ప్రముఖులకు నచ్చలేదు .. ప్రేక్షకులు ఎగబడ్డారు !

Sharing is Caring...

A suspense thriller that was appreciated by the audience.

ఎపుడో 39 ఏళ్ళక్రితం రిలీజ్ అయిన “అన్వేషణ” కు అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమా తీయడానికి దర్శకుడు వంశీ చాలా కష్టపడ్డారు. సినిమా మొదటి కాపీ రాగానే కొందరు ప్రముఖులకు చూపించారు. ప్రముఖ నిర్మాత రామోజీ రావు అయితే తనకు సినిమా నచ్చలేదని చెప్పారు. ఎందుకు నచ్చలేదో కారణాలు కూడా వివరించారు.

అలాగే “టెక్నీక్ తో మాయ చేసావు తప్ప .. సినిమాలో ఏమి లేదు” అన్నారు వేమూరి సత్యనారాయణ. ఏడిద నాగేశ్వరరావు గారింట్లో కూడా ఎవరికి నచ్చలేదు. ఈ ఫీడ్ బ్యాక్ బయటకు రాగానే….  సినిమా తీస్తుండగానే కొనేసిన బయ్యర్లు ఇపుడు ఏం చెయ్యాలా అని డైలమాలో పడ్డారు.

వంశీకి టెన్షన్ పట్టుకుంది. టెన్షన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఆ దశలో చేసేదేమిలేదు. మొత్తానికి సినిమా రిలీజయ్యింది. మెల్లగా హిట్ టాక్ వచ్చింది. వంశీ కి ఈ అన్వేషణ మూడో సినిమా. తర్వాత రామోజీరావు  నిర్మాతగా ” ప్రేమించు పెళ్లాడు ” తీశారు. 

రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ బాగా నచ్చింది. తెలుగు ఆడియన్స్ కొత్తదనం ఫీలయ్యారు. విలన్ ఎవరో చివరి వరకు తెలీకుండా కథనం మంచి టెంపోతో నడుస్తుంది. ఫారెస్ట్  బ్యాక్ గ్రౌండ్ … అందమైన దృశ్యాలు .. ఆకట్టుకునే ఇళయ రాజా సంగీతం ప్రేక్షకులను థియేటర్ నుంచి కదలకుండా చేశాయి. 

ఈ సినిమాకు నేపధ్య సంగీతం అందించడానికి ఇళయరాజా వారం రోజులు పైనే టైం తీసుకున్నారు. అంతా అయ్యాక … మొత్తమంతా మ్యూజిక్కే ..ఇంగ్లిష్ సినిమాలా  ఉంది అన్నారట ఇళయరాజా. ఆయన ప్రశంస తో ఎగిరి గంతేశాడు వంశీ. అప్పట్లో కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేసిన చిన్నసినిమా గా ‘అన్వేషణ’ రికార్డు సృష్టించింది.

ఈ సినిమాను చిత్ర పరిశ్రమకు రాకముందు  ప్రముఖ దర్శకుడు రాంగొపాలవర్మ తన మిత్రులతో కలసి ఇరవై రెండు సార్లు చూశారట. పరిశ్రమ కొచ్చాక వర్మ వంశీతో ఒక సినిమా కూడా తీశారు. వంశీ చెప్పిన పాయింట్స్ మేరకు ఈ ‘అన్వేషణ’ సినిమా కథ తయారు చేయడానికి  యండమూరి వీరేంద్రనాథ్ .. తనికెళ్ళ భరణి మరికొందరు ప్రయత్నించారు. వారి వెర్షన్స్ వంశీకి నచ్చలేదట. తర్వాత తనే సొంతంగా రాసుకున్నారట. 

‘సితార’ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఎక్కడా రాజీపడకుండా కసితో రాత్రింబగళ్లు కూర్చుని స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. అందుకు తగినట్టుగా మ్యూజిక్ ఇళయరాజా తో చేయించుకున్నారు. తలకోన వద్ద కథకు ..  పాటలకు అనువైన లొకేషన్లు కూడా తానే స్వయంగా వెళ్లి సెలెక్ట్ చేసుకున్నారు.

అన్నిపక్కాగా కుదరడంతో షూటింగ్  వేగంగా జరిగింది. వంశీ మైండ్ లో ఏముందో క్యాచ్ చేసి ఏం వీ. రఘు కథను అద్భుతంగా చిత్రీకరించారు. పాటలను ముందెవ్వరు తీయని రీతిలో పిక్చరైజ్ చేశారు. తలకోన దగ్గర అడవిలో ఎక్కువ భాగం తీశారు. సమీప గ్రామం లో మకాం వేసి  తెల్లవారుజామున అడవి అందాలను,పక్షుల కదలికలను. కిలకిలారావాలను , సూర్యోదయ సన్నివేశాలను  కెమెరాలో బంధించడానికి రఘు అసిస్టెంట్లను తీసుకుని వంశీ అడవిలో తిరిగే వాడు.

ఒక్కోరోజు చీకటి పడ్డాక కూడా అడవిలో ఉండి కీలక సన్నివేశాలను చిత్రీకరించేవారు. ఆ షాట్స్ ను పాటల్లో వాడుకున్నారు. అందుకే పాటలు అద్భుతంగా వచ్చాయి.వేటూరి మాస్టారు రాసిన పాటలు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్.  సన్నివేశం చెబితే వేటూరి డిక్టేషన్ ఇచ్చేవాడు. స్వయంగా వంశీ యే కూర్చుని రాసుకునేవారు. అన్వేషణ మ్యూజిక్ సిట్టింగ్స్ మదురై లో జరిగాయి.

వంశీ సిట్టింగ్స్ కు స్క్రిప్ట్ మర్చిపోయి వెళ్లారు. తనకు గుర్తున్నమేరకు కథలో ఎక్కడ పాటలు కావాలో ఇళయరాజాకు వివరించారు. వంశీ చెప్పిన మేరకు అద్భుతమైన ట్యూన్స్ అందించారు ఇళయరాజా.  కీరవాణి……ఏకాంత వేళ …  ఇలలో … పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్. బాలు .. జానకి పాడిన ఆ పాటలు ఇప్పటికి నిత్యనూతనంగా ఉంటాయి.  

సినిమాలో వాటి చిత్రీకరణ కూడా మార్వలెస్ గా ఉంటుంది.కార్తీక్, సత్యనారాయణ,రాళ్ళపల్లి, శరత్ బాబులు పాత్రోచితంగా నటించారు. భానుప్రియ ను  ఆ పాత్రలోకి మలచడానికి వంశీ చేసిన కృషి ఫలించింది. ఈ సినిమా తో భానుప్రియ స్టార్డం అందుకున్నది.   యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. చూడాలనుకునే వారు చూడొచ్చు. 

——————KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!