ఇన్ని రకాల గురువులున్నారా ?

Sharing is Caring...

Different types of teachers………………………………..

గురువులలో ఎన్నో రకాల గురువులున్నారు. వీరిలో ముఖ్యమైన వారు ఆధ్యాత్మిక గురువులు..ఈ ఆధ్యాత్మిక గురువులు ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిలో సూచక గురువులు శిష్యులకు లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య బోధలు చేసి సాధన చతుష్టయ సంపత్తి కలిగిన భక్తులను తయారు చేస్తారు వీరు.

వేద గురువులు .. వీరు వేద పురాణేతిహాసాలు చదివి, చదివించి, ధర్మ మర్మాలను విశదీకరించి ఆచరించేలా చేస్తారు వీరు.నిషిద్ద గురువులు అనగా సర్వ యంత్ర-తంత్రములు ఉపాసనలు చేయించి వాటి ధర్మాలను బోధిస్తారు వీరు. కామ్యక గురువులు అంటే ధర్మ దాతలుగా సప్త సాధనాలు బోధిస్తారు. త్యాగమూర్తులుగా, భక్తులుగా తన శిష్యులను తయారు చేస్తారు.

బోధక గురువులు వేదాంత గ్రంధ పరిచయం చేస్తారు. బోధక గురువులలో మళ్ళీ ఆరు రకాలైన గురువులు వున్నారని అంటారు. నాద గురువులు .. వీరి స్వరం ఎప్పుడైతే శిష్యునికి చేరుతుందో అప్పుడే ఆతడు జ్ఞాన వంతుడుగా మారతాడు. చాయానిది గురువులు …. చాయానిది అనే ఒక పక్షి వుందట.

దాని నీడ ఎవరిపై పడుతుందో వారు చక్రవర్తులు అవుతారట. ఈ గురువు అనుగ్రహం ఎవరిపై ప్రసరిస్తుందో వారు ఆధ్యాత్మిక చింతన పరులు అవుతారు. పరమ గురువులు … వీరు పరుసవేదిలా శిష్యులకు తన దివ్య స్పర్శతో భక్తిజ్ఞానాల్ని ప్రసాదిస్తారు.చందన గురువులు… వీరు చందన వృక్షంలా జ్ఞాన సుగుణాలను పంచుతారు.

క్రౌంచక గురువులు … దూరంగా వుండి కూడా తన గ్రుడ్లను పొదగ గలిగే శక్తి క్రౌంచక పక్షికి వుంటుందట. అదే విధంగా క్రౌంచక గురువు దూరాన వున్నా తన శిష్యులను ప్రయోజకులను చేయగలరు.వాచక గురువులు … వీరు సాంఖ్య ఉపదేశాలు బోధించి, పరమాత్మ సత్యమని, దేహం అశాశ్వత మని తెలిపి గమ్యం గుర్తు చేస్తారు.

కారణ గురువులు …. వీరు ఆసనాలు, ప్రాణాయామాలు చేయించి చివరకు జీవ బ్రహ్మైక్య సంధానం తో అద్వైత స్థితిని కలిగిస్తారు.సద్గురువులు .. వీరు గురువు-శిష్యుడు ఒక్కటే అని తెలియజేస్తారు. నిజ గురువులు….. పరి పూర్ణమును చూపించి జన్మ రహితునిగా చేస్తారు. ఇలాంటి గురువులు ఇప్పుడు లేరు. ఇక వ్యాసుని తర్వాత శంకరా చార్యులను, దత్తాత్రేయుడ్ని, షిర్డీ సాయిబాబా ను కూడా గురువులుగా భావించి ఆరాధిస్తుంటారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!