ఆయన పాటలన్నీ సూపర్ హిట్టే !

Sharing is Caring...

So many sweet songs given by him ……………..

సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురం గా ఉండేవి మరి.  ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , ఏ . ఏ రాజ్,శ్యాం మొదలైన వారు సుసర్ల దగ్గర శిష్యరికం చేసినవారే.

ఇక ‘నర్తనశాల’ సినిమా ద్వారా మంగళంపల్లి బాలమురళీకృష్ణ ను తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేసింది ఆయనే. ‘సంతానం’ తో లతా మంగేష్కర్‌ను , ‘ఇలవేలుపు’ తో రఘునాథ్‌ పాణి గ్రాహినీ, ‘వచ్చిన కోడలు నచ్చింది’ తో ఎం.ఎల్‌. వసంత కుమారినీ తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా సుసర్ల వారే.

ఇక జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీ మణులకు కూడా తొలి అవకాశం ఇచ్చి పరిచయం చేసింది  సుసర్ల మాస్టారే. వీళ్ళందరూ కూడా తమ ప్రతిభ చాటుకుని పెద్ద స్థాయికి ఎదిగినవారే. సుసర్ల వారి సంగీత దర్శకత్వంలో బాలమురళి  పాడిన ‘సలలిత రాగ సుధాకర సారం’ పాట అప్పటికి ఇప్పటికి  సూపర్ హిట్టే. అలాగే లతా మంగేష్కర్ పాడిన ‘నిదురపోరా తమ్ముడా’ పాట ఇప్పటికి అక్కడక్కడా వినిపిస్తుంటుంది. 

మాస్టారి సంగీతం గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పినా కొంత మిగిలే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన సినిమాలన్నీ మాస్టర్ పీసులే. సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్‌ మీదే బాణీలు కట్టేవారు. నర్తనశాలలో ఆయన స్వరపరిచిన గీతాలు  ‘నరవరా ఓ కురువరా’, ‘జననీ శివ కామినీ’, ‘జయగణ నాయక’, ‘సలలిత రాగ సుధా రస సారం ’, ‘ఎవ్వరి కోసం ఈ మందహాసం’, ‘సఖియా వివరించవే’, ‘దరికి రాబోకు రాజా’ ఇలా ఏ పాట కూడా బాగాలేదని చెప్పలేము. దేనికదే స్పెషల్. 

‘నర్తనశాల’ వచ్చిన పదహారేళ్ల తరువాత అదే కథాంశంతో ‘శ్రీమద్విరాట్‌ పర్వం’ ను ఎన్టీఆర్ తీశారు . దానికి కూడా సుసర్లే సంగీత దర్శకుడు.  ‘నర్తనశాల’లో సైరంధ్రి – కీచకుణ్ణి ఆహ్వానిస్తూ ‘దరికి రాబోకు రాబోకు రాజా’ అంటూ ఓ పాట పాడుతుంది. అది సోలో. అలాంటి పాట విరాటపర్వం లో పెట్టారు  ఎన్టీఆర్. ఇందులో వెరైటీగా కీచకుడు పాట పాడే సన్నివేశం పెట్టారు ఎన్టీఆర్. 

డీవీఎస్ కర్ణ లో దుర్యోధనుడికి, భానుమతికి పెట్టిన “చిత్రం భళారే చిత్రం” పాట అప్పటికే సూపర్ హిట్.  ఇక్కడ  సుసర్ల ఓ తమషా చేశారు. ‘మనసాయెనా మతిపోయెనా’ అని సైరంధ్రి అంటే ‘ఎప్పుడు మనసౌవుతుందో, ఎప్పుడు మతిపోతుందో, అప్పుడే కథ మొదలవుతుంది’ అని అందుకుంటాడు కీచకుడు. సరిగ్గా కీచకుడి పాడే లైన్స్‌ రాగానే వెనుక ఇన్‌స్ట్రుమెంట్స్‌ అన్నీ వెస్ట్రన్‌ స్టయిల్లో ఫాలో అవుతాయి. జనం ఈపాట లో  కొత్తదనం ఫీలయ్యారు. అయితే సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. 

అందరు వాడే రాగాలనే వాడుతూ వెరైటీ గా పాటలకి బాణీలు సమకూర్చడం సుసర్ల శైలిలో ప్రత్యేకత. ‘సంసారం’ చిత్రంలో టైటిల్ సాంగ్ ‘సంసారం సంసారం ప్రేమసుధా పూరం నవజీవన సారం’, ‘సంతానం’ చిత్రంలో ‘చల్లని వెన్నెలలో’ పాటలు కల్యాణి రాగాన్ని ప్రయోగాత్మకంగా ఒక భిన్న కోణంలో సుసర్ల వినిపించారు.

‘ఇలవేల్పు’ చిత్రంలో‘చల్లనిరాజా ఓ చందమామా’ సాంగ్ నాటికి నేటికీ మర్చిపోలేని గీతం. ఇక ఎంత ప్రతిభ .. ఎంత విద్వత్తు ఉండి లాభమేమి చివరి రోజుల్లో సుసర్ల వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి వద్ద సుసర్ల వయొలెనిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం సుసర్ల భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన పాటలు ఆయనను చిరంజీవిగా ఉంచాయి.
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!