అమ్మకానికి ఎయిరిండియా ఆస్తులు !

Sharing is Caring...

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రభుత్వానికి గుదిబండగా మారింది . పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను ప్రభుత్వం అమ్మే ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ముందుగా సంస్థ ఆస్తులను అమ్మేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సొమ్ము తో రుణభారం తగ్గించుకోవాలని ప్రభుత్వ సంకల్పం. ఎయిర్ ఇండియా సంస్థ ప్రధాన నగరాల్లో నివాస, వాణిజ్య ఆస్తులు, ఫ్లాట్ లను వేలం వేస్తోంది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం ఈ ఆక్షన్ నోటీసు జారీ చేసింది.

ఎయిర్ ఇండియా కు ముంబైలో ఒక నివాస స్థలం,  ఒక ఫ్లాట్, బెంగళూరులో ఒక నివాస స్థలం, కోల్‌కతాలో నాలుగు ఫ్లాట్లు,న్యూ ఢిల్లీ లో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. భుజ్‌లోని ఎయిర్‌లైన్ హౌస్‌తో పాటు రెసిడెన్షియల్ ప్లాట్లు, నాసిక్‌లో ఆరు ఫ్లాట్లు, నాగ్‌పూర్‌లో బుకింగ్ ఆఫీస్, తిరువనంతపురంలో ఒక రెసిడెన్షియల్ ప్లాట్లు, మంగళూరులో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని అమ్మే ప్రయత్నాల్లో ఉంది. 2018 లో 71 ఆస్తులను, 2019 లో 56 ఆస్తులను విక్రయించడానికి విమానయాన సంస్థ ప్రయత్నాలు చేసింది. తాజా అమ్మకాలకు ఈ-బిడ్ జూలై 8 న ప్రారంభమై జూలై 9 న ముగుస్తుంది.

ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టిసి లిమిటెడ్ ఎయిర్ ఇండియా కోసం ఈ-వేలంపాటను నిర్వహిస్తుంది. ఇపుడు వేలం వేస్తున్న ఆస్తుల విలువ కోట్లలో ఉంటుంది. కనీసం 250 కోట్లు ఈ అమ్మకాల ద్వారా రాబట్టుకోవాలని అంచనా వేస్తోంది. కేల్కర్ కమిటీ సిఫారసులను అనుసరించి ఎయిర్ ఇండియా ఈ ఆస్తులను వేలం వేస్తున్నది. గత ఏడాది డిసెంబర్ లో టాటాలు ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయవచ్చని వార్తలు వచ్చాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాలు నడవడం లేదు. దీంతో నష్టాలు మరింత పెరిగాయి.

మరో వైపు  రూ.60,000 వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ప్రయివేటీకరణ బాట పట్టింది. ఎయిరిండియాలో  76 శాతం మెజార్టీ వాటాను అమ్మేయాలని నిర్ణయించి రెండేళ్ల క్రితం బిడ్స్ ను ఆహ్వానించగా ఈ వాటాను కొనుగోలు చేసేందుకు  ఒక్క కంపెనీ కూడా  ముందుకు రాలేదు. వాటాల కొనుగోలుకు  ప్రభుత్వం పెట్టిన షరతులు చూసి దేశ, విదేశాలకు చెందిన విమాన సంస్థలేవీ ఆసక్తి చూప లేదు.

కంపెనీలనుంచి స్పందన కొరవడడానికి కారణాలలో ఎయిర్ ఇండియా కున్న అధిక రుణం ప్రధానమైనదని నిపుణులు చెబుతున్నారు. అంత రుణ భారాన్ని చూసి కంపెనీలు బెదిరి పోయాయి. గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల వలనే ఎయిర్‌ ఇండియా ఆర్థిక పరిస్థితి తలకిందులైందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. రుణ భారం తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నది. ఈ ఏడాది చివరిలోగా ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ పూర్తి అవుతుందని భావిస్తున్నారు. గత ఏడాది వాటా అమ్మకాలకు బిడ్స్ ను ఆహ్వానించగా టాటా గ్రూప్, స్పైస్ జెట్ సంస్థలు పోటీ లో నిలిచాయి. 

—————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!