‘దేవదాసు’ పాత్ర సృష్టికర్త ఈయనే !!

Sharing is Caring...

Most popular writer……………………………………

ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ‘దేవదాసు’ నవలను రచించిన విషయం తెలిసిందే. సాహితీ ప్రియులు అందరూ ఈ నవలను చదివే ఉంటారు. శరత్‌ ‘దేవదాసు’ నవలతో పాటు మరెన్నో రచనలు చేసారు. 1928లో ‘దేవదాసు’ నవలను బెంగాలీ నిర్మాత  మూకీ చిత్రంగా తీశారు.

అదే నవలను 1935లో న్యూ థియేటర్స్‌ వారు పి.సి.బారువా దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. ఆ తర్వాత తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా తెరకెక్కింది. బెంగాలీ చిత్రంలో ‘బారువా’ నటిస్తే, హిందీలో ‘కె.ఎల్‌.సైగల్‌’ దేవదాసుగా నటించారు.

ఆ తర్వాత హిందీలో ‘దిలీప్ కుమార్’ దేవదాసుగా నటించారు. ఆ తరువాత కూడా అనేక సార్లు వివిధ భాషల్లో ‘దేవదాస్’ ను రీమేక్ చేశారు. తర్వాత కాలంలో షారుఖ్ ఖాన్, అభయ్ డియోల్ లతో కూడా  దేవదాసు హిందీలో తీశారు. పురాణాలు, చరిత్రలు కాకుండా భారతీయ భాషల్లో అత్యధికసార్లు సినిమాగా  నిర్మితమైన కథగా ‘దేవదాసు’ రికార్డ్ సృష్టించింది. 

శరత్ చంద్ర చటోపాధ్యాయ ఆనాటి సమాజం లోని అనేక అంశాలను, మధ్యతరగతి జీవితాలను, ఉన్నత కుటుంబాల్లో జరిగే ఘటనలనే  నవలలు గా మలిచి  దేశవ్యాప్తంగా రచయిత గా గొప్పపేరు సంపాదించుకున్నారు.  సమాజాన్ని,వ్యక్తిని లోతుగా పరిశీలించి ఆయన సృష్టించిన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. 

శరత్ రాసిన కథల ఆధారంగా 44 సినిమాలు వివిధ భాషల్లో నిర్మితమైనాయి. వాటిలో ముఖ్యమైనది ‘దేవదాసు’. దీనిని మొదట నవలగా రాశారు. ఈ నవల 1917 లో మొదటిసారి పబ్లిష్ అయింది. అప్పట్లో ఈ నవల ఉప్పెనలా  జనంలోకి చొచ్చుకుపోయింది.

నిర్మాత,రచయిత చక్రపాణి తెలుగులో అనువదించారు.అలాగే అట్లూరి పిచ్చేశ్వరరావు,బొందల పాటి శివరామకృష్ణ వంటి రచయితలు కూడా ‘దేవదాసు’ను అనువదించారు. 

దేవదాసు నవల రాసినప్పుడు చాలామంది ఇది శరత్ జీవితంలో .. లేక వేరే వ్యక్తి జీవితం లోని సంఘటనల నుండి స్ఫూర్తి పొంది ఉండొచ్చని  అనుకున్నారు. దేవదాస్ అనే వ్యక్తి నిజంగానే ఎక్కడో ఉండే ఉండొచ్చని ఊహాగానాలు చేశారు.

అయితే శరత్ మాత్రం తాను నిజజీవిత పాత్ర నుండే స్ఫూర్తి పొందానని అయితే అది దేవదాసు కాదు పార్వతి అని చెప్పి షాక్ ఇచ్చారు. బెంగాల్ లోని హతిపోత గ్రామానికి చెందిన జమీందార్ భువన్ మోహన్ చౌదరి రెండవ భార్య జీవితం లోని ఘటనల ఆధారంగా ‘దేవదాసు’ రాసారని మరో ప్రచారం కూడా ఉంది.

పరిణీత,స్వామి,అప్నే పరాయే,ఛోటీ బహు వంటి హిందీ సినిమాలు ఆయన రాసిన కథల ఆధారంగానే తీశారు. అలాగే తెలుగులో తోడికోడళ్లు,బాటసారి, వాగ్దానం చిత్రాలను శరత్ కథల ఆధారంగానే తీశారు. 

శరత్ పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా దేవానందపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. “ప్యారై పండిట్” పాఠశాలలో చదువు ప్రారంభించి,తర్వాత హూగ్లీ బ్రాంచ్ హై స్కూల్ లో చేరాడు.పేదరికం కారణంగా తర్వాత చదువు మానేశాడు.శరత్ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు బీహార్ లోని భాగల్పూర్లో నివసించారు.

శరత్ రచనల్లో చాలా వరకు భాగల్పూర్లో రాసినవి లేదా భగల్పూర్ అనుభవాల ఆధారంగా రాసినవే.తల్లిదండ్రుల మరణం తర్వాత 1903లో బర్మా వెళ్ళి, అక్కడ ప్రభుత్వాఫీసులో గుమాస్తాగా ఉద్యోగం చేశారు.

కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేక, తిరిగి వచ్చేశారు.ఆయన 1938లో కాలేయ సంబంధ కాన్సర్ తో మరణించారు.శరత్ జీవిత చరిత్రను హిందీలో ప్రముఖ రచయిత విష్ణు ప్రభాకర్ రాశారు. 1876 సెప్టెంబరు 15 న జన్మించిన శరత్ 1938 జనవరి 16 న కన్నుమూసారు.

వివిధ భాషల్లో ఆయన కథలను నవలలను కొన్ని లక్షలమంది పాఠకులు చదివారు. ఆయన కనుమూసి 87 ఏళ్ళు అవుతున్నా పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.బెంగాలీ సాహిత్యానికి శరత్ చేసిన కృషికి అవార్డులు అందుకున్నారు. ‘కుంతలిన్ పురస్కార్'(1903), ‘జగత్తరిణి స్వర్ణ పదక్'(1923), ‘బంగియా సంగీత పరిషత్’ (1934)అవార్డులు పొందారు.1936లో ఢాకా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

post upadated on 29-1-2025 

  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!