దైన్యస్థితిలో ఆఫ్ఘని మహిళా సైనికులు !

Sharing is Caring...

Fear of death………………………………తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆదేశ మహిళా సైనికులు ప్రాణ భయంతో వణికి పోతున్నారు. ఏమి చేయాలో ? తమను ఎవరు రక్షిస్తారో ? పాలుపోక భయపడుతున్నారు.  సైన్యం అంతా కకావికలు కావడంతో  .. చాలామంది అడ్రస్ లేకుండా పోవడంతో .. నిజాయితీతో పనిచేసేవారికి దిశా నిర్దేశం లేకుండా పోయింది. సామాన్య సైనికుడి నుంచి పై స్థాయి అధికారుల వరకు ఎవరూ కిమ్మనడం లేదు. అధికారులంతా ఈ కీలక సమయంలో చేతులెత్తేసారు.

ఆఫ్ఘన్ సైన్యానికి అమెరికా నాటో దళాలు ఇచ్చిన శిక్షణ బూడిదలో పోసిన పన్నీరు చందాన మారింది. అందుకోసం వెచ్చించిన 800 కోట్ల డాలర్లు వృధా అయ్యాయి. వీరందరూ భయపడిపోయి సైలెంట్ అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.  కొంతమంది ప్రాణ రక్షణకోసం కుటుంబాలతో వేరే దేశాలకు తరలిపోయారని కూడా అంటున్నారు. ఈ క్రమంలో మహిళా సైనికులు తమ భవిష్యత్ ఏమిటా అని మధన పడుతున్నారు. 

2011 లో అఫ్గాన్ నేషనల్ ఆర్మీలో ఆఫీసర్ క్యాడెట్‌గా చేరి పనిచేస్తున్న కుబ్రా బెహ్రోజ్  తన భయాలను, సందేహాలను అంతర్జాతీయ మీడియాతో పంచుకున్నారు. “తాలిబన్లు మమ్మల్ని కనుగొంటే మా తలలను నరికేస్తారని ప్రచారం జరుగుతోంది. సైనికురాలిగా చేస్తున్నందుకు నన్ను తాలిబన్లు కిడ్నాప్ చేయవచ్చు..  ఖైదు చేసి అత్యాచారం చేసినా చేయవచ్చు” అని ఆమె ఆందోళన పడుతున్నారు. గత వారం గజనీ ప్రావిన్స్‌లో జరిగిన పోరాటంలో బెహ్రోజ్ సోదరుడైన సైనికుడు గాయపడ్డాడు. నాలుగు సంవత్సరాల నుంచి పోలీసులుగా చేస్తోన్నఇద్దరు మహిళలను కర్కశంగా తలలు నరికి చంపేశారు.

పెళ్లి పేరుతో తాలిబాన్లు మహిళలు, యువతులపై అత్యాచారానికి పాల్పడుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆఫ్ఘనిస్తాన్‌లో జినా అనే ఆచారం  ప్రకారం ఒక అమ్మాయి అత్యాచారానికి గురైనట్లయితే, ఆమె ఆ రేపిస్ట్‌ని వివాహం చేసుకోవాలి. కాదంటే ఆమెను , ఆమె కుటుంబాన్ని సమాజం నుండి వెలివేస్తారు. అలా పెళ్లి చేసుకుని ఆ మహిళలను బానిసలుగా మార్చేస్తారట.

ఆధునిక సైన్యాన్ని సృష్టించే ప్రయత్నంలో నాటో మద్దతుతో ఆఫ్ఘన్ ప్రభుత్వం 2010 లో మహిళా సైనికులను నియమించింది. నేను కూడా అపుడే మిలటరీలో చేరాను. వివిధ అంశాలలో మాకు శిక్షణ కూడా ఇచ్చారు.ఇది ఇస్లామిక్ దేశం కాబట్టి  ఇల్లు తనిఖీ చేయాలన్నా .. మహిళలను చెక్ చేయాలన్నా మహిళల అవసరం ఎంతో ఉంది. కానీ తాలిబన్లు ఈ విధానానికి వ్యతిరేకం. మగతోడు లేకుండా మహిళ ఒంటరిగా బయటికి రావడం కూడా నిషేధం. నన్ను కూడా ఎన్నో సార్లు తాలిబన్లు వేధించారు. మా ఇల్లు పగల గొట్టారు. మా కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాను.”

“ఇక ఇపుడు ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. నేను ఎవరికీ లొంగి పోవాలనుకోవడం లేదు. నేను నా కాళ్లపై  నిలబడాలనుకుంటున్నాను. ఇటీవలి కాలంలో బెదిరింపులు… అనామక ఫోన్ కాల్స్ పెరిగాయి. నిన్ను ఎలా కనుగొనాలో మాకు తెలుసు అని బెదిరిస్తున్నారు. ఇక్కడే ఉంటే  నా కుటుంబాన్ని చంపేస్తారు. అందుకే పాకిస్తాన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నా”అంటున్నారు బెహ్రోజ్.

“90 వ దశకంలో అంతర్యుద్ధం జరిగిన జరిగినపుడు నాకు ఆరేళ్ళు .. అపుడు తాలిబన్ల బారిన పడకుండా తప్పించుకున్నాను. ఇపుడే అదే చరిత్ర పునరావృతమైంది. ముగింపు ఏమిటో చూడాలి “అంటున్నారు ఆమె. చాలామంది సైనికులు సరిహద్దులు దాటి వేరే దేశాలకు వెళుతున్నారు. 

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!