అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘! (2)

Sharing is Caring...

Taadi Prakash  ………………… 

Missing… Flashback…………………………………………… 
తన యింట్లో వార్తలు టైప్‌ చేసుకుంటున్న అమెరికన్‌ జర్నలిస్ట్‌ని చిలీ సైనికులు వచ్చి బలవంతంగా లాక్కుపోతారు. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు, సాక్షులు చెబుతున్న దాన్ని దర్శకుడు విజువల్‌గా ప్రెజెంట్‌ చేయడం మనల్ని వూపేస్తుంది. సాయుధ సైనికులు ట్రక్కుదిగడం, ఆ భారీ బూట్ల చప్పుడికి అక్కడున్న తెల్ల బాతుల గుంపు ఎగరడం… మళ్ళీ ఇంకో సాక్షి చెబుతున్నప్పుడు బాతులు మరోలా ఎగరడం… మరోసారి ఇంకోలా ఎగరడం… ఆ ఇనప బూట్లు… ఆ అందమైన బాతులు… కర్కశమైన సైనిక పాలన శాంతిని ఎలా విచ్ఛిన్నం చేస్తుందో కవితాత్మకంగా కంపించిపోయేలా చెబుతాడు కోస్టాగౌరస్.

ఆ ఫోటోగ్రఫీ, ఆ సంగీతం ఒక జీవితకాలం వెన్నాడతాయి. ఇక్కడ అమెరికా అధికారులూ, ప్రభుత్వంలోని వాళ్ళూ తియ్యని అబద్ధాలతో కాలక్షేపం చేస్తున్నారని కొడుకు కోసం వెతికే తండ్రికి బోధపడుతుంది. కోడల్ని కలుస్తాడు. నువ్వూ నా కొడుకూ చెపుతున్నదే నిజం అంటూ అమెరికాపై అనుకూల అభిప్రాయం మార్చుకుంటాడు. వామపక్షభావాలున్న ఆ అమెరికన్ జర్నలిస్ట్‌ని పుట్‌బాల్‌ స్టేడియంలో ఎప్పుడో చంపేస్తారు. “పూర్తిగా దర్యాప్తు చేస్తాం. మీ కొడుకు ఏమయ్యారో విచారించి నిర్ధారణ చేస్తాం” అని చిలీ ప్రభుత్వాధికార్లు హామీ ఇచ్చి జర్నలిస్టు భార్యనీ, తండ్రినీ అమెరికా పంపేస్తారు.

చిలీలో మిటలరీ హింస, విధ్వంసకాండ జరుగుతూనే వుంటుంది. ఏడు నెలల నిరీక్షణ తర్వాత మిస్సింగ్‌ ఆఖరి సీను : న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో తండ్రి ఎదురుచూస్తూ వుంటాడు. శాంటియాగో నుంచి వచ్చిన విమానం నెమ్మదిగా ఆగుతుంది. తలుపు తెరుచుకుంటుంది. కన్వేయర్ బెల్ట్‌ మీద కొడుకు శవపేటిక నెమ్మదిగా వస్తూ వుంటుంది.ఆ కన్నతండ్రీ, ప్రేక్షకుడూ కన్నీటి పర్యంతమై,వేదనతో నిస్సహాయంగా మిగిలిపోతారు. ఉదాసీనత, నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని హెన్రీ కిసింజర్ సహా 11 మంది ప్రభుత్వ అధికారులపై దావా వేస్తాడు.

కేసు చాన్నాళ్ళు నడుస్తుంది. తగిన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టేస్తారు. ఆ జర్నలిస్టు హత్య అమెరికా స్టేట్‌ సీక్రెట్‌గా మిగిలిపోతుంది.ఈ సినిమాలో వినిపించిన పియానో థీమ్‌ సంగీతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దాన్ని, తర్వాత ఎంతో మంది అనేక రూపాల్లో వాడారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుకి ‘మిస్సింగ్‌’ నామినేట్‌ అయింది. అమెరికా ప్రభుత్వ దుర్మార్గాన్ని వుతికి ఆరేసిన ఈ చిత్రానికి సహజంగానే ఆస్కార్‌ యివ్వలేదు. అయితే, కేన్స్‌, యితర ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్కీన్‌ప్లే, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీత అవార్డుల్ని మిస్సింగ్‌ గెలుచుకుంది.

మిస్సింగ్‌ ని పూర్తిగా మెక్సికోలో చిత్రీకరించారు. 1981లోనే ఈ హాలీవుడ్‌ ప్రొడక్షన్ కి 9.5 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టారు. చాలా దేశాల్లో జనాల్ని వెర్రెత్తించిన ఈ పొలిటికల్‌ సస్పెన్స్ థ్రిల్లర్. 16 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. కోస్టా గౌరస్‌ తీసిన అతి ఖరీదైన చిత్రం యిది.చార్లెస్‌ హార్మన్‌తో పాటు మరో అమెరికన్‌ జర్నలిస్టుని కూడా పాసిస్టులు హతమార్చారు. అమెరికా గంభీరంగా మౌనం దాల్చింది ! సాల్వడార్‌ అలెండీ నుండి చార్లెస్‌ హార్మన్‌ దాకా చిలీలో జరిగిన వేలాది రాజకీయ హత్యలకి అమెరికా స్వార్థం, దురహంకారమే కారణం ! అప్పుడు అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌.

———————-
“చిలీ మీద ఆర్టికల్‌ రాయాలి” అని ఎప్పటినుంచో మోహన్ అనేవాడు … వ్యాసాలు రాసి పత్రికలకి పంపే అలవాటు మోహన్ కి లేదు.1993 సెప్టెంబర్‌ 11, నేను సికింద్రాబాద్‌ ఆంధ్రభూమిలో న్యూస్‌ ఎడిటర్ని. ” అరే చిన్నా. సెప్టెంబర్‌ 11 వస్తోందిరా, చిలీ మీద రాయాలి అన్నాడు మోహన్‌. రాయలేదు. 2003 సెప్టెంబర్‌… ఇద్దరికీ ఉద్యోగాల్లేవు. మోహన్‌ ఆఫీస్‌లోనే నేను… 30 ఏళ్ళు అయిపోయిందిరా. ఈ సారైనా చిలీ మీద రాయాలి అన్నాడు. దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికా రాజకీయాల మీద
మోహన్‌ స్పెషలిస్ట్‌. ఆ సీరియస్‌నెస్‌కి అదే కారణం. ఐనా రాయలేదు.

2013 సెప్టెంబర్‌ : బంజారాహిల్స్‌ రోడ్‌నెం.12లో అమృతావేలీలో మోహన్‌ ఆఫీసు. లంచ్‌ తర్వాత బ్లాక్‌ టీ తాగుతున్నాం. 40 ఏళ్ళు అవుతోందిరా, చిలీ మీద ఈసారి తప్పకుండా రాస్తాను అన్నాడు మోహన్‌. సిగిరెట్‌ వెలిగించి చిలీ జ్ఞాపకాలు చెప్పాడు. పాబ్లో నెరూడా, లూయి కార్వలాన్‌, విక్టర్‌ జారా, సాల్వడార్ అలెండీ,..ఆ ఫుట్బాల్ స్టేడియం..కోస్టాగౌరస్‌, ఆ తెల్ల గుర్రం..ఆ నెత్తుటి మరకలు…తగలబడిన ఆశలు.. పినోచెట్‌గాడి అరాచకం..ఆశలు మొలకెత్తించే ఒక స్పానిష్‌ పాట..మానవత్వం మీద నుంచి చరిత్ర నిర్దాక్షిణ్యంగా నడిచి వెళ్ళిపోయిన కాలం గురించి చెప్పాడు. చివరికి చిలీ గురించి రాయకుండానే 2017 సెప్టెంబర్‌ 17న మోహన్‌ అందర్నీ విడిచి వెళ్ళిపోయాడు. ఈ వ్యాసం మోహన్‌ కోసమే. 

Read it also …………………………………. అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘! (1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!