సుదీర్ఘ కాలం కాపు కాసి … అదను చూసి తాలిబన్ రాజ్యంలో దాక్కున్న అల్ ఖైదా అగ్రనేత అల్-జవహరీని అమెరికా హతమార్చింది. భారీ రక్షణ వలయంలో ఉండే జవహరీ బయట అడుగు వేయడం కోసం ఓపిగ్గా అమెరికా సీఐఏ ఏజంట్లు వేచి చూసారు.
సమయం రాగానే చేతికి తడి అంటకుండా రహస్య ఆయుధంతో దాడి చేసి హతమార్చారు . అసలు ఏం జరిగిందో తాలిబన్లు తెలుసుకునే లోగానే అక్కడి నుంచి డ్రోన్లు అదృశ్యమైపోయాయని వార్తలొచ్చాయి. ఈ దాడి నాటకీయ ఫక్కీలో జరగడం విశేషం. సీఐఏ ఏజంట్లు ఇలాంటి దాడుల్లో సిద్ధహస్తులు. టెక్నాలజీ ని ఉపయోగిస్తూ శత్రువులను హతమారుస్తున్నారు.
అమెరికా సీఐఏకు చెందిన డ్రోన్లు 2022 జులై ౩౦ (శనివారం) రాత్రి 9.48 (అమెరికా కాలమానం ప్రకారం) అల్ ఖైదా నేత జవహరీపై రెండు క్షిపణులతో దాడి చేసి మట్టుబెట్టాయి. దాడి జరిగిన సమయంలో జవహరీ తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నాడని కథనం.
ఈ ఆపరేషన్ కోసం రెండు డ్రోన్ మిస్సైళ్లను వాడారు. ఆ మిస్సైళ్లు పేలకుండానే టార్గెట్‌ను నాశనం చేశాయి. హెల్‌ఫైర్ నింజా R 9 X మిస్సైల్‌తో జవహరీని హతమార్చినట్లు భావిస్తున్నారు. ఈ మిస్సైల్‌కు ఆరు రేజర్ లాంటి బ్లేడ్లు ఉంటాయి. ఇది టార్గెట్‌ను ఖచ్చితంగా చేధిస్తుంది. ఎక్కడా బ్లాస్ట్ జరగదు.
నింజా R 9 X మిస్సైల్ ప్రయోగించిన సమయంలో మరణాలు కూడా ఎక్కువగా నమోదు కావు.హై ప్రొఫైల్ తీవ్రవాద నేతల్ని టార్గెట్ చేస్తున్న సమయంలో ఇలాంటి ఆయిదాలను వాడతారు. తొలిసారి 2017 లో R 9 X ఆయుధాన్ని వాడారు. సిరియాలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఆల్ ఖైదా సీనియర్ నేత అబూ అల్ ఖైర్ అల్ మాస్రి ని ఆ మిస్సైల్ సహాయంతో అంతమొందించారు.
R 9 X అత్యాధునికమైంది, చాలా ఖచ్చితం గా టార్గెట్‌ను చేధిస్తుంది. మిస్సైల్‌లో పేలుడు పదార్ధాలకు బదులుగా వెడల్పైన బ్లేడ్లు ఉంటాయి. ఒబామా అధికారంలో ఉన్నపుడే దీన్ని డెవలప్ చేశారు. మిస్సైల్‌కు ఉన్న బ్లేడ్లు.. బిల్డింగ్‌లను కూడా చొచ్చుకుని వెళ్లగలవు.ఇలాంటి ఆపరేషన్స్ కోసమే వీటిని వాడతారు.
గతం లో సీఐఏ గురి నుంచి జవహరీ పలు మార్లు తప్పించుకున్నాడు. ఈ సారి ఆపరేషన్ కోసం సీఐఏ పకడ్బందీగా ప్రణాళికను రచించి అమలు చేసింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ ను మట్టుబెట్టిన 11 ఏళ్లకు జవహరీని మట్టు బెట్టారు. బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా పగ్గాలను జవహరీ అందుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకు అతడి కుటుంబం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లినట్లు సీఐఏ గుర్తించింది. అయితే.. ఖచ్చితంగా ఆ ప్రదేశం తెలుసుకోలేక పోయింది. తెలిసినా రహస్యంగా ఉంచి ఉండొచ్చు.
2020లో అల్-జవహరీ అనారోగ్యంతో మరణించినట్లు ప్రచారం జరిగింది. కానీ.. నిఘా సంస్థలు నమ్మలేదు. ఆ తర్వాత ఏడాదికే 9/11 దాడులకు 20 ఏళ్లు పూరైన సందర్భంగా జవహరీ మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో నిఘా సంస్థలు ఉలిక్కిపడ్డాయి.
జెరూసలెంను ఎట్టి పరిస్థితుల్లో యూదులకు దక్కనీయమని ఈ వీడియోలో జవహరీ చెప్పారు. అదే సమయంలో ట్విన్ టవర్స్ దాడులనూ ఆయన ప్రశంసించాడు. అయితే.. ఆ వీడియోలో జవహరీ ఎక్కడ ఉన్నాడో ఎటువంటి క్లూ లభించలేదు.కెన్యా, టాంజానియా దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాల పై జరిగిన దాడిలో జవహరీ కీలకపాత్ర పోషించాడు.
జవహరీ అమెరికా జాతీయ భద్రతకు సవాలుగా మారడంతో అతన్ని హతమార్చామని .. అతని హత్యతో అల్ ఖైదా ఉనికికి తీవ్ర విఘాతం కలుగుతుందని అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ ప్రకటించారు.
డ్రోన్ దాడిని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు.