శనివారం గిరి ప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలితాలు ఇవేనా ? 

Sharing is Caring...

 Rare sightings…………………………..

శనివారం అరుణాచలంలో గిరిప్రదక్షిణను శ్రీఅరుణాచలేశ్వరాలయం తూర్పు గోపుర ద్వారంలో ప్రారంభించాలి. ఎడమవైపుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఈ ప్రదక్షిణ లో మనకు ఎన్నో దర్శనాలు లభిస్తాయి. ఆలయం ఈశాన్యపు మూల నుండి పొందే పర్వత దర్శనాన్ని ‘ముఖ పర్వత దర్శనం’ అంటారు.

 కన్నులు, చెవులు, ముక్కు, నోరు వంటి ఇంద్రియాలు చేసిన పాపాలను పోగొట్టే దర్శనమిది. రేచీకటి, క్యాటరాక్ట్ , గ్లూకోమా వంటి కంటి రోగాలున్నవారు ఈ దర్శనం పొంది, దృష్టిలోపం కలిగిన పేదలకు కంటి అద్దాలను దానం చేయడం, కంటి ఆపరేషన్‌లకు ధనసాయం చేయడం, కంటి ఆసుపత్రులలో సేవ చేస్తే కంటి రోగాలనుండి బయటపడతారు. 

అదే విధంగా చెవి రోగాల బాధపడేవారు ముఖ పర్వత దర్శనం చేసి, వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి వినికిడి పరికరాలు దానం చేయాలి. వైద్య సహాయం చేస్తూ వస్తే మన చెవి సమస్యలు తొలగుతాయి. కంటి వైద్యులు , ENT specialists వంటివారు ఈ దర్శనం చేయడం ద్వారా వల్ల వృత్తినైపుణ్యం పొందుతారు. స్వరపేటిక లోపం, సక్రమంగా మాట్లాడలేనివారు ఈ దర్శనం చేసి పేద సుమంగళి స్త్రీలకు ముక్కుపుడకలను దానంగా ఇవ్వడం మంచిది. 

ఆత్మస్థయిర్య లింగ దర్శనం
జీవితంలో వచ్చే కష్టాలన్నింటికీ మన పూర్వజన్మ కర్మఫలితాలే కారణం. మంచి చెడ్డలు మన పూర్వజన్మ కర్మలవల్లే కలుగుతాయని పెద్దలు చెబుతుంటారు. కర్మఫలితాలకు పరిహార ప్రాయశ్చిత్త పద్ధతులు ఉన్నప్పటికీ కొన్ని కర్మలను అనుభవించాల్సిందే. వాటిని ఎదుర్కొనగల ఆత్మస్థయిర్యాన్ని అందించేదే ఈ దర్శనం.ఉత్తర గోపురం సమీపంలో నిలిచి అణ్ణామలైవాసుని దర్శిస్తే కొండచరియ, రేఖలు కనిపిస్తాయి. ఆ దర్శనమే ఆత్మస్థయిర్య దర్శనం.

మహామఖ దర్శనం
ప్రతియేటా మాసి నెల పౌర్ణమి, మఖ నక్షత్రంతో కూడిన దినమే మాసిమఖం. గిరి ప్రదక్షిణ మార్గంలో దక్షిణ గోపురం ఎదురుగా తిరుమంజన వీధిని దాటుకుని మూడు రహదారులు కలిసే చోట నిలిచి దర్శిస్తే పర్వతపు కొస ఓ కలశంలా కనిపిస్తుంది. ఇదే మహామఖ దర్శనం. గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ దర్శనం చేసుకున్న తర్వాత ఆహార పదార్థాలను దానం చేసినట్లయితే మాసిమఖం మహాస్నాన శుభ ఫలితాలన్నీ కలుగుతాయి.

ఏకముఖ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో రమణాశ్రమం సమీపంలో లభించే దర్శనమే ఏకముఖ దర్శనం. ఏకాగ్రత మనస్సుతో ధ్యానం వంటి ఉన్నత స్థితులను ప్రాప్తింపజేసే అరుదైన దర్శనమిది. ‘దేవుడొక్కడే’ అనే భావాన్ని అందిస్తుంది. ధ్యానమార్గంలో పయనించదలచినవారు ఈ చోట ఆశీనులై ‘అరుణాచల శివా! అరుణాచల శివా!’ అని స్తుతించి ప్రార్థించాలి. నిరుపేదలకు జీడిమామిడి పప్పులను దానం చేస్తే ధ్యానానికి అవసరమైన దేహదారుఢ్యాన్ని, మనోశక్తిని పొందగలుగుతారు. జీడిమామిడి పప్పులు మంత్రశక్తిని గ్రహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

శివ పంచముఖ దర్శనం
సెంగం రహదారిలో కొంత దూరం పోయాక ఓ చోట ఐదు ముఖాలతో కూడి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనాన్నే పంచముఖ దర్శనమని పిలుస్తారు. కొన్ని సందర్భాలలో పలు వర్ణాలతో ఈ దర్శనాన్ని పొందగలం. భాగ్యం కలిగినవారికే ఈ అవకాశం లభిస్తుంది.క్షయ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ దర్శనం చేసి నారింజ, పనస, అనాస ఫలాలను దానం చేస్తే రోగం నయమవుతుంది. ఎలాంటి చర్మవ్యాధులనైనా ఈ దర్శనం పోగొడుతుంది. చర్మవ్యాధి వైద్యనిపుణులు ఈ దర్శనం చేసుకుంటే వృత్తి నైపుణ్యం పొందుతారు. 

యమ లింగ దర్శనం
శనివారం, మఖ నక్షత్రం కూడిన దినాన ఈ దర్శనం పొందటం శుభదాయకం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగ దర్శనం పొంది స్తుతిస్తే అక్కడి నుండి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటే అదే యమ లింగ దర్శనమవుతుంది. ఈ యమలింగ దర్శనం ద్వారా తీరని రోగాలతో బాధపడుతూ కష్టపడుతున్నవారంతా రోగవిముక్తులవుతారు. ఈ చోట చేయాల్సిన దానధర్మాలను గురించి సద్గురువుల సలహాలను పొందాల్సి ఉంటుంది.

త్రిజట జ్యోతి లింగ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గంలో కుడివైపు సింహ తీర్థం కనిపిస్తుంది. సింహపు ముఖాన్ని పోలి ఉండే ఈ మార్గంలో ప్రవేశించి మెట్లు దిగి వెళితే సింహ తీర్థాన్ని చూడగలం. ఈ తీర్థంలో స్నానమాచరించి అరుణాచలేశ్వరుని దర్శిస్తే అదే త్రిజట జ్యోతి లింగ దర్శనమవుతుంది. ఈ చోట పితృదేవతలకు తర్పణాలు చేయడం మిక్కిలి శ్రేష్టకరమవుతుంది. స్నానమాచరించేందుకు వీలులేక నీటిమట్టం తగ్గి ఉన్నట్లయితే తీర్థపు జలాలను శిరస్సుపై చల్లుకుంటే చాలును. ఒక వేళ కొలనులోని మట్టిని నుదుట విభూతిలా ధరిస్తే చాలు.

సర్వ లింగ దర్శనం
హిరణ్యాక్షుని వధించటానికి మహావిష్ణువు నరసింహావతారం దాల్చిన గాథ మనకందరికీ తెలిసిందే. అసురుని వధించి అతడి రక్తపు ధారలను వళ్లంతా తాపడం చేసుకున్న శ్రీనరసింహ మూర్తి మరింత ఉగ్రరూపం దాల్చుతాడు. ఆ మహేశ్వరుడే శ్రీశరభేశ్వరుడి అవతారం దాల్చి శ్రీనరసింహుడి ఉగ్రతను తగ్గిస్తాడు.అలా ఉగ్రత తగ్గిన శ్రీనరసింహమూర్తి తిరుఅణ్ణామలైలో గిరి ప్రదక్షిణ చేసి శరభేశ్వరుడిని  దర్శించారు. ప్రహ్లాద తీర్థం నుండి లభించే ఆ దర్శనమే ‘సర్వ లింగ దర్శనం’.ప్రహ్లాద తీర్థం ప్రస్తుతం ఆ చోట కనుమరుగైంది. సద్గురువు సలహా ద్వారా ఆ ప్రాంతం గురించి తెలుసుకోవచ్చు.

కామక్రోధ నివృత్తి దర్శనం

సెంగం రహదారి నుండి కుడివైపు తిరిగితే గిరిప్రదక్షిణ అంతర్గత రహదారిలో దుర్వాసుల ఆలయం, అప్పు ‌నంది ప్రాంతాలను దాటుకుని వెళితే దట్టమైన చెట్లే కనిపిస్తాయి. ఆ ప్రాంతానికి కామకాడు అని పేరు.కన్నులలో కామం పూర్తిగా తొలగనంతవరకు దైవదర్శనం కలుగదని ఎరుకపరుస్తుంది. కామక్కాడు ప్రాంతానికి చేరుకోవడానికి ముందుగానే మూత్ర విసర్జన చేయాలి.

అలా చేస్తే కామపు వికారాలు మనస్సు నుండి తొలగిపోతాయి. ఇక్కడా చేయాల్సిన ఆసన పద్ధతులు, నియమాలు కొన్ని ఉన్నాయి. కామక్కాడును దాటుకుని వెళితే దట్టమైన చెట్ల సంఖ్య తగ్గిన చోట అరుణాచలేశ్వరుడు చక్కగా దర్శనమిస్తారు. ఆ దర్శనానికే కామక్రోధ నివృతి దర్శనం అని పేరు.

ఇక్కడ మనలోని చెడుగుణాలను తలచి, పశ్చాత్తాపం చెంది ప్రార్థించి పరిహారం పొందవచ్చు.
కామక్కాడును దాటుకుని వెళితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను గుర్తు చేసే మూడు ఆకారాలలతో కూడిన త్రిమూర్తి దర్శనం,  గాయత్రీ , సావిత్రి , సరస్వతీ లు కలిసి ఇచ్చే గాయత్రీ దర్శనం వంటి అద్భుత దర్శనాలను పొందవచ్చు.

బాలిక తీర్థం
పేదరికం, జాతక దోషాలు వంటి కారణాల వల్ల వివాహభాగ్యానికి నోచుకోని కన్యలకు ఈ దర్శనం ఓ వరప్రసాదం లాంటిది. వీరు శివరాజతీర్థం సమీపంలో ఉన్న బాలికా తీర్థంలో స్నానమాచరించి మొలకెత్తిన ధాన్యాలను తీర్థంలో జారవిడవడమో లేక వాటిని పశువులకు ఆహారంగా సమర్పించడమో చేయాలి. ఇలా చేస్తే మరు జన్మలోనైనా మంచి భర్తను పొంది దీర్ఘ సుమంగళి అయ్యే భాగ్యం పొందుతారు.

 బ్రహ్మ పూర్ణ శక్తిముఖ దర్శనం
శనివారం గిరి ప్రదక్షిణలో అడిఅణ్ణామలై ప్రాంతంలో శ్రీఆదిఅరుణాచలేశ్వర ఆలయం నుండి పొందే దర్శనమే బ్రహ్మ పూర్ణ శక్తిముఖ దర్శనం. ఈ ఆలయంలో ఉన్న పావురాలు యేళ్లతరబడి జీవించే దైవీక శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పటికీ పలు లోకాలకు వెళ్లి ఈ పావురాలు తిరిగి వస్తుంటాయి. ఈ పావురాలకు నవధాన్యాలు, ముఖ్యంగా రాగులను ఆహారం ఇస్తే మంచిది. శుభఫలితాలను కూడా ఇస్తాయి.

మహర్షులు, దేవతలు, గంధర్వులు, దేవతలు వంటి వారు భూలోకానికి వచ్చినప్పుడు తమ సూక్ష్మ దేహాలను ఆలయగోపురాలలో భద్రపరచి, భూలోకపు జీవరాశులుగా ఆకారం దాల్చి ఆలయంలోని మూర్తులను దర్శించిన మీదట, తమ లోకాలకు తిరిగి వెళుతూ ఆలయ గోపురాలలో దాచిన తమ సూక్ష్మదేహాలను ధరింపజేసుకుని బయలుదేరుతూ, తమ దేహాలను కాపాడిన ఆలయ గోపురాలకు కృతజ్ఞతా భావంతో దైవీక శక్తులను అందించి వెళతారు. కనుకనే ‘గోపుర దర్శనం కోటి పాప విమోచనం’ అని చెబుతారు.

దశముఖ దర్శనం
గిరి ప్రదక్షిణ మార్గం కాంచీ ప్రదాన రహదారితో కలిసిచోట అభయ మండపం ఉంది. ప్రస్తుతం శిథిలమైన స్థితిలో ఉన్న ఈ మండపంలో నుంచి చూస్తే అరుణాచలేశ్వరుడు దశ ముఖాలతో కనిపిస్తాడు. శ్రీమహావిష్ణువు పది అవతారాలతో  మహేశ్వరుడిని మొక్కి తరించిన స్థలమిదే.

ప్రతిమానవుడి దేహంలో పది రకాలయిన (దశ వాయువులు) వాయువులున్నాయి. దేహం నుండి ప్రాణం పోయాక, రోజుకు ఒకటి చొప్పున తొమ్మిది రకాల వాయువులు తొలగిపోతాయి. మృతి చెందిన వ్యక్తి దైవీక స్థితిని బట్టి పదోరోజు కల్లా వాయువు విడిపోతుంది. కనుకనే మానవ దేహానికి పది రోజులపాటు కర్మలు నిర్వర్తించం ఆనవాయితీగా మారింది.

ఉత్తమ, శాంతమైన, చలన రహిత మరణం కావాలని కోరుకునేవారికి దశముఖ దర్శనం శుభప్రదమైనది.
పంచలింగ పంచముఖ దర్శనం… కుబేరలింగం నుండి, ఇడుక్కు పిళ్ళయార్‌ సన్నిధి తర్వాత ఉన్న పంచముఖ లింగాల నుండి తిరుఅణ్ణామలై మహేశ్వరుడిని దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. ఈ చోటు నుండే పంచముఖ మహర్షి  తపస్సు చేసి పంచభూత శక్తులను పొంది దైవ సన్నిధిని చేరుకున్నారు.

శ్రీఇసక్కి సిద్ధులవారి జీవ సంచారమున్న ప్రాంతం కూడా ఇదే. దురలవాట్లకు బానిసలై జీవితంలో అక్రమ మార్గాలను అనసురిస్తున్నవారికి  సిద్ధపురుషుడి జీవన స్థలం సద్గతిని ప్రాప్తింపజేస్తుంది. శివభక్తులు ఈ చోట శంఖాలతో క్షీరాభిషేకం చేసి, నిరుపేదలకు శంఖువులతో పాలను దానం చేస్తే దురలవాట్లకు దూరమవుతారు.

ఇక్కడి నుండి పచ్చయమ్మన్‌ ఆలయం వరకూ ఉన్న మార్గం పక్కగా పలు మహాపురుషులు జీవసమాధులు, కంటికి కనిపించని పలు తీర్థాలు ఉన్నాయి. తగిన సద్గువును ఆశయ్రించి ఈ విశేషాలను గురించి తెలుసుకోవచ్చు.

కోణ లింగ దర్శనం
కాంచి రహదారి చివరన బస్టాండు వైపు వెళ్లే మార్గంలో ఉన్న శ్మశానం నుండి అరుణాచలేశ్వరుడిని దర్శనం చేస్తే అదే కోణ లింగ దర్శనమవుతుంది. కామభావాలు, విపరీతమైన ఆశలు తొలగించే అత్యుత్తమ దర్శనమిది. ఈచోట చల్లటి మజ్జిగను దానం చేయడం మంచిది.

ఫలచార బహులింగ దర్శనం
శనివారం గిరిప్రదక్షిణలో శ్రీపచ్చయమ్మన్‌ ఆలయం నుండి లభించే దర్శనాన్ని ఫలచార బహులింగ దర్శనం అని చెబుతారు. నరాల వ్యాధులు, పక్షపాత వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ దర్శనం చేస్తే రోగాల బారి నుండి బయటపడి సుఖంగా జీవిస్తారు.చివరగా శ్రీభూతనారాయణ పెరుమాళ్‌ సన్నిధిలో మొక్కి స్తుతిస్తే శనివారంనాటి గిరి ప్రదక్షిణ ముగుస్తుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!