Bharadwaja Rangavajhala …………………………………….
Ntr working style ……………………………………..సినిమా కథలు .. స్క్రిప్టుల విషయంలో ఎన్టీఆర్ కొంచెం ముందు చూపుతోనే ఉండేవారు. ముందుగానే రచయితలచే స్క్రిప్ట్ రాయించుకుని వాటికి మెరుగులు దిద్దేవారు. మరల అవసరమైన సన్నివేశాలను తిరగ రాయించేవారు. అసలు సంగతేమిటంటే …….. నిడమర్తి మూర్తి గారు భాగస్వాములతో కల్సి బాపుగారితో సంపూర్ణ రామాయణం తీయాలనుకున్నప్పుడు జరిగిన కథ….
రాముడుగా శోభన్ బాబును తీసుకోవాలని కూడా నిర్ణయం జరిగిపోయింది. సరిగ్గా అప్పుడు … ఈ విషయం విన్న ఓ పెద్దమనిషి వీళ్లని కల్సి … అమాయకులారా … ఆల్రెడీ ఎన్టీఆర్ దగ్గర సముద్రాల గారు రాసిన సంపూర్ణ రామాయణం స్క్రిప్టు ఉంది. ఆయన ఏ క్షణంలో తీస్తాడో తెలియదు … ఎందుకేనా మంచిది ఓ సారి ఆయన్ని కల్సిన తర్వాత సినిమా మీద నిర్ణయం తీసుకుంటే మంచిది అని ఆ పెద్దమనిషి సలహా చెప్పాడు. అప్పుడు బాపు రమణలు ఎన్టీఆర్ షూటింగ్ జరుగుతున్న ఫ్లోర్ కు పోయి అయ్యా మీతో ఓ పావుగంట ఏకాంతంగా మాట్లాడాలి అన్నారు.
ఆయన తన సహజ ధోరణిలో ఉదయం నాలుగున్నరకల్లా వచ్చేయండి అన్నారు. అంత పొద్దున్నే మా వల్ల కాదుగానీండి .. కాస్త సంసారపక్షంగా ఆరింటికి వస్తాం అన్నారు. ఏ కళనున్నారో … సరే .. అన్నారు ఎన్టీఆర్. మర్నాడు వీళ్లు వెళ్లారు. “సంపూర్ణ రామాయణం సినిమా తీద్దామనుకుంటున్నారు మూర్తిగారు .. బాపు డైరక్షన్ లో “… అని చెప్పారు రమణగారు.
నాకు ఇప్పట్లో ఖాళీ లేదు అన్నారు ఎన్టీఆర్. హీరో మీరు కాదండి శోభన్ బాబు అనుకుంటున్నాం అని వివరించారు. అయితే ఇక్కడకెందుకు వచ్చారు? అని ఆశ్చర్యపోయారు అన్నగారు. అంటే మీరు సముద్రాల సీనియర్ తో సంపూర్ణరామాయణం అనే స్క్రిప్టు రాయించారని … ఏ క్షణంలో అయినా దాన్ని మీరు తీస్తారని చెప్తే … ఆ విషయం మాట్లాడదామని వచ్చామండి అని క్లియర్ గా విషయం చెప్పేశారు.
అదా అవునవును .. నిజమే .. అయితే నేను దాన్ని ఇప్పట్లో తీయను. ఎందుకంటే … దాన్ని ఇంప్రవైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుచేత ఆ పని పూర్తైతే గానీ నేను దాని మీద దృష్టి పెట్టలేను. అందుకు కనీసం రెండు మూడేళ్లు పడుతుందో ఇంకా ఎక్కువ సమయమే పడుతుందో నేను చెప్పలేను. కనుక మీరు హాయిగా మీ సినిమా తీసేసుకోండి … నో ప్రాబ్లమ్ అని వీరిని సాగనంపారు.సంపూర్ణ రామాయణం విడుదలైంది. మొదటి నాల్రోజులూ జనం లేరు. దీంతో కొత్త రాముడు శోభన్ బాబు కు భయం వేసి పాత రాముడు ఎన్టీఆర్ దగ్గరకు పోయాడు. వెళ్లి ఇలా అయిపోయిందేంటి అని వాపోయాడు.
అప్పుడు పాత రాముడు … బ్రదర్ … ఖంగారు పడకు జనం కొత్త రాముడికి అలవాటు పడడానికి కొద్దిగా సమయం పడుతుంది. మౌత్ పబ్లిసిటీ జరగాలి కదా … సినిమా బానే తీశారు. కనుక తప్పకుండా విజయం సాధిస్తుంది ఖంగారు పడకు అని కొత్త రాముడికి ధైర్యం చెప్పి పంపారు పాతరాముడు.
ఆయనన్నట్టే నాల్రోజుల తర్వాత కలెక్షన్స్ పికప్ అయ్యాయి. సినిమా విజయవంతమైంది. అలా అప్పుడు సముద్రాల గారితో రాయించి ఆపేసిన సంపూర్ణ రామాయణం స్క్రిప్టును తన పద్దతిలో ఇంప్రవైజ్ చేసి ఆ తర్వాతెప్పుడో తన కాంపౌండ్ లోకి వచ్చిన కొండవీటి వెంకటకవితో కూడా కొన్ని సీన్లు ప్రత్యేకంగా రాయించి … శ్రీ రామ పట్టాభిషేకం టైటిల్ తో తెరకెక్కించారు. ఒరిజినల్ గా సముద్రాల రాసినది కనుక టైటిల్స్ లో ఆయన పేరే ఉంచేశారు. అలా ఆ సినిమా సముద్రాల పేరుతోనే చలామణీలోకి వచ్చేసింది.అలాగే చాణక్య చంద్రగుప్త సినిమాలో మూల కథ పింగళి నాగేంద్రరావు అని పడుతుంది. అప్పటికి ఆయన కన్నుమూసి ఏడేళ్లో ఎనిమిదేళ్లో అయ్యింది. విషయం ఏమిటంటే … పింగళి బ్రహ్మచారి. ఆయన దగ్గరకి తరచు నరసరాజు, నర్రా రామబ్రహ్మంలు వెళ్లేవారు. నర్రా రామబ్రహ్మం అంటే మహామంత్రి తిమ్మరసు నిర్మాత.
పింగళి గారికి కాన్సర్ అని తెల్సిన తర్వాత రాయవెల్లూరులో ఉన్న నిమ్మకూరుకు చెందిన ఒక అంకాలజిస్ట్ తో ట్రీట్మెంట్ చేయించారు ఎన్టీఆర్. అయినా ఈయన ఆరోగ్యం కుదుట పడలేదు. ఆయన ఇల్లు ఘంటసాలకు అమ్మేశారు. పింగళి ఆరోగ్యం పాడయ్యే నాటికి డిఎల్ రాయ్ చాణక్య నాటకాన్ని అనుసరిస్తూ ఓ స్క్రిప్టు రాస్తున్నారాయన. దాని మీద ఎన్టీఆర్ తో చర్చలు జరిగేవి కూడా. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత నే అనుకుంటా … తన దగ్గరున్న ఆ నోట్స్ ను ఆయనే ఎన్టీఆర్ చేతిలో పెట్టారు. దాన్ని కూడా ఇంప్రవైజ్ చేసి మూలకథ అని పింగళి పేరే టైటిల్స్ లో వేసి చాణక్య చంద్రగుప్త గా తెరకెక్కించారు. అది దాన వీర శూర కర్ణ లెవెల్లో ఆడుతుందనుకున్నారుగానీ పెద్దగా పోలేదు. ఓపెనింగ్స్ మాత్రం భారీగా రాబట్టింది.
సినిమా తీసినా తీయకపోయినా … అప్పుడు తీయకపోయినా … ఎప్పుడు తీసేదీ తెలియకపోయినా … ఎప్పుడూ ఓ స్క్రిప్టు డిస్కషన్ తన కాంపౌండ్ లో జరగాల్సిందే అన్నట్టుండేవారు ఎన్టీఆర్. అందుకని నిరంతరం తన సన్నిహితులైన రచయితలతో ఆయన రకరకాల అంశాలను ప్రస్తావిస్తూ కథ చేద్దాం అనే చర్చలోకి దింపి అలాఓ స్క్రిప్టు తయారు చేయిస్తూనో చేసుకుంటూనో ఉండేవారు.ఆయన రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత కూడా ఆయన దగ్గర కొన్నిఅప్పటికే తయారైన స్క్రిప్టులు ఉండేవి.
వాటిలో ఒకటి తమ్ముడి పెళ్లి మామ భరతం. అది ఈ నాటికీ బాలకృష్ణ దగ్గరే ఉంది . డి.వి. నరసరాజుగారు రాశారది. అప్పట్లో ఎన్టీఆర్ హరికృష్ణలతో చేయాలనుకున్న ఆ కథను హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లతో అయినా తీసుండాల్సింది అన్నారోసారి నరసరాజుగారు.
ఇక పైన సంపూర్ణ రామాయణం,శ్రీ రామ పట్టాభిషేకం చిత్రాలకు సంబంధించిన కథ యావత్తూ కూడా ముళ్లపూడి వారి కోతి కొమ్మచ్చి నుంచీ తీసుకోవడం జరిగింది. చాణక్య చంద్రగుప్త పింగళి రామ్మూర్తిగారి నుంచీ వినడం జరిగింది. తమ్ముడి పెళ్లి మామ భరతం చిత్రం గురించిన విశేషాలు .. నరసరాజుగారు ఈనాడులో తన కాలం అక్షింతలులో రాశారొకసారి. అలాగే ఆయన ఆత్మకథలోనూ తెరవెనుక కథల్లోనూ కూడా రాశారు.
ఏమైనా అన్నగారు కాస్త డిఫరెంట్ మనిషే .