పీకే కి పోటీగా రంగంలోకి బీజేపీ వ్యూహకర్తలు !

Sharing is Caring...

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం పనిచేస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి పోటీగా బీజేపీ కూడా వ్యూహకర్తలనే రంగంలోకి దించబోతోంది. యూపీ లో మాదిరిగా డబుల్ ఇంజన్ బుల్డోజర్ ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించేందుకు వ్యూహరచన చేస్తోంది. రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ తెలంగాణ లో గెలుపు దిశగా పావులు కదుపుతోంది. 

ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుని బలం పుంజుకున్న రాష్ట్ర బీజేపీ  ఇపుడు సరికొత్త ఉత్సహంతో దూకుడు మీద ఉన్నది. కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు బ్రేకులు వేసిన బీజేపీ ..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగుర వేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా కేంద్ర బీజేపీ నేతలు ఒక వ్యూహకర్తల బృందాన్ని తెలంగాణకు పంపుతున్నారు.

ఈ వ్యూహకర్తల బృందం మొన్నటి యూపీ ఎన్నికల్లో యోగి విజయం కోసం పనిచేశారు. ఈ టీమ్ అక్కడే మకాం వేసి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేసింది. జనంలోకి వెళ్లి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేశారు. వినూత్న పంధాలో ప్రచారం చేసి యోగిని మళ్ళీ గద్దె నెక్కించారు. 

ఇపుడు అదే టీమ్ తెలంగాణా లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను తిప్పికొట్టేందుకు రాబోతున్నది. ప్రశాంత్ కిషోర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో బీజేపీ వ్యూహకర్తల టీమ్ కి బాగా తెలుసు. 60 మంది సభ్యులతో కూడిన ఈ టీమ్ తెలంగాణ లో పర్యటించి కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై అధ్యయనం చేస్తుంది. అధ్యయన ఫలితాలకు అనుగుణం గా అవసరమైన కౌంటర్ వ్యూహాలను రూపొందించి బీజేపీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగాలో డిజైన్ చేస్తుందని అంటున్నారు.

ఈ కౌంటర్ వ్యూహాలతో కేసీఆర్ వైఫల్యాలను జనంలోకి తీసుకువెళతారు.మరి కొద్దీ రోజుల్లో ఈ టీమ్ తెలంగాణా కు రాబోతున్నదని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నారు. ఎన్నికల వ్యూహకర్తల సూచనల మేరకు సోషల్ మీడియా లో విజృంభించి ప్రచారం చేస్తారు.  తెరవెనుక ఆర్ ఎస్ ఎస్ కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే మీడియా సంస్థల సహకారం తీసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ తరహా ‘డబుల్ ఇంజన్’ నినాదం ఇక్కడా ఉపయోగించాలని బీజేపీ భావిస్తోంది. అలా అయితే సర్కార్ ను ఏర్పాటు చేయడం ఖాయం అని బీజేపీ  నేతలు అంచనా వేస్తున్నారు.కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రాల్లో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అన్న నినాదంతో ఈ సారి ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ సర్కార్ ను ఎండగట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

మరోవైపు కేసీఆర్ ఎన్నికల హామీల అమలు కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని ..అందుకోసం    నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని  రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా నాయకులను,క్యాడర్‌ ను సిద్ధం చేసే యత్నాలకు శ్రీకారం చుడుతున్నారు.

కేంద్ర నాయకులు కూడా ఇకపై తరచుగా తెలంగాణ కొచ్చి సభలు, సమావేశాలు పెట్టి ప్రజలను జాగృత పరిచేలా ఒక క్యాలెండర్ ను రూపొందిస్తున్నారు. త్వరలో ప్రధాని మోదీ,కేంద్ర హోమ్ మంత్రి అమితాషా లతో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలకు మరికొంత సమయం ఉంది కాబట్టి ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా పనిచేస్తే విజయం తధ్యమని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!