అద్భుతం! ఈహైఓల్టేజ్ ఎమోషనల్ వార్ డ్రామా !!

Sharing is Caring...

Gopini Karunakar ……………………

హిస్టారికల్ యాక్షన్ ఎంటర్ టైనర్. దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు.అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను శంభాజీ విజయవంతంగా తిప్పికొడతాడు.

శంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి శంభాజీ మహారాజ్‌పై యుద్ధం ప్రకటిస్తారు. ఈ క్రమంలో శంభాజీ   ఔరంగజేబ్‌ (అక్షయ్ ఖన్నా)కు నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు.

దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్ ఎంచుకొన్న కథ, దానికి తగినట్టుగా రాసుకొన్న స్క్రీన్ ప్లే  సినిమా విజయానికి దోహదపడ్డాయి. దర్శకుడు విజన్ ప్రకారం కథను యుద్ధంతో మొదలుపెట్టి హై యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించాడు. దర్శకుడు తొలి సీన్ నుంచే యాక్షన్, ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్‌తో సినిమాను మరింత భావోద్వేగంగా మలిచి ప్రేక్షకుడిని కట్టిపడేస్తాడు.

శంభాజీ మహారాజ్, అతని ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. క్లైమాక్స్ సన్నివేశాలు దేశభక్తిని రగిలించే విధంగా, పౌరుషాన్ని వెళ్లగక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేయడం సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఛావా సినిమా సెకండాఫ్ విషయానికి వస్తే… పూర్తి స్థాయిలో వార్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు.

ఇండియన్ స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా సన్నివేశాలను తీర్చి దిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాలపాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అనవసర ట్విస్ట్లు, పాటలు, ఉపకథల జోలికి పోకుండా ఒక వార్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు తీర్చిదిద్దాడు.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. వికీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో పౌరుషంగా, పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ సినిమా కోసం తన లుక్‌ను అద్బుతంగా డిజైన్ చేసుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక సినిమా చివరి 45 నిమిషాలపాటు అసమానమైన నటనను ప్రదర్శించాడు. ప్రేక్షకులు కనురెప్పలు కదల్చకుండా అబ్బుర పోతూ చూస్తారు. కొన్ని సీన్లలో సింహంలా గర్జించాడు.

హైఓల్టేజ్ వార్ సీక్వెన్స్ తో ప్రేక్షకులు మంత్రముగ్దులై కథలో లీనం అయిపోతారు. ఆయా సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ తో  ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. శంభాజీ అతడి సేన సాగించే మెరుపు దాడులు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయి.

ఔరంగజేబ్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా మెప్పించాడు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ అందించిన మ్యూజిక్ సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పౌరుషాన్ని రగిలించే పాటలు సినిమాకు అత్యంత బలంగా నిలిచాయి.

సౌరభ్ గోస్వామి అందించిన సినిమాటోగ్రఫి సినిమాను హాలీవుడ్ లెవెల్ కి తీసుకెళ్లిందనే ఫీల్ కలిగిస్తుంది. మడోక్ బ్యానర్, దినేష్ విజన్ అనుసరించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఛావా చిత్రం ఓవరాల్‌గా దేశభక్తిని చాటిచెప్పే ఎమోషనల్ వార్ డ్రామా. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ పార్ట్ అత్యున్నత అంశాలుగా నిలిచాయి. 

అలాగే మరాఠా యోధులు స్వరాజ్య స్థాపన కోసం ఎలాంటి త్యాగాలకు ఒడిగట్టారనే విషయాన్ని చాలా భావోద్వేగంగా చెప్పారు. చరిత్రను తెలుసుకొనే వారు, అలాగే మొఘల్ పాలనలో అరాచకాలను గ్రహించాలనుకొంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి. వికీ కౌశల్, రష్మిక మందన్న తమ నటనతో ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. ఈ సినిమాను థియేటర్‌లోనే చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!