పంచ సరోవరాల్లోని ఒకటైన ‘పుష్కర్ సరోవరం’ రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు చేసేందుకు ఘాట్లు కట్టించారు. సరస్సు చుట్టూ దాదాపు 500 చిన్నచిన్న ఆలయాలు ఉన్నాయి.
కార్తీక పౌర్ణమి రోజు ఈ సరోవరంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. మామూలు రోజుల్లో కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పితృదేవతలకు తర్పణాలు కూడా వదులు తుంటారు. పుష్కర్ పట్టణం అజ్మీర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఆరావళి పర్వతాలు పహారా కాస్తున్నట్టు ఊరు ఎంతో అందంగా ఉంటుంది.
ఇక్కడ బ్రహ్మకు ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయాన్ని సిందయరాజులకు మంత్రిగా ఉన్న గోకుల్ చెంద్ ఫరేఖ్ కట్టించారు.
పురాణాల ప్రకారం సుమారు కొన్ని వేలసంవత్సరాల క్రితం శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ఇక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేసాడని చెబుతారు. ఇక్కడ బ్రహ్మదేవుడు నాలుగు ముఖాలతో దర్శనమిస్తుంటాడు. బ్రహ్మదేవుడు ప్రధాన దైవంగా పూజించబడే ఏకైక ఆలయం ఇదేనని అంటారు. పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించారని అంటారు. ఆ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట.
ఆ స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు వాటిని ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట. ఆ తామర పువ్వు పడిన చోటనే సరోవరం ఏర్పడిందని అంటారు.
ఇక మహాభారతంలో పులస్త్యముని భీమునికి అనేక తీర్థాల గురించి వివరిస్తూ పుష్కర్ తీర్థం పవిత్రమైనదని చెబుతాడు. పుష్కర్ అనగా తీర్థాలకు గురువు. సృష్టి కర్త బ్రహ్మ నివాసం ఈ పుష్కర్. ఔరంగజేబు కాలంలో ఇక్కడ ఆలయాలు ధ్వంసమైనాయి. ఆతరవాత ఆలయాలను క్రీ. శ.18 వ శతాబ్దంలో తిరిగి పునర్నిర్మించారు.
ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒంటెల జాతర/మేళా వైభవంగా జరుగుతుంది. ఈ సంబరాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఆసమయంలో పుష్కర్ దేశ,విదేశ పర్యాటకులతో కళకళలాడిపోతుంది. సంవత్సరం పొడవునా ఒంటెలను మేపుతూ ఎడారుల్లో తిరిగే, చిన్న చిన్న ఆవాసాల్లో నివసించే సంచార జాతులవారు పుష్కర్ మేళా కోసం వేచి చూస్తారు.
తేదీలు దగ్గర పడగానే తమ వద్ద ఉన్న ఒంటెలను తీసుకొని, కుటుంబాలతో, వంట సామాగ్రితో, గుడారాలతో పుష్కర్ మేళాకు తరలి వస్తారు. వీరు తమను తాము ఒంటెలకు బంట్లుగా భావిస్తారు. శివుడు ఒంటెలను చూసుకోమని తమను పుట్టించాడని వీరి విశ్వాసం.అజ్మీర్ నుంచి పుష్కర్ కి రవాణా సదుపాయాలున్నాయి. పుష్కర్ లో వసతి సౌకర్యాలున్నాయి.
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>> ఈయన మరో అమరశిల్పి జక్కన్న
—————- Theja