Sankeertan ……………………… South directors who shook Bollywood
బాహుబలి దెబ్బ నుంచి బాలీవుడ్ కాస్త తెరుకుంటున్న టైమ్ అది. ఇక ఇప్పుడప్పుడే రాజమౌళి సినిమా రాదులే.. ఓ ఐదేళ్లు పడుతుందిలే అని బాలీవుడ్ ఫిక్స్ అయింది. కట్ చేస్తే… రాకీ భాయ్ ఎంట్రీ ఇచ్చాడు. యష్ సూపర్ ఎంట్రీతో నార్త్ జనాలు వెర్రెక్కిపోయారు.
సూపర్ ఎలివేటిక్ సీన్స్, యష్ మేనరిజమ్, ప్రశాంత్ నీల్ అల్టిమేట్ డైరెక్షన్..! ఇంకేముంది హిందీ జనాలు బట్టలు చింపేసుకున్నారు. సలామ్ రాకీ భాయ్ అంటూ కేజీఎఫ్‌కు సలామ్ కొట్టి మరీ స్వాగతం పలికారు.
యష్… కర్ణాటకలో ఓ సాధారణ డ్రైవర్ కొడుకు. ప్రశాంత్ నీల్… కన్నడలో ఉగ్రం సినిమా తీసిన.. ఓ అప్ కమింగ్ డైరెక్టర్. ఇంతే ఇంకే లేదు అక్కడ. కట్ చేస్తే… కేజీఎఫ్…పడింది. ఇంకేముంది బాలీవుడ్ గుండెళ్లో గుండ్రాయి పడినట్లు అయింది. మూలిగే నక్కమీద తాటికాయపడినట్లు.. బాహుబలి లాంటి సినిమా ఎలా తీయాలని బుర్రబద్దలు కొట్టుకుంటున్న బాలీవుడ్‌కు.. కేజీఎఫ్‌తో ఓ మహాసముద్రం కనిపించింది. ఈ సముద్రాన్ని ఈదాలంటే ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడేసింది.
హీరోలు అంటే అంగీలు విప్పి కండలు చూపించడం కాదు.. బెల్ బాటం ప్యాంట్… ఓ నార్మల్ బ్లేజర్‌తో స్టన్నింగ్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో బాలీవుడ్‌కు రుచి చూపించాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ సూపర్ ఎలివేటిక్ సీన్లు చూసి… బాలీవుడ్‌కు మెంటల్ ఎక్కిపోయింది. హిందీ మార్కెట్లో యష్ ఫాలోయింగ్ చూసి ఖాన్లకు కళ్లు బైర్లు కమ్మాయి.
దేశంలో ఎవ్వరికీ తెలియని ఓ చిన్న ఇండస్ట్రీ… అది కూడా సౌత్ నుంచి వచ్చిన ఓ చిన్న హీరో.. ఎలాంటి బడా హిట్ లేని ఓ చిన్న డైరెక్టర్… బాలీవుడ్ బాక్సాఫీస్‌ని దోచుకుంటుంటే కళ్లప్పగించి చూడటం తప్ప ఏం చేయలేని అచేతన స్థితిలో ఉండిపోయారు బాలీవుడ్ దర్శక, నిర్మాతలు.
రణరణరణ ధీరా అంటూ రవీ బర్సూర్ కొట్టిన ఒక్కో బీజీఎమ్… హిందీ బెల్ట్ బీ,సీ సెంటర్ల థియేటర్లలో ఉన్న సౌండ్ బాక్స్‌ల్లోని దుమ్మును దులిపేసింది. థియేటర్ల గోడలు బద్దలవుతాయా? అన్న స్థాయిలో రవీ బర్సూర్ పాటలు బాలీవుడ్లో మారుమోగిపోయాయి. ఇక కేజీఎఫ్2 బాలీవుడ్‌ను ఊచకోత కోసింది.
ముఖ్యంగా ముంబైని షేక్ చేసి.. నార్త్ మొత్తం రీ సౌండ్ వినిపించేలా చేసింది. వాయిలెన్స్… వాయిలెన్స్.. వాయిలెన్స్… అన్న యష్ డైలాగ్స్… బీహార్, యూపీని చుట్టేశాయి. సౌత్ సినిమా అని మర్చిపోయి.. హిందీ జనాలు థియేటర్లకు క్యూకట్టేలా చేశాయి.
అప్పటి వరకు రాజమౌళి.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్. ఇంకేముంది.. బాలీవుడ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి సినిమా అనౌన్స్ చేస్తారో..! ఎలాంటి సినిమాను రీలీజ్ చేస్తారన్న భయం బాలీవుడ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసిందనే చెప్పాలి. ఈ భయంతో చచ్చిపోతున్న బాలీవుడ్‌కు మరో షాకింగ్ న్యూస్..
బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ ‘సలార్’ అనౌన్స్ చేసి.. ఖాన్ల వెన్నులో వణుకు పుట్టించాడు. కేజీఎఫ్‌ను నిర్మించిన అదే ప్రొడక్షన్ హౌజ్ హోంబలే ఫిల్మ్స్ నుంచి వచ్చిన ‘కాంతారా’.. బాలీవుడ్‌కు పీడకలను మిగిల్చింది. లో బడ్జెట్ హై రిటర్న్స్‌తో దేశంలో ఓ బెంచ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది.
కేజీఎఫ్, కేజీఎఫ్2 వంటి సినిమాలు చూసి బయటకు వచ్చి బాలీవుడ్ పని అయిపోయిందని ముక్తకంఠంగా హిందీ జనాలు అనడం మొదలు పెట్టారు. అప్పటి వరకు సౌత్ సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుంది అని మాత్రమే ఆ హిందీ జనాలే.. కేజీఎఫ్ చూసిన తర్వాత బాలీవుడ్ పని అయిపోయిందని చెప్పడం.
బాలీవుడ్ కనుచూపు మేరలో కూడా లేదన్న నగ్నసత్యాన్ని బయటపెట్టింది. క్రిటిక్స్, ఎనలిస్టులు కూడా బాలీవుడ్ ఎందుకు ఇలాంటి సినిమాలు తీయడం లేదన్న చర్చ ప్రారంభించారు. అసలు బాలీవుడ్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయన్న అంశాన్ని బేరీజు వేశారు.
బాహుబలి, కేజీఎఫ్ సిరీస్‌లతో సోయిలోకి వచ్చిన బాలీవుడ్ బయ్యర్లు… ఇటు హైదరాబాద్, అటు బెంగళూరుకు అప్ అండ్ డౌన్ చేయడం మొదలు పెట్టేశారు. లాంగ్వేజ్ రాకున్నా.. బయ్యా తోడా ప్యాజ్ దాలో అన్నట్లు.. బయ్యా ఏక్ సినిమా దాలో… అంటూ మనకు అర్థమైయ్యే హిందీలో మాట్లాడుతూ ఇక్కడి దర్శకుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.