Wagner Group……………………………….
కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు.
కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా తన వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చుకోవ డానికి ఈ ప్రయివేట్ మిలటరీని ప్రయోగిస్తుందని అంతర్జాతీయ మీడియాలో కూడా పలు కథనాలు వచ్చాయి. 2017 బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 6000 మంది కిరాయి సైనికులు ఈ సంస్థలో పనిచేస్తున్నట్టు అంచనా.
వీరందరికి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తుంటారు. ఎంతటి కఠినమైన పనైనా దాన్ని పూర్తి చేసే వరకు వీరు నిద్ర పోరు. ఈ కిరాయి సైనికులకు ఏదైనా టార్గెట్ ఇస్తే దాన్నిఅవలీలగా పూర్తి చేస్తారని అంటారు. అయితే చిన్న చితకా పనులు ..చిల్లర హత్యలు ఈ సైనికులు చేయరు. అన్ని మేజర్ కాంటాక్టులు మాత్రమే చేపడతారని చెబుతుంటారు.
ఈ కిరాయి సైనికులకు డిమిత్రి ఉట్కిన్ నాయకుడు. ఇతగాడు రష్యా మిలిటరీ లో ప్రత్యేక దళాల కల్నల్ గా చేసి రిటైర్ అయ్యాడు. 2014 లో ఈయనే వాగ్నర్ గ్రూప్ ను స్థాపించాడు. ఆయన కనుసన్నల్లోనే అన్ని కార్యకలాపాలు నడుస్తుంటాయి.ఉట్కిన్ ఈ గ్రూప్ ను సొంత ఆలోచన మేరకు సృష్టించాడా ? రష్యా ప్రభుత్వ ఆదేశానుసారం ఏర్పాటు చేశాడా అనే దానికి ధృవీకరణలు లేవు.
కాగా ఒలిగార్క్ యెవ్జెనీ ప్రిగోజిన్ అనే వ్యక్తి ఈ సంస్థ అసలు బాస్ అని అంటారు. ఈయనకు రష్యా రాజకీయ నేతలతో దగ్గరి సంబంధాలున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఈ ప్రిగోజిన్ సన్నిహితుడు. నమ్మినబంటు.
వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ యాజమాన్యంలో ఉందని చెప్పుకున్నప్పటికీ .. దాని నిర్వహణ, కార్యకలాపాలు రష్యన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీతో ముడిపడి ఉన్నాయని అమెరికన్ థింక్‌ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) అంటోంది.
ఈ కిరాయి సైనిక దళం సాధారణ సైనిక దళం కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. శిక్షణ పొందిన దళాలు కాబట్టి లక్ష్య సాధన కోసం తక్కువ సంఖ్యలో యోధులను నియమించుకోవచ్చు. వీరు రక్షణ దళాలుగా కూడా పనిచేస్తారు. ఈ గ్రూప్ లో కొంతమంది అమెరికా కదలికలపై నిరంతరం నిఘా పెడుతుంటారు. సమాచారాన్ని పుతిన్ కి అందజేస్తుంటారు.
వాగ్నర్ గ్రూప్ ను హింసకు ఆజ్యం పోయడానికి, సహజ వనరుల దోపిడీ కి కూడా ఉపయోగిస్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలన్నా .. ఇతర చట్టాలన్న వీరికి లెక్కలేదు. అన్నింటిని ఉల్లంఘిస్తూ ప్రజలను భయపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘర్షణ ప్రాంతాలకు వీరిని పంపుతుంటారు.
గతంలో ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ వంటి ప్రాంతాల్లో హింసాత్మక కార్యకలాపాలు చేపట్టి హత్యలకు, ప్రభుత్వాన్నిఅస్థిరపరిచే చర్యలకు పాల్పడిందని వాగ్నర్ గ్రూప్ పై ఆరోపణలున్నాయి. 2015 లో సిరియన్ అంతర్యుద్ధంలోకి రష్యన్ ఫెడరేషన్ ప్రవేశించిన తరువాత, వాగ్నర్ దళాలు సిరియాలోకి ప్రవేశించాయి. ఇప్పటికీ ప్రభుత్వ దళాల తరపున పనిచేస్తున్నాయని అంటారు.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో మైనింగ్ నుండి వచ్చే లాభాలలో కొంత వాటా తీసుకుని ప్రభుత్వ యాజమాన్యంలోని వజ్రాలు, బంగారు గనులకు ఈ గ్రూప్ రక్షణ కల్పిస్తోంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ రష్యన్ కిరాయి సైనికులపై డాక్యుమెంటరీని చిత్రీకరిస్తున్న ముగ్గురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఇలాంటి హత్యలు చాలానే ఈ గ్రూప్ ఖాతాలో ఉన్నాయి. వీరి కాంట్రాక్టు సొమ్ము కోట్లలో ఉంటుంది.
——-KNMURTHY