అందరిని ఆకట్టుకునే ‘సైకిల్’ !

Sharing is Caring...

Cycle మరాఠీ సినిమా ఇది. వస్తు వ్యామోహం తో ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని ప్రధానాంశంగా తీసుకుని నిర్మించిన సినిమా ఇది.కథ విషయాని కొస్తే కేశవ్(హృషికేశ్ జోషి) తాత తనకు ఒక విదేశీయుడి నుండి కానుకగా వచ్చిన పసుపు రంగు సైకిల్ ని .. తాను చేసే వైద్యాన్ని మనవడు కేశవ్ కు వారసత్వంగా ఇచ్చి చనిపోతాడు. 

కేశవ్ ఆ సైకిల్ ను ప్రాణప్రదంగా చూసుకుంటూ,తన వూర్లోను,చుట్టుపక్కల పల్లెలకు ఆ సైకిల్ మీదనే వెళ్తూ వైద్యం చేస్తుంటాడు. మంచి వైద్యుడిగా,జ్యోతిష్కుడుగా,హస్త సాముద్రికుడుగా పరోపకారిగా పేరు తెచ్చుకుంటాడు.ఒక రోజు గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకం చూడటానికి భార్య,కూతురు తండ్రితో కలిసి వెళతాడు కేశవ్. వెళ్లే  హడావుడిలో సైకిల్ కు తాళం వేయటం మర్చిపోయి అలాగే ఇంటిముందు పెట్టి వెళతాడు.

ఆ రాత్రి గ్రామస్తులంతా నాటకం చూసే పనిలో వుంటే ఇద్దరు దొంగలు గజియా (బల్చంద్ర కదం) మాంగ్యా(ప్రియదర్శన్ జాదవ్) ఆ వూరి లోని ఒక ధనవంతుని ఇంట్లో పడి బంగారం దేవుని విగ్రహాలు చోరీ చేస్తారు.కుక్కలు వారిని తరుముతాయి..వాళ్ళు తప్పించుకోవటానికి పరుగెత్తుతూ కేశవ్ ఇంటి ముందున్న సైకిల్ దొంగలించి దాని మీద వుడాయిస్తారు.

ఇక అప్పటినుండి సైకిల్ వెతుకుతూ కేశవ్ బాధ పడుతుంటాడు. తిండి తిప్పలు లేకుండా దాని గురించే ఆలోచిస్తుంటాడు. కేశవ్ పరిస్థితిని  చూసి భార్య జయా (దీప్తి లేలే) కుమార్తె చిన్నపాప (మైధిలి) తండ్రి  దిగులు పడతారు. సైకిల్ తో వాళ్ళ కున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ బాధపడుతూ వుంటారు.

సైకిల్ దొంగలించిన దొంగ లిద్దరూ,బంగారం,విగ్రహాల సంచుల మూటలతో తప్పించుకుంటూ, చుట్టు పక్కల పల్లెల్లో తిరుగుతూ వుంటారు. ఏ వూరికి వెళ్ళినా సైకిల్ ను  గుర్తు పట్టిన జనం, కేశవ్ సైకిల్ ని  ఎవరినీ ముట్టనివ్వడు కదా…  మీకెలా ఇచ్చాడని అడుగుతుంటారు..తప్పించుకోవటానికి కేశవ్ పెద నాయన పిల్లలం అని అబద్దం చెప్తారు. ఒక వూర్లో కమ్మటి భోజనం పెట్టీ స్వీట్స్ డబ్బా ఇచ్చి కేశవ్ కి ఇవ్వమంటారు.

మరో వూర్లో కమ్మటి టీ ఇచ్చి దుకాణదారుడు తాను కేశవ్ కి ఇవ్వాల్సిన డబ్బు అతనికి చేర్చండి అంటూ డబ్బు ఇస్తాడు. మరో వూర్లో స్కూల్ ఫంక్షన్ కి ఈ ఇద్దరు దొంగలను ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తారు.స్కూల్ ప్రధానోపాద్యాయుడు వాళ్ళతో ప్రసంగం ఇప్పించి శాలువా లతో ఘనంగా సత్కరిస్తారు.. కేశవ్ ఆ స్కూల్ కి చేసిన సాయం గురించి చెప్తాడు..స్కూల్ లో ఒక చిన్నపాప తను ఎంతో ప్రేమగా దాచుకున్న చిన్నిశంకుని  కేశవ్ కి ఇవ్వమని ఇస్తుంది.

ఏ వూరి వెళ్ళినా కేశవ్ మంచితనం ఆ దొంగలకు అడుగడునా ఎదురవుతుంది..దానితో దొంగలు మనసు మార్చుకుని  సైకిల్ ను ఎలాగైనా కేశవ్ కి అప్పగించాలనుకుంటారు. ఆ సైకిల్ తో వాళ్ళ కెదురైన ఇబ్బందుల నుండి తప్పించుకునే ప్రయత్నం లో ఆ ఇద్దరు దొంగల అవస్థలు మనల్ని విపరీతంగా నవ్విస్తాయి..చక్కని హాస్యం పండించడం లో ఇద్దరు నటులు కృతకృత్యులైనారు.

కేశవ్ కూతురు తన తండ్రిని ” అందరికీ జాతకాలు చెబుతూ వుంటావు కదా,మరి నీ సైకిల్ జాతకం చెప్పలేవా.? అంటుంది. తను చెప్పిన జ్యోతిష్యం ఆధారంగా ఇల్లు కూలిపోయి నా…  ఎటువంటి చింత లేకుండా ఆ ఇంటిముందు వున్న చెట్టు కిందే ఆనందంగా వున్న కుటుంబాన్ని చూసి వాళ్ళ లాగే తను గూడా వస్తు వ్యామోహం వదులు కోవాలనుకుంటాడు.

సైకిల్ మీద ఇంత ప్రేమను… అనుబంధాన్ని పెంచుకోవటం వలనే కదా ఇప్పుడిం త బాధ పడుతున్నాను.. ఏది శాశ్వతంగా వుండదు.మనుషులే ఎల్లకాలం జీవించి వుండరు..ఇక వస్తువు లెంత అనుకుంటాడు.ఈ లోగా దొంగలిద్దరు సైకిల్ కేశవ్ కి కనబడే విధంగా ఉంచి  ఒక వుత్తరం రాసి పెట్టీ వెళ్ళి పోతారు.

కేశవ్ వుత్తరం చదువుతాడు సైకిల్ ను ప్రేమగా నిమురు తూ అదే సమయంలో ఆ సైకిల్ ను చూస్తూ దాన్ని తడుముతూ ఆనందిస్తున్న ఒక పిల్లవాడినీ కేశవ్ చూస్తాడు.కేశవ్ ఆ సైకిల్ ని  ఆ పిల్లవాడికి ఇచ్చివేసి, తృప్తి నిండిన మనసుతో ఇంటికి బయలు దేరుతాడు.

ఇంటికి వెళ్లేసరికి ఇంటి ముందు అప్పుడే పసుపు రంగు వేసిన,ఇంకా తడారని సైకిల్ తో వూరి జనం ఎదురు చూస్తూ ఉంటారు. కేశవ్ మంచితనం తెలిసిన గ్రామస్తులందరూ కలిసి ఒక సైకిల్ కి పసుపు రంగు వేసి తెచ్చి కేశవ్ ఇంటి ముందు పెడతారు.కేశవ్ ప్రేమతో ఆ సైకిల్ ని తాకుతాడు. అతని చేతికి అప్పుడే వేసిన పసుపు రంగు పెయింట్ అంటుకుంటుంది.

దాన్ని పాప ముక్కుకు రాసి సంతోషాన్ని వెలి బుచ్చుతాడు. చెప్పదలుచుకున్న విషయాన్ని దర్శకుడు ప్రకాష్ కుంటే చక్కగా చిత్రీకరించాడు. ఈ సినిమాకు అవార్డులుకూడా వచ్చాయి.  2018 మే లో ఈ చిత్రం విడుదలైంది. కథ, స్క్రీన్ ప్లే అదితి మోఘె సమకూర్చారు.  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ సందేశాత్మక చిత్రం netflix లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.

——-   పూదోట శౌరీలు .. బోధన్ 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!