కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా కు మరో పరీక్ష కానున్నాయి. ఎల్డీఎఫ్ ను ఎదుర్కొని కాంగ్రెస్ ఫ్రంట్ అక్కడ విజయ కేతనం ఎగుర వేసిందంటే .. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని గట్టిగా ఢీ కొనే అవకాశాలు మెరుగుపడతాయి. కేరళ లోని వయనాడ్ నుంచి పార్లమెంటుకి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆయన బాధ్యత మరింత పెరిగింది. అందుకే రాహుల్ కేరళలో ఈ సారి యూడీఎఫ్ ను అధికారంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. కేరళ ప్రస్తుత సీఎం విజయన్ గోల్డ్ స్కాం లో ఇరుక్కోవడంతో తమ గెలుపు సులువు అవుతుందని రాహుల్ భావిస్తున్నారు. ముస్లిం .. క్రైస్తవ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి రాహుల్ పాచికలు పన్నుతున్నారు. క్రైస్తవులను ఆకర్షించేందుకు ప్రియాంకా వాద్రాను కూడా రంగంలోకి దింపుతున్నారు. అందుకే క్రిస్టియన్ అయిన ఉమెన్ చాందీ కి పార్టీ ప్రాధాన్యతనిస్తోంది.
కేరళలో విద్యాధికులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటింగ్ దగ్గర కొచ్చేసరికి వారిపై సామాజికవర్గ ప్రభావం బాగానే పనిచేస్తుంది. కేరళలో 55 శాతం హిందువులు ,27 శాతం ముస్లిములు ,18శాతం క్రైస్తవులు ఉన్నారు.హిందువులలో ఓట్లు అన్ని పార్టీలకు చీలిపోయినప్పటికీ ముస్లిముల ఓట్లు అధిక భాగం ఒక పార్టీకి పడతాయి. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూటమి 20 సీట్లకు గాను 19 సీట్లు గెలుచుకుంది. 47.2 శాతం ఓట్లను రాబట్టుకుంది. రెండేళ్ల నాటి పరిస్థితులు మళ్ళీ పునరావృత్తమవుతాయని రాహుల్ అంచనా వేస్తున్నారు. ఎలాగైనా ఎల్డీఎఫ్ ను దెబ్బతీయాలని కాంగ్రెస్ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. విజయన్ స్కాం గురించి ప్రచారం చేస్తున్నారు.
పినరయి విజయన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నదే కాంగ్రెస్ ప్రధాన అస్త్రం గా మారింది. ఎన్నికల సమయంలో బీజీపీ ఇలాంటి ఎత్తుగడలతో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఎం ఎదురు దాడి చేస్తోంది. విజయన్ రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నప్పటికీ ఆ పార్టీ నేతలు ఆ విషయంపై స్పందించడం లేదు. అలాగే సీపీఎం నేత కుమారుడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇరుక్కోవడం ఆ పార్టీకి ఇబ్బందికరమే. వందలాది సీపీఎం కార్యకర్తలకు వివిధ పోస్టులు కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. ఎల్డీఎఫ్ సర్కార్ అమెరికా కంపెనీతో కేరళ తీరప్రాంత ఖనిజ అన్వేషణకు ఒప్పందం కుదుర్చుకున్నదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
కాగా ఎల్డీఎఫ్ బలాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. మొన్న డిసెంబర్ లో జరిగిన పంచాయితీ ఎన్నిక ల్లో ఎల్డీఎఫ్ పైచేయి సాధించింది. అయితే స్థానిక ఎన్నికలకు .. రాష్ట్ర స్థాయి ఎన్నికలకు తేడా ఉంది. కానీ అవే ఫలితాలు రావచ్చని ఎల్డీఎఫ్ అంచనా వేస్తున్నది. బీజేపీ ఈ ఎన్నికల్లో తమ బలం పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సీఎం అభ్యర్థి గా మెట్రోమ్యాన్ శ్రీధరన్ ను ప్రకటించినప్పటికీ ఆపార్టీ గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో లేదు. బీజేపీ బలమైన శక్తిగా ఎదగడానికి మరికొంత కాలం పడుతుంది. ప్రస్తుతం పోటీ మటుకు యూడీఎఫ్,ఎల్డీఎఫ్ ల మధ్యనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే రాహుల్ ఇమేజ్ కొంతమేరకు పెరుగుతుంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఫలితాలు వస్తే కానీ తేలదు.