బాపు దృశ్యకావ్యం !!

Sharing is Caring...

 Subramanyam Dogiparthi…………………..

దర్శకుడు బాపు తీసిన దృశ్య కావ్యం ఈ భక్త కన్నప్ప. ఆయన తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమో అనిపిస్తుంది . అంత బాగా తీసారు . శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరయిన ధూర్జటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాలలో ఇది ఒకటి .

1976 లో విడుదల అయిన ఈ భక్త కన్నప్ప అప్పట్లో ప్రేక్షకులను అలరించింది.  దీనికి ముందు కన్నడ హీరో రాజకుమార్ నటించిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం సినిమా వచ్చింది.  బాపు గారి ఈ సినిమా కృష్ణంరాజుని తిరుగులేని పాజిటివ్ హీరోని చేసేసింది..  వాణీశ్రీ గురించి చెప్పేదేముంది . ఈ ఇద్దరి జోడీని , వారిద్దరి మధ్య ప్రేమను బాపు అద్భుతంగా ఆవిష్కరించారు.  

William Wordsworth లాగా బాపు ప్రకృతి ప్రేమికుడు . సుమారు 90  శాతం  ఔట్ డోర్ షూటింగే . పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం , పట్టిసీమ ప్రాంతాల్లో తీసారు. తిన్నడి గూడెం , తిన్నడు మల్లన్న ఫైటింగుల ఎరీనా, డ్రమ్ముల మీద వాణిశ్రీ డాన్సులకు కావలసినంత ప్రదేశం. 

ఈ సినిమాలో ప్రతీ పాత్రను గొప్పగా మలిచారు . బహుశా ఒక్క సన్నివేశాన్ని , ఒక్క డైలాగునీ తొలగించలేమేమో ! అంత గొప్ప స్క్రీన్ ప్లే , దర్శకత్వం . ఈ సినిమాను రెండు వందల రోజులు ఆడించిన వారిలో మరో ఇద్దరు ముఖ్యులు సంగీత దర్శకుడు సత్యం , నృత్య దర్శకుడు శీను .

బాల సుబ్రమణ్యం పాడిన తకిటతక తకిటతక చకిత  పదయుగళం పాటతో , శివ తాండవంతో , కిరాతార్జునీయంతో సినిమా ప్రారంభమవుతుంది . మహానుభావుడు వేటూరి అద్భుతంగా వ్రాసారు . ఆయన వ్రాసిందే మరో పాట శివ శివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో . మహా శివరాత్రి నాడు , పర్వదినాలలో మనమందరం వినే భక్తి పాట . రామకృష్ణ చాలా బాగా పాడారు .

కండ గెలిచింది కన్నె దొరికింది పాటలో వాణిశ్రీ డాన్స్ ఆమె కెరీర్లో న భూతో న భవిష్యతి . ముతగ్గా చెప్పాలంటే ఇరగతీసింది . డ్రమ్ముల మీద డాన్స్ . నృత్య దర్శకుడు శీనుకు హేట్సాఫ్ . రామకృష్ణ , సుశీలమ్మ పాడారు . మరో పాట ఆకాశం దించాలా నెలవంకా తుంచాలా . వేటూరి గారిదే . ఆరుద్ర వ్రాసిన పాట ఎన్నియలో ఎన్నియలో సందమామా సిన్నాదాని మనువు సేయి సందమామా . వీటిని కూడా రామకృష్ణ , సుశీలమ్మలే పాడారు . బహుశా రామకృష్ణని ఇంకా జనం గుర్తులో ఉంచింది ఈ సినిమాయే కావచ్చు .

ప్రత్యేకంగా మురిసిపోవాల్సిన పాట శివ శివ అననేలరా పాట , జయమాలిని నృత్యం . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాట మిట్ట మధ్యాహ్నం తోటలో షూట్ చేసారు . పౌర్ణమిని చూపించారు బాపు ప్రేక్షకులకు . దేవదాసి పాత్రలో జయమాలిని నటన , నృత్యం సూపర్బ్ .

ఈ సినిమాలో జనం మరచిపోలేని కాంబినేషన్ తండ్రీకొడుకులుగా రావు గోపాలరావు , సారధిలది . ఏదో వంకర కూత కూస్తావుగా అనే రావు గోపాలరావు డైలాగ్ , పక్కనే ఉండి తండ్రి అఘాయిత్యాలను చూడలేక సతమతమయ్యే కాశీ పాత్రలో సారధి పది కాలాల పాటు గుర్తుండే పాత్రలో నటించాడు . రావు గోపాలరావు సాఫ్ట్ , కన్నింగ్ విలనీ గురించి చెప్పే పనిలేదు .

వీరందరితో పాటు ఝాన్సీ , శివపార్వతులుగా బాలయ్య – వరలక్ష్మిలు , మల్లన్నగా శ్రీధర్ , నీల తండ్రిగా ప్రభాకరరెడ్డి , రెడ్డి గారిగా ముక్కామల నటించారు . ఎవరికి వారు అద్భుతంగా నటించారు . ఈ సినిమా లోని ముళ్ళపూడి వారి కొన్ని డైలాగులు తూటాల్లాగా ఉంటాయి . V S R స్వామి ఫొటోగ్రఫీ , ఆపరేటివ్ కెమేరా మేన్ యస్ గోపాలరెడ్డిల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే .  ప్రకృతి అందాలను అద్భుతంగా తెరకెక్కించారు.

ముత్యాలముగ్గు గురించి ఎలా అయితే గ్రంధాలు గ్రంధాలు వ్రాయవచ్చో , ఈ సినిమా గురించి కూడా అంతే . ఎంత వ్రాసినా తనివితీరదు . అవి పాటల్లోని సాహిత్యం కావచ్చు , మాటలు కావచ్చు , దర్శకత్వప్రతిభ గురించి  కావచ్చు , నృత్యం,సంగీతం, గురించి కావచ్చు ,  ఎవరికి వారు ఈ సినిమాను చూసి తన్మయత్వంలో మునిగిపోవటమే.

ఎన్ని సార్లయినా చూడవచ్చు . శివరాత్రి నాడు ఏదో ఒక చానల్లో రాకుండా ఉండనే ఉండదు . యూట్యూబులో కూడా ఉంది . ఆస్వాదించండి .

కొస మెరుపు …   ఈ  భక్తకన్నప్ప సినిమాకు ముందు అనుకున్న దర్శకుడు బాపు కాదు. వి.మధుసూదనరావు. రచయిత రమణ గారు కాదు బొల్లిముంత శివరామకృష్ణ గారు. కొంత స్క్రిప్ట్ వర్క్ అయ్యాక  కమ్యూనిస్టులైన దర్శక రచయితల  ప్రబావంతో సినిమా ఎటో వెళ్లే ప్రమాదం ఉందని గ్రహించి వారిని ఆపి … బాపు రమణలను రంగంలోకి దింపారు కృష్ణంరాజు.  అలా జరిగి ఉండకపోతే ‘భక్త కన్నప్ప’ కాస్తా ‘కమ్యూనిస్ట్ కన్నప్ప’ అయ్యేవాడని అప్పట్లో జోకులు పేలాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!