కాంగ్రెస్ కి పూర్వ వైభవం తేగలరా ?

Sharing is Caring...

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికతో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందా ? పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా ? పీకే 4 m ఫార్ములా ఏమిటి ? అసలు పీకే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు ? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడం అంత సులభం కాదు. పీకే కాంగ్రెస్ కు … కాంగ్రెస్ కి పీకే కొత్తేమి కాదు. గతంలో కాంగ్రెస్ తో కలసి పనిచేసిన అనుభవం ఉంది.

2017 లో యూపీ లో ప్రశాంత్ కిషోర్  కాంగ్రెస్ తో కలసి పనిచేసారు.అక్కడ వర్కౌట్ కాలేదు. అయితే ఖచ్చితంగా పీకే అనుభవం కాంగ్రెస్ కి ఉపయోగపడుతుంది. అంత వరకు మాత్రం చెప్పుకోవచ్చు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు పీకే సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనకు హై కమాండ్ ను ఒప్పించే యత్నాలు చేస్తున్నారు.

అధిష్టానం కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలను ,సూచనలను పరిశీలిస్తున్నది. ఈ సందర్భంగానే పీకే 4 m ఫార్ములాను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మెసెజ్, మెసెంజర్ ,మిషనరీ,మెకానిక్స్ … ఇలా 4Mలతో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి పీకే వ్యూహాలు రచిస్తున్నారు. పీకే 4M ప్రతిపాదనకు  ఓ కమిటిని కూడా నియమించాలని సోనియా నిర్ణయించారని చెబుతున్నారు.  వీటి గురించి పూర్తి విషయాలు బయటికి రాలేదు.  

ఇక ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ తో జగన్ కలుస్తారా ? అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.  2019 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యేందుకు ఎన్నికల వ్యూహాలు అందిస్తూ..సహకరించిన ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలపై  పూర్తి అవగాహన ఉంది. ఈ సమయంలో ఆయన చేసిన ప్రతిపాదన వెనుక వ్యూహాలు  కీలకం కానున్నాయి.

ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదన పైన అసలు జగన్ సుముఖత వ్యక్తం చేస్తారా అనేదికూడా సందేహమే. వైఎస్సార్ మరణం తరువాత.. జగన్ ఓదార్పు యాత్రకు అడ్డుచెప్పటం.. ఆ తరువాత జగన్ కొత్త పార్టీ..సీబీఐ కేసులు..16 నెలల జైలు..వీటికి  కారణం కాంగ్రెస్ పార్టీ అని జగన్ బలంగా నమ్ముతారు. 

వైసీపీ ఆవిర్భావం – రాష్ట్ర విభజన తో 2014 ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఎక్కడా ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. క్యాడర్ కూడా పూర్తిగా వైసీపీ లో చేరిపోయింది. ఏపీ సీఎం జగన్ కు ప్రస్తుతం మోడీ సర్కార్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. జగన్ ఇపుడున్న పరిస్థితుల్లో ఆయన యూపీఏ లో చేరతారని ఎవరూ అనుకోరు. కాగా పీకే జగన్ విషయంలో తాను సలహా ఇవ్వలేదని అంటున్నారు.  

ఇక తెలంగాణ లో కేసీఆర్ తరపున  వచ్చే ఎన్నికల్లో పనిచేయాలని  కొన్నాళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్  హైదరాబాద్ కూడా వచ్చారు. తెలంగాణ లో కొన్ని ప్రాంతాల్లో సర్వే కూడా చేసారు.కేసీఆర్ కి  ప్రాధమికం గా ఒక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. అంతలోనే ఆయన మనసు మార్చుకుని కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతలు ఈ సందర్భంగా కేసీఆర్ కి ఎలాంటి ఎన్నికల సేవలు అందించకూడదని షరతు కూడా పెట్టినట్టు చెబుతున్నారు. ఇదే షరతు జగన్ యూపీఏ లోకి రాని పక్షంలో ఆయనకు వర్తింపజేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు కోరినట్టు సమాచారం. కాగా కాంగ్రెస్ అగ్రనేతలు కేసీఆర్ వ్యవహారశైలి పట్ల సుముఖతతో లేరు.

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం టాగూర్‌ కూడా కేసీఆర్‌తో పొత్తుండదు అని ఆ మధ్య చెప్పారు. రాహుల్‌గాంధీ సైతం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈ విషయమై ఇప్పటికే స్పష్టతనిచ్చినట్టు సమాచారం. పొత్తు విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని పార్టీ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీపై పోరులో తమ వైఖరి మారదని స్పష్టం చేస్తున్నారు.  ఆ రెండు పార్టీల నుంచి తెలంగాణను రక్షించేందుకు తాము కృషి చేస్తామని అంటున్నారు. 

మొత్తానికి 2024 జనరల్‌ ఎలక్షన్సే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వేగంగా పావులు కదపడం మంచి పరిణామమే. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్‌ పార్టీ గేరు మార్చి కొంత స్పీడ్ పెంచింది.వాస్తవానికి ఇదొక అనూహ్య పరిణామం. కాంగ్రెసును తప్పించి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరిగాయి.

అయితే ఎన్సీపీ ,శివసేన  బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పడాలంటే అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండాలని పట్టుపట్టాయి. కాంగ్రెస్ దారి కాంగ్రెస్ దే అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదట్లో అన్నప్పటికీ సడన్ గా ఆమె కూడా ప్లేట్ ఫిరాయించేశారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని శివసేన, ఎన్సీపీ నేతలు స్పష్టం చేయడంతో విపక్షాలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. అంతలో ప్రశాంత్ కూడా పార్టీలో చేరేందుకు ముందుకు రావడంతో కాంగ్రెస్ కి ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగిపోయింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!