బంకర్ జవాన్ డ్యూటీ బహు కష్టమే !

Sharing is Caring...

Bunker life ……………………………………బంకర్ లో సైనికుడి జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. బంకర్ అంటే భూగృహం లాంటిది. శత్రుదేశం సైనికులు వేసే బాంబుల నుంచి రక్షణ కల్పిస్తుంది.బంకర్లను సరిహద్దుల్లో నిర్మిస్తారు. సైనికులు వీటిలో ఉంటూ కాపలా కాస్తుంటారు.పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లో కొన్ని వందల బంకర్లను ఆర్మీ నిర్మించింది.

ఈ బంకర్‌లను  సుమారు 26 అడుగుల వెడల్పు 80 అడుగుల పొడవు లో నిర్మిస్తారు. గాలి వెలుతురు వచ్చేలా కిటీకీలు కూడా ఉంటాయి. వీటిలో12 నెలలకు అవసరమయ్యే ఆహార సామాగ్రి….మందు గుండు సామాగ్రి నిల్వ ఉంచుతారు. పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా అవుతుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి.

బంకర్ సైజును బట్టి 1+3; 1+6; 1+8 సైనికులు  అందులో ఉంటారు. వీరిని రెండు మూడు నెలలకు ఒకమారు మారుస్తూ ఉంటారు. 24 గంటలు షిఫ్ట్ వారీగా సైనికులు కాపలా కాస్తుంటారు. ఏమాత్రం అనుమానం వచ్చినా అలెర్ట్ అయి డ్యూటీ ఆఫీసర్ లేదా జూనియర్ ఆఫీసర్ కు సమాచారం చేరవేయాలి. అతగాడు ఇతర పోస్ట్ ల్లో ఉన్న అధికారులను అప్రమత్తం చేస్తారు.

బంకర్స్ లో డ్యూటీ లో ఉన్న సైనికులు సరిహద్దుల్లోని శత్రుస్థావరాలపై ఓ కన్నేసి ప్రతి కదలికను గమనిస్తూ ఆరుగంటల కొకమారు రిపోర్టు పంపుతుంటారు. ఇక భోజనం వారే తయారు చేసుకోవాలి. వంతుల వారీగా చేసుకుంటారు. ఖాళీ సమయంలో ఆయుధాలను సరి చేసుకుంటారు. శాటిలైట్ ఫోన్ ద్వారా సైనికులు వంతుల వారీగా రోజుకి 20 నిమిషాలు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది.

చలి.. ఎండ ..వర్షాలు ఎలాంటి కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్నా తట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. డ్యూటీ లేని సమయం లో కూడా సైనికులు అక్కడే ఉండాలి. ఎక్కడికి పోవడానికి కుదరదు. చాక్లెట్, డ్రై ఫ్రూట్స్ .. డబ్బా జ్యూస్ అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా రొట్టెలు కూర చేసుకుంటారు.

ఇటీవల కాలంలో మన ఆర్మీ అధునాతన బంకర్లను నిర్మిస్తున్నది. శత్రు దేశం సైనికులు బుల్లెట్లు కురిపించినా, బాంబులు పేల్చినా చెక్కు చెదరని బంకర్ల నిర్మాణానికి పూనుకున్నది. గతంలో సంప్రదాయ పద్ధతిలో రాళ్లు,మట్టి లేదంటే ఉక్కుతో నిర్మించే వారు. ఇపుడు వాటి స్థానే  శక్తవంతమైన పేలుళ్లను తట్టుకునేలా బంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్థాన్, చైనా సరిహద్దుల వెంబడి.. తేలికగా ఉండి, సులభంగా ఎక్కడికైనా తరలించేందుకు వీలయ్యే బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్‌‌ను బంకర్ల నిర్మాణానికి వాడుతున్నారు.

మట్టి, రాళ్లతో నిర్మించే బంకర్లు శత్రువుల దాడిలో కూలిపోయే అవకాశాలు ఎక్కువ. సైనికులు ఇలాంటి వాటిలో కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేరు. కొన్నిచోట్ల స్టీల్‌ ఆధారంగా బంకర్లను నిర్మిస్తున్నారు. మరికొన్నిచోట్ల తేలిగ్గా ఉండే మెటీరియల్ తో బంకర్లను ఏర్పాటు చేస్తున్నారు.

కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించే బంకర్లలో ప్రత్యేక కమాండ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూర్చొనే అధికారి క్షేత్రస్థాయిలో పోరాడుతున్న సైనికులకు సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్గిల్ వార్ లో కూడా ఇలాంటి కమాండ్ కేంద్రాలను ఉపయోగించారు. ఇపుడు పూర్తిగా అధునాతన కమాండ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. బంకర్ లో ఏర్పాటు చేసిన పెద్ద తెరపై తన పరిధిలోని యుద్ధ క్షేత్రం మొత్తం కమాండ్‌ కేంద్రం అధికారికి కనిపిస్తుంది. ఉపగ్రహం నుంచి నేరుగా సమాచారం కూడా అందుతుంది. టెక్నాలజీ ఆధారిత సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!