ఉన్న ఈ దేశంలో ఎన్నికలుండవ్.. ఓ గుప్పెడు మంది చేతుల్లో 140 కోట్ల మంది జాతకాలు,జీవితాలు ఆధారపడి ఉంటాయన్న మాట. అన్న మాట కాదు. ఉన్నమాటే!తిండి పెడతాం… దుస్తులిస్తాం… గూడు కూడా కల్పిస్తాం! కానీ సొంత ఆలోచనలు మాత్రం చేయకండి!

స్వేచ్ఛ,స్వాతంత్యం,ప్రజాస్వామ్యం లాంటి “పనికి మాలిన మాటలు” మాట్లాడకండి!అలాంటి ఆలోచనలు చేసినట్లు తెలిసినా,మాట్లాడినా,వాటి కోసం ప్రయత్నించినా కటకటాలు లెక్కించవలసిందే! విచారణలుండవ్! కఠిన శిక్షలు అనుభవించవలసిందే!మరణ శిక్షలు కూడా ఉంటాయి జాగ్రత్త! తియాన్ మిన్ స్క్వేర్ లో చూసారు కదా!అదే జరుగుతుంది! అది మాత్రమే జరుగుతుంది!

ఏ అంతర్జాతీయ వేదికనూ లెక్క చేయం!అన్నీ మేమే! అంతా మేమే! మేము మాత్రమే! భూమిపై మరొకరి అధికారాన్ని ఒప్పుకోము గాక ఒప్పుకోము! మమ్మల్ని ఎవరూ ప్రశించకూడదు! అంతే మరి!మేమేం చేయాలో మాకు తెలుసు! మాకు ఎవరూ ఏమీ చెప్పనవసరం లేదు!

మాకు నీతులు చెప్పే అర్హత ఎవరికీ లేదు!మేము ఎవరికైనా ఏమైనా చెప్పగలం! చెబుతాం కూడా! అందరూ మా మాట వినవలసిందే! విని తీరవలసిందే! మరో మాటకు తావు లేదు! మేమే అందరికీ చెబుతాం!ఇదండీ “వందేళ్ల ఉత్సవాలు” జరుపుకుంటున్న “నవ/ఆధునిక” చైనా!జన చైనా! “ఫైవ్ స్టార్” దేశం!

మహానుభావుడు మావో ఏమి చెప్పాడో..ఎలాంటి కలలు గన్నాడో .. కానీ మావో మరణం తర్వాత చైనా మెల్లగా ఆయన విధానాలను నుంచి పక్కకు జరిగింది. ఆమాట ఎవరైనా గట్టిగా అంటే జైల్లో పెట్టేస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక వ్యతిరేక గళం వినిపించేవారిని అణిచి వేశారు. జిన్ పింగ్ హయాంలో ఈ ధోరణి మరింత పెరిగిందనే విమర్శలు లేకపోలేదు.

దేశాన్ని ప్రేమించడం పార్టీని ప్రేమించడం ఒకటే అన్నభావన చైనా లో ఎక్కువ. ఒకే ఒక పార్టీ దేశ అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. ఈ తరహా పాలనపై విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పాలనే మంచిదనే అభిప్రాయాలు ఉన్నాయి. కమ్యూనిస్టుల్లో కూడా కొంతమంది ఈ తరహా పాలనపై అంత సానుకూలంగా లేరు. మరికొందరు పూర్తిగా సమర్థిస్తారు. నిరంకుశ రాచరికాన్ని అంతం చేయడానికి కోట్లాది మంది చైనీయుల సుదీర్ఘ పోరాటం,త్యాగం, అమరత్వానికి అర్ధం, పరమార్ధం ఇదేనని సరిపెట్టుకుందామా ?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!