ఆ ఇద్దరు … మార్గదర్శకులు కాదా ?

Sharing is Caring...

రమణ కొంటికర్ల…………………………………. 
కులాల కుంపట్లలో చలి కాగేవాళ్లు… మతవిద్వేషాల మంటలతో చండప్రచండ సూర్యుడికే దడ పుట్టించే కలిమనుషుల రాజ్యంలో…ఒక్కసారి గా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికార్లను యాద్దెచ్చుకోవాల్సిన సమయమిది. వారే ఒకరు ఎస్. ఆర్. శంకరనైతే… ఇంకొకరు బస్తర్ హీరో బీ.డి. శర్మ. ఇద్దరూ పుట్టింది బ్రాహ్మణ కులమైనా… అభ్యుదయవాదులు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన ఆదర్శమూర్తులు. 

కులాలు, మతాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు జరుపుతూ నిత్యం వివాదాల్లో నిలుస్తున్న అధికారులు పనిచేస్తున్న నేటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సృష్టికర్త ఎస్.ఆర్. శంకరనైతే… ఆ వర్గాల కొరకు మధ్యప్రదేశ్ లో అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బీ.డీ. శర్మ. మరా ఆదర్శమూర్తులు… నేటి సమాజంలోని పెద్దమనుషులకు ఎందుకు మార్గదర్శులు కాలేక పోతున్నారు…?

సంకుచితత్వం రాజ్యమేలేచోట విశాల దృక్పథానికి చోటుండదేమో బహుశా! అంతేకాదు… ఏదో ఒక ప్రభావం మనిషిపై పనిచేసినప్పుడు.. ఆ పరిధుల్లోనే గిరిగీసుకుని.. మహోన్నత ఆశయాల వైపు ఆలోచనలు సాగవేమో కూడా…?!!
ఈమాటలెందుకనుకోవాల్సి వస్తోందంటే… సున్నితమైన అంశాలను విచ్చలవిడితనానికి వేదికని చాలామంది భావించే సోషల్ మీడియా కూడా చర్చించని రోజుల్లో… ఉన్నత చదువులు చదువుకుని ఒక అభ్యుదయమైన, చైతన్యమైన సమాజాన్ని నిర్మించే క్రమంలో… అన్నివర్గాల నమ్మకాలు, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాల్సినవాళ్లు… సామాజిక విద్వేషాలను రగిలించే విధంగా వ్యవహరించడమంటే అది వాళ్ల విజ్ఞత ఏ స్థాయిలో పనిచేస్తుందో పట్టిచూపేదే మరి!

అయితే ఆ వివాదం ఇప్పటికే సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశమైన క్రమంలో మళ్లీ అందులోకి వెళ్లకుండా… కుల, మతాలకతీతంగా పనిచేసే కొందరు అధికారుల గురించి మాట్లాడుకుంటే… అగో, వారికీ, ఇప్పటివారికీ ఉన్న తేడా ఏంటో సమాజమే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడీ ఇద్దరు ఐఏఎస్ ల ముచ్చట. ఒక రైల్వే గార్డ్ కొడుకు ఐఏఎస్ అయితే… అది ఎస్. ఆర్. శంకరన్. తమిళనాడు తంజావూర్ జిల్లా సిరగలత్తూర్ జన్మస్థానమైతే.. జీవితమంతా రైల్వేగార్డుగా పనిచేసిన తండ్రితో పాటే తిరుగుతూ వలస చదువుల్లోనే వికసించి గుబాళించిన అమృతపుష్పం శంకరన్.

1957 బ్యాచుకు చెందిన శంకరన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు జిల్లా కలెక్టర్ గా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా, త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. ఇవన్నింటికీ మించి… పెళ్లి చేసుకుంటే పేదల కోసం పనిచేయలేనన్న ఉద్ధేశ్యంతో బ్యాచిలర్ గానే ఉండిపోయిన సంక్షేమమూర్తి శంకరన్.

అంతేనా… అవార్డులు, డాక్టరేట్లు కొనుక్కుని తమ డాబు, దర్పం చూపించుకునేవాళ్లే ఎక్కువ కనిపించే రోజుల్లో… భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ ను తిరస్కరించిన నిరాడంబరుడు శంకరన్. నక్సల్ ఖైదీలను విడుదల చేయాలంటూ పీపుల్స్ వార్ చేత నాడు తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నాపైన శంకరన్.. ఓ బ్రాహ్మడై ఉండి దళితులు, అణగారిన వర్గాలు, కొండజాతి గిరిజనుల గురించి వాదన వినిపించిన తీరులో ఎక్కడైనా సంకుచితత్వం కనిపించిందా మరి..?

బొగ్గుగనులను జాతీయం చేయడంలోనూ.. వెట్టిచాకిరీ నిర్మూలనలోనూ, షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధే ధ్యేయంగా ఒక బాపనాయన పనిచేసినప్పుడు… అలాంటి వర్గాలన్నంటినీ ఎవరో కొందరి చేష్టల వల్ల ఏకపక్షంగా తప్పుబట్టి బట్టకాల్చి మీదెయ్యడం విజ్ఞులకు ఎంతవరకు సమంజసం..?

దేశవ్యాప్తంగా ఏర్పడిన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్ మెంట్ ఏజెన్సీలైన ఐటీడీఏల ఏర్పాటుకైనా… నక్సల్స్ తో జరిగిన శాంతి చర్చల్లో ఆద్యుడిగా నిల్చినా… ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతిలో నిధులు కేటాయించేలా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలను తయారుచేసినా… అవన్నీ ఓ అగ్రవర్ణ కుటుంబం నుంచి వచ్చిన శంకరన్ చొరవేగా మరి…? ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లే కార్యాచరణ రూపకల్పనకైనా.. ఇవాళ చీమలు పెట్టిన పుట్టలపైన విషనాగులు దూరి అధికారం చెలాయిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకులాల నాందికైనా నాటి శంకరనేగా మరి ఆది పురుషుడు..?

ఇదిగో ఇక్కడే మరో అగ్రకుల హీరో గురించి కూడా చెప్పుకోవాలి. ఆయనే బస్తర్ మ్యాథమేటిక్స్ హీరో బీడీ శర్మ. గిరిజనుల సంక్షేమం కోసం ఉద్ధేశించిన బూరియా కమిషన్ నివేదిక రూపొందించడంలోగానీ… అటవీహక్కుల చట్ట రూపకల్పనలోగానీ.. షెడ్యూల్ ప్రాంతాల పంచాయితీ పొడగింపు చట్టాల రచనలోగానీ… శర్మదే కీలకపాత్ర. బస్తర్ ప్రాంతంలో పాల్ అలెక్స్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు… ప్రభుత్వానికి అప్పుడు ఇదిగో ఈ శర్మ సేవలవసరమయ్యాయి.

అదీ మావోయిస్టులే సూచించిన పేరు బీడి శర్మ. జల్ జంగిల్ జమీన్ పేరుతో భూమిలేని పేదలకు భూములివ్వడం, మైనింగ్ వంటి కార్యకలాపాలతో గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారి పరిధులను పరిమితం చేసే విదేశీ కార్పోరేట్ శక్తులను తరిమికొట్టడం వంటివెన్నో సాహసోపేత నిర్ణయాలు… చాలాసార్లు ఆయన్న చావు అంచు వరకూ తీసుకెళ్లాయి. మధ్యప్రదేశ్ ట్రైబల్ అఫైర్స్ సెక్రటరీగా, నార్త్ ఈస్టర్న్ హిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టి… అణగారిన వర్గాల కోసం కష్టించిన అగ్రకుల బీజం బీడీ శర్మ కాదా…?

అత్యున్నత స్థానాల్లో ఎంతో నిరాడంబరంగా దేశం గర్వించదగేలా… ఇప్పటికే వారి సేవలను తల్చుకునేలా నిమ్నవర్గాల తరపున ప్రాతినిథ్యం వహించిన అగ్రకులస్థులైన బీడీ శర్మ, శంకరన్ వంటివారు.. ఇవాళ కులాల కుంపట్లలో చలికాచుకునేవారికి ఎందుకు మార్గదర్శకులు కాలేకపోతున్నారనేదే ఇప్పుడు వాళ్లల్లోకి వాళ్లు తరచిచూసుకుని వేసుకోవాల్సిన ప్రశ్న?

సదరు పెద్దమనుషులు చూడవల్సింది.. ఏ మతం గొప్ప.. ఏ కులం గొప్ప అని కాకుండా.. అసలు వాళ్లు చేయాల్సిన పనేంటో తెలుసుకోవాల్సి ఉందేమో..? అంతకుమించి ముందుగా అసలు వాళ్లను వాళ్లు తెలుసుకునే యత్నం జరగాలేమో..?!! మనం సృష్టించుకున్న కుల, మతాలే మనల్ని ప్రభావితం చేసే శక్తులుగా మారినప్పుడు.. ఇక మనమేం సమాజాన్ని ప్రభావితం చేసే శక్తులమైతామనే.. ఓ చిన్న సందేహం ఉత్పన్నమైనా.. ఓ శంకరనో, ఓ శర్మతో కాకపోయినా.. వివాదాస్పదమైతే కాకపోయేవారేమో..?!!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!