త్రినాధ్ రావు గరగ …………………….
‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ జంట హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’తో థియేటర్లలోకి వచ్చింది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదేళ్ల కెరీర్‌లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం రెండు, మూడే. ప్రస్తుతం హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. తొలిసారి హారర్ థ్రిల్లర్ ట్రై చేశాడు సాయి శ్రీనివాస్.ఈ చిత్రంపై టీమ్ అంతా ఎంతో నమ్మకం పెట్టుకుంది.
రాఘవ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్), మైథిలి (అనుపమ) ప్రేమికులు. ఆ ఇద్దరూ మరొక స్నేహితుడు (సుదర్శన్) తో కలిసి ఘోస్ట్ వాకింగ్ పేరుతో హాంటెడ్ హౌసెస్ టూర్స్ నిర్వహిస్తుంటారు. థ్రిల్ కోరుకునే వారిని ఓ పాడుబడిన బంగ్లాల్లోకి తీసుకెళ్లి అక్కడ దెయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ థ్రిల్ పంచుతుంటారు.
కొంతమందిని కిష్కింధపురి ఊరి పరిసరాల్లో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్ కి వెళతారు. అదొక పాడుబడిన స్టేషన్.. లోపలి అడుగు పెట్టాక ఓ వాయిస్ వినిపిస్తుంది.అది దెయ్యంలా మారిన వేదవతి వాయిస్.. సువర్ణమాయలోకి అడుగు పెట్టిన వారిని వదిలిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది.
ఆ వార్నింగ్ ను ఆ బృందం ఎలా ఎదుర్కొంది? అక్కడ నుంచి ఎలా బయట పడ్డారు? వారు చేసిన ప్రయత్నాలు ఏమిటి ?అసలు ఆ వేదవతి ఎవరు? ఎందుకు దెయ్యంలా మారింది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని హీరో కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు.దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటికి పురాణాల మీద మంచి పట్టు ఉన్నట్లే కనిపించింది. చాలా సన్నివేశాల్లో పరోక్షంగా అది కనిపిస్తుంది. పురాణాల మీద పట్టు చూపించడంలో పెట్టిన శ్రద్ధ కథ, కథనాల మీద పెట్టలేదు దర్శకుడు కౌశిక్.
హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం ముఖ్యం.దర్శకుడు హారర్ థ్రిల్లర్ మూమెంట్స్ కొన్ని భలే రాసుకున్నా ఎంగేజ్ చేసే విధంగా కథ రాసుకోలేదు. ముఖ్యంగా సౌండ్ సినిమాకి మేజర్ ప్లస్ అయ్యింది .కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది.
దాంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిపోగా…సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయినా మధ్యలో కొద్దిగా డ్రాగ్ అయింది, మళ్ళీ కొన్ని మంచి సీన్స్ పడగా క్లైమాక్స్ రోటిన్ గా అనిపించేలా ఎండ్ అయింది…. క్లైమాక్స్ మరింత బాగా రాసుకుని .. స్క్రీన్ ప్లే మరింత పకడ్బందీగా మార్చుకుని ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది.మొత్తానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా ఆకట్టుకున్నాడు.
ఇక సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సమకూర్చిన పాటలు పర్వాలేదు. తను ఆర్ఎక్స్ 100 మూవీ నుండి ఇంకా బయట పడలేదని మొదటి పాట మనకు చెబుతుంది. ఆర్‌ఆర్ మాత్రం అదిరిపోయింది. సౌండ్‌తోనే భయటపెట్టించాడని చెప్పొచ్చు. సినిమాలో బీజీఎమ్ విషయంలో తీసుకున్న జాగ్రత్త మూవీకు ప్రాణం పోసింది.
సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్నీ న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ చిన్మయ్ సలాస్కర్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయినా కూడా ఓవరాల్ గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

