Crimes at a young age ……………
బాలలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలకు,హత్యలకూ తెగిస్తున్నారు.అశ్లీల చిత్రాలు చూస్తూ మద్యం ,మత్తుపదార్దాలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు.
NCRB గణాంకాల ప్రకారం 2013 – 2022 మధ్యకాలంలో బాలల నేరాల సంఖ్య 43,506 నుండి 30,555కి తగ్గింది, ఇది 10 సంవత్సరాలలో 30% తగ్గుదలను సూచిస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.గణాంకాల ప్రకారం కేసుల సంఖ్య నిజంగా తగ్గితే మంచిదే. కానీ గణాంకాలను చూసి కేసులు పూర్తిగా తగ్గాయని భావించలేం.అసలు నమోదు కానీ నేరాలు కూడా ఉంటాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మైనర్లు పక్క దారి పడుతున్న ఉదాహరణలున్నాయి.రోజూ ఎక్కడో ఒక చోట మైనర్లు వివిధ నేరాలు చేసి అవుతున్నారు. ఇరవై ఏళ్ల కుర్రాడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు.తన కోరిక తీర్చలేదనే కోపంతో బాలిక తలను చెట్టుకేసి కొట్టి,అపస్మారస్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేసి చంపేశాడు.అదే విధం గా 17 ఏళ్ల కుర్రాడు ఒకరు .. అదే వయసు బాలికను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.
ఇంటర్ విద్యార్థి ఒకరు 12 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హతమార్చాడు.ఆ మధ్య మద్యానికి బానిసైన కొడుకు తల్లి తల నరికి పారిపోయాడు. మరోజిల్లాలో మైనర్ బాలుడు తల్లి తలపై కొట్టి హత్య చేశాడు.ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి
ఇలా మద్యం.. డ్రగ్స్.. అశ్లీల చిత్రాలు.. ఇవన్నీలేత వయసు పిల్లలను నేరాల బాట పట్టిస్తున్నాయి. దేశంలో ఈ తరహా నేరస్థులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెలిసీ తెలియని వయసులో పెరిగిపోతున్న విశృంఖలత్వం ఫలితంగా పలు ఘోరాలు జరుగుతున్నాయి. చిన్నవయసులోనే మద్యం, డ్రగ్స్ కు అలవాటు పడి ఆ మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడటం మామూలైపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు.
ఇంటర్నెట్ .. ఫోన్లు అందుబాటులో కొచ్చాక చాలామంది టీనేజ్ పిల్లలు అశ్లీల చిత్రాలకు అతుక్కుపోతున్నారు. ‘దిశ’ ఉదంతం తర్వాత పోలీసు అధికారులు నిర్వహించిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అప్పట్లోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జులాయిగా తిరుగుతున్నయువకుల గురించి సర్వే నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రతి గ్రామంలో అశ్లీల చిత్రాలు, మద్యం, మత్తుమందులకు అలవాటుపడ్డ యువత పదుల సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. వీరిలో అందరూ నేరాల బాట పెట్టకపోయినా అవకాశం దొరికినప్పుడు మాత్రం నేరాలు చేసేందుకు వెనకాడటం లేదు. ఉదాహరణకు అశ్లీల చిత్రాలకు అలవాటుపడ్డ వారు అవకాశం దొరికినపుడు చాటుమాటుగా మహిళలు, బాలికలు, యువతులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడో, స్నానం చేస్తున్నప్పుడో సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీటిని చూపి బెదిరించడమో, లేదంటే తోటివారితో ఈ దృశ్యాలను పంచుకోవడమో చేస్తున్నారు.ఇది తప్పు అనే ఆలోచన వారిలో కలగడం లేదు. ఈ సంఘటనలను బేస్ చేసుకునే దృశ్యం 1,2 సినిమాలు కూడా రూపొందాయి. ఈ తరహా నేరప్రవృత్తి క్రమంగా పెరుగుతోంది .. దీన్ని మొగ్గ లోనే అరికట్టాల్సిన అవసరం ఉంది.పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తున్నప్పుడు ముందుగా తెలిసేది తల్లిదండ్రులకే .
ఉదాహరణకు అశ్లీల చిత్రాలకు అలవాటైన పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చాటుమాటుగా చూస్తుంటారు. వారి ఫోన్లకు లాక్ వంటివి వినియోగిస్తారు. లాక్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించినా, అందరితో పాటు కూర్చొని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడేందుకు ఇష్టపడకపోయినా అనుమానించాల్సిందే. ఆదిలోనే గమనిస్తే పిల్లల్ని కట్టడి చేయడం సులభం.
మద్యం, మత్తుమందులకు బానిసైన వారిని గుర్తించడం మరింత సులభం. ఆలస్యంగా ఇంటికి రావడం, పొద్దుపోయాక నిద్రపోవడం, పగలంతా అలసటగా ఉండటం, తిండి సరిగ్గా తినకపోవడం, చిన్నచిన్న కారణాలకే విసుక్కోవడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుండటం, అబద్దాలు చెప్పడం వంటివన్నీ వీరి లక్షణాలే.ఇవి గమనించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి దారిలో పెట్టాల్సింది తల్లితండ్రులే.