జేడీ (యు) నాయకుడు నితీష్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవకుండానే 8 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు.
నలభై ఏళ్ళక్రితం నలందా జిల్లాలోని హర్నాట్ అసెంబ్లీ స్థానం నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1985 అక్కడి నుంచే లోక్ దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. 1989 లో లోక సభకు ఎన్నికయ్యారు. వరుసగా అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు.
ఆ తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకే కాబోలు ఆయన ప్రత్యర్థులు పదే పదే ఎద్దేవా చేస్తుంటారు. ధైర్యముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని సవాళ్లు విసురుతుంటారు. అయితే నితీష్ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటాడు. 2004 తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ నితీష్ పోటీ చేయలేదు.
ఎమ్మెల్సీ అయిపోయి దర్జాగా సీఎం కుర్చీలో కూర్చుంటున్నాడు. ఇలా అసెంబ్లీ కి పోటీ చేయకుండానే ఇన్ని సార్లు సీఎం అయిన ఖ్యాతి నితీష్ కే దక్కుతుంది. కాగా నితీష్ మొదటి సారి సీఎం అయింది 2000 సంవత్సరంలో. అప్పటికి నితీష్ బీహార్ లోని ఏ సభలోను సభ్యుడు కాదు. అయితే అసెంబ్లీ లో తగు బలం లేక కేవలం 7 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు.
2005 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలసి బీహార్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి వరుసగా 2010,2015,2017 సంవత్సరాలలో వరుసగా సీఎం అయ్యారు. వరుసగా సీఎం అయినప్పటికీ ఎక్కడా పోటీ చేయలేదు. ఇది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.
ఇక శాసనమండలికి వరుసగా ఎంపిక అవుతూ సీఎం గా నెట్టుకొస్తున్నారు. నితీష్ కుమార్ 2018లో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024లో ముగుస్తుంది.ప్రత్యర్థుల సవాళ్లకు జవాబు చెబుతూ తాను ఏదో ఒక నియోజక వర్గానికి పరిమితం కాదల్చుకోలేదని… అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యే అయిఉండాలి అనే నిబంధన ఉన్నట్టయితే నితీష్ పప్పులు ఉడికేవి కావు. కాగా ఎన్డీయే కి రామ్ రామ్ చెప్పి ఆర్జేడీతో కలసి ఎనిమిదో మారు సీఎం అయ్యారు.
post updated on 13/8/23