Govardhan Gande …………………………………………………….
వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే. చట్టంలో లేని 66 A సెక్షన్ ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఈ వింత పరిణామంపై ఆశ్చర్యం,ఆందోళనలను వ్యక్తం చేసింది.
66 A సెక్షన్ ( ఐటీ యాక్ట్ )ను రద్దు చేసిన సంగతిని PUCL(పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.ఈ సెక్షన్ పై వేల కేసులు నమోదవుతున్నాయని,దిగువ కోర్టులు విచారణకు స్వీకరిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకు వచ్చింది ఈ సంస్థ.ఈ తీరుపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. కొట్టేసిన సెక్షన్ ఆధారంగా కేసులు నమోదు చేయడం ఏమిటని విస్తుపోయింది.
ఐటీ చట్టంలోని 66A సెక్షన్ ను 2015 (మార్చ్ 24) రద్దు చేశామని ఇంకా ఆ సెక్షన్ ఆధారంగా కేసులు,విచారణలు ఏమిటిని ప్రశ్నించింది ధర్మాసనం.ఈ సెక్షన్ ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ప్రతులను అన్ని హైకోర్టులకు,కింది కోర్టులకు పంపించినట్లు ఈ కేసును విచారించిన ధర్మాసం స్పష్టం చేసింది.ఈ సెక్షన్ రద్దు పై పోలీసులను ఎడ్యుకేట్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది కూడా. ఆర్టికల్ 14(Right to Equality), 19 /1 ( Right to Fundamental Freedom) లకు విరుద్ధంగా ఉందని నిర్దారిస్తూ సుప్రీం కోర్ట్ ఈ సెక్షన్ ను రద్దు చేసింది.
అయినప్పటికీ కేసులు నమోదు అవుతున్నాయంటే విచిత్రం గా ఉంది. వ్యవస్థలో చాలా అవగాహనా లోపం ఉందని అర్ధం చేసుకోవాలి.గత ఆరేళ్లలో 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 381 కేసులు మహారాష్ట్ర లో ఉన్నాయి. జార్ఖండ్, యూపీ రాజస్థాన్ లో ఆ సెక్షన్ ను ప్రయోగిస్తూ ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు బిగించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 53 కేసులు నమోదు అయ్యాయి. శ్రేయా సింఘాల్ కేసులోనే సెక్షన్ 66 A ను కొట్టేస్తూ తాను ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదు అంటూ 2019 లోనే సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది.
కానీ తీర్పును కింది స్థాయి కోర్టులు.. పోలీసులు సంపూర్ణంగా అధ్యయనం చేయక పోవడం,అర్ధం చేసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అనుకోవాలి. చట్టాలపై పోలీసులకు మరింత అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు. 75 ఏళ్ళ స్వతంత్ర వ్యవస్థలో కూడా ఇలాంటి తప్పులు,పొరపాట్లు చోటు చేసుకోవడం ఎలా సమర్థనీయం? ఫలితంగా లేని సెక్షన్ కారణంగా ఎందరో అమాయకులు ఇబ్బంది పడ్డారు.వేధింపులకు గురయ్యారు. ఇది అన్యాయమే కదా.
లోపం ఎక్కడుందో సరిదిద్దుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాజ్యాంగ వ్యవస్థపై ఉన్నది. ఇప్పటికైనా నమోదు అయినా కేసులను ఎత్తేసి బాధితులకు విముక్తి కల్పించాలి. సుప్రీం ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలి.