Tention … Tention……………………………………………………………………….
కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఏప్రిల్ నుంచే హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో దేశంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని నిపుణులు అప్పట్లో అభిప్రాయ పడ్డారు. వారు చెప్పినట్టే కేసులు సంఖ్య మళ్ళీ పెరుగుతోంది.
ఇటీవల సోనియాగాంధీకి కరోనా పాజిటివ్.. ఆ తర్వాత ప్రియాంకా గాంధీకి వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కి కరోనా సోకింది. బాలీవుడ్ అగ్రనటుడు షారుక్‌ఖాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు కొద్దిరోజుల క్రితమే కరోనా సోకింది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ కరోనా విజృంభిస్తుందేమో అని జనాలు భయపడిపోతున్నారు.
మొత్తం మీద దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా నాలుగో వేవ్ ముంచుకొస్తోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇండియాలో ఆదివారం పాజిటివ్ కేసుల సంఖ్య 4,270కి పెరిగింది. ఇందులో 1,357 కేసులు మహారాష్ట్రలోనివే.. దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్థిక రాజధాని ముంబైలో, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
కాగా మార్చి 11 తర్వాత దేశంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అంటున్నారు.జనం అప్రమత్తంగా ఉండకపోతే… కోవిడ్ వ్యాపిస్తుందనే వార్తలు మళ్లీ అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రజల్లో కరోనా ‘ఫోర్త్ వేవ్’ గురించి ఆందోళన పెరుగుతున్న క్రమంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్.. గతంలో సెకండ్, థర్డ్ వేవ్‌లను అంచనా వేసిన ప్రొఫెసర్ మణీందర్ అగర్వాల్ మాత్రం దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
దీనికి రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారాయన. ఒకటి సహజ ఇమ్యూనిటీ, రెండు.. కొత్త మ్యుటెంట్లు లేకపోవడం. మొదటి మూడు వేవ్‌ల్లో అత్యధికులు కరోనా వైరస్ బారిన పడిన క్రమంలో దాదాపు 90 శాతం మందికి కరోనాను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి ఏర్పడటం. రెండవది కరోనా ఆల్ఫా, బీటా, డెల్టా తరహాలో ప్రాణాంతకమైన కొత్త మ్యుటెంట్లు లేవని … ఒమైక్రాన్‌లో కొత్త ఉప వేరియంట్లు మాత్రమే పుట్టుకొస్తున్నాయని అంటున్నారు. ఒమైక్రాన్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా అధిగమించగలిగే కొత్త రకం పుట్టుకొస్తే తప్ప నాలుగో వేవ్ వచ్చే ప్రసక్తే లేదని మణీందర్ అగర్వాల్ తేల్చి చెప్పేసారు. అయితే జాగ్రత్తగా ఉండటం మంచిదని అంటున్నారు.
కాగా అంతకుముందు ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఐఐటి ఖరగ్ పూర్ అధ్యయనాలు ఇదే విషయం వెల్లడించాయి. మొత్తానికి.. కరోనా ముగిసిపోయిందనుకునే లోపే..మరో ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. వార్తలు చదివి తీవ్ర భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి.