ఆయనకు ఎందరో ఏకలవ్య శిష్యులు!!

Sharing is Caring...

Legendary director ……………………………

తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావును చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగునీడలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి నచ్చేలా చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.అలాగే కథకు ఎక్కడ అవసరమో అక్కడ మంచి పాటలు రాయించుకునే వారు. ఆదుర్తి సినిమాల్లో పాటలన్ని సూపర్ హిట్ అయినవే. ఇప్పటికి  అవి ఎక్కడో ఒక చోట వినబడుతుంటాయి. 

తోడి కోడళ్ళు సినిమాలో “కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదాన” అంటూ ఆత్రేయ రాసిన పాట., తేనెమనసులు చిత్రంలో “నీ ఎదుట నేను.. వారెదుట నీవు….  మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు” .. దాగుడు మూతలు సినిమాలో ‘అడగక ఇచ్చిన మనసే ముద్దు’ .. ‘ఎంకొచ్చిందోయ్ మామా … ‘ గోరింక గూటికే చేరావు  చిలకా’ … అలాగే మూగమనసులు లో ‘ముద్దబంతి పూవులు’ , డాక్టర్ చక్రవర్తిలో ‘మనసున మనసై’ .. వంటి పాటలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుపోయాయి.

అవన్నీ ఎవర్గ్రీన్ హిట్స్ … ఆయన సినిమాల్లోని హిట్ సాంగ్స్ జాబితా చాలా పెద్దదే. ఆదుర్తి తెలుగులో 26 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిల్లో మూడొంతులకు పైగా సినిమాలు కుటుంబ కథా చిత్రాలే. దేనికదే ఒక ప్రత్యేకత ఉన్న సినిమా.

బొంబాయిలో కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి, ఎన్‌కె గోపాల్‌ దగ్గర ఎడిటింగ్‌ నేర్చుకున్నారు. ఒకరోజు రాజు, మంగళసూత్రం వంటి చిత్రాలకు మాటలు కూడా రాశారు. కె.ఎస్. ప్రకాశరావు నిర్మించిన ‘ దీక్ష ‘ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ‘సంక్రాంతి’, ‘కన్న తల్లి’ చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ప్రకాశరావు ‘బాలానందం’ చిత్రానికి రెండవ యూనిట్ దర్శకుడుగా పనిచేశారు.

ప్రకాష్ స్టూడియోలో పనిచేసిన డి. బి. నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో వారితో కలిసి సాహిణీ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి ‘అమరసందేశం’ అనే చిత్రాన్నిస్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆదుర్తి తొలిచిత్రం ‘అమరసందేశం’ విజయవంతం కాకపోయినా ఆయన పనితనం నచ్చి దుక్కిపాటి మధుసూధనరావు ‘అన్నపూర్ణ’ బ్యానర్ పై వరుసగా చిత్రాలకు  అవకాశమిచ్చారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 

కె.వి. రెడ్డి దర్శకత్వంలో ఏయన్నార్, సావిత్రిలతో ‘దొంగరాముడు’ హిట్ చిత్రాన్ని నిర్మించిన దుక్కిపాటి  తదుపరి సినిమాకు దర్శకుడిని వెతుక్కునే క్రమంలో ఆదుర్తి సుబ్బారావు దొరికారు. దుక్కిపాటి తో ఆదుర్తి ప్రయాణం వరుస విజయాలకు దారితీసింది.

‘తోడికోడళ్లు’ (1957) చిత్రాన్ని తెరకెక్కించి ఘన విజయం సాధించటంతో.. వరుసగా మాంగల్యబలం (1959), మంజిల్ మహిమై (తమిళం, 1959), వెలుగునీడలు (1961), తాంకుఉళ్లం (తమిళం, 1961), ఇద్దరు మిత్రులు (1961, ఏయన్నాఆర్ తొలి ద్విపాత్రాభినయం), చదువుకున్న అమ్మాయిలు, (తమిళంలో పెణ్‌మనమ్, 1963), డాక్టర్ చక్రవర్తి (1964), పూలరంగడు (1967), విచిత్రబంధం (1972), బంగారు కలలు (1974) సినిమాలు ఆదుర్తి డైరెక్షన్ లో రూపొందాయి.

అప్పట్లో ఒక సంస్థ ఒకే దర్శకుడితో వరుసగా తొమ్మిది ఘన విజయాలు సాధించిన చిత్రాలు నిర్మించటం టాలీవుడ్‌లో ఓ రికార్డు. వీటిల్లోనూ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా హిట్‌కొట్టిన సినిమాలే ఎక్కువ కావడం మరో విశేషం. ఆదుర్తి అక్కినేని, ఆత్రేయ, కెవి మహాదేవన్‌లది సూపర్ హిట్ కాంబినేషన్.

ఆదుర్తి బాబు మూవీస్ బ్యానర్ పై  అక్కినేని, సావిత్రి జంటగా మంచి మనసులు (1962), మూగ మనసులు (1964), సుమంగళి (1965), తేనె మనసులు (1965),కన్నె మనసులు (1966) నిర్మించారు. ఇవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందినవే.  వీటిలో తేనెమనసులు, కన్నెమనసులు చిత్రాల ద్వారా నటులు  కృష్ణ, రామ్‌మోహన్, సుకన్య, సంధ్యారాణిలను పరిచయం చేశారు.

వారిలో కృష్ణ నంబర్ 1 స్థాయికి ఎదిగారు. అక్కినేని భాగస్వామిగా  సుడిగుండాలు (1968) మరో ప్రపంచం (1970) లోబడ్జెట్‌లో ఆఫ్ బీట్ చిత్రాలుగా నిర్మించారు. ఇవి ఆర్థిక విజయాలు సాధించక పోయినా ప్రశంసలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బంగారు నంది (సుడిగుండాలు), రజిత నంది (మరోప్రపంచం) అవార్డులు గెలుచుకున్నాయి. 

ఎన్టీ రామారావుతో దాగుడుమూతలు (1964), తోడు-నీడ (1965) సినిమాలు తీశారు . ఇందులో దాగుడుమూతలు సినిమాకు తొలుత అక్కినేని ని హీరో అనుకున్నారు.  అయితే ఆ సినిమాలో హీరో పాత్ర చేసేందుకు అక్కినేని వెనుకడుగు వేశారు. దాంతో ఎన్టీఆర్ ను పెట్టారు. కె. విశ్వనాథ్, వి. మధుసూదన రావు, టి. కృష్ణ,  పెండ్యాల నాగాంజనేయులు,  టి. మాధవరావు,  చంద్రశేఖర రెడ్డి, ఎం. మల్లిఖార్జున రావు,  ఎం. నందన కుమార్  వంటి దర్శకులు ఆయన దగ్గర  శిష్యరికం చేసినవారే.

మధుసూధనరావు , విశ్వనాధ్ లు పెద్ద స్థాయికి ఎదిగిన విషయం తెల్సిందే. ఇక ముళ్ళపూడి వెంకటరమణ (దాగుడు మూతలు), ఎన్.ఆర్. నంది (కన్నె మనసులు), డా. కొర్రపాటి గంగాధర రావు (ఇద్దరు మిత్రులు), మోదుకూరి జాన్సన్ (మరో ప్రపంచం), సత్యానంద్ (మాయదారి మల్లిగాడు) వంటి రచయితలను తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. వీరిలో సత్యానంద్ ఆదుర్తి మేనల్లుడే.

చివరి దశలో రవికళామందిర్ బ్యానర్‌పై హీరో కృష్ణ, మంజులతో మాయదారి మల్లిగాడు (1973), కృష్ణతోనే జరీనావహబ్ హీరోయిన్‌గా గాజుల కిష్టయ్య (1975) నిర్మించారు. ఆదుర్తి చివరి శ్వాస వరకూ సినిమాలను తీస్తూనే ఉండటం విశేషం. అంజలి పిక్చర్స్‌ వారి  ‘మహాకవి క్షేత్రయ్య’ సినిమా ప్రారంభ దశలో ఆదుర్తి కన్నుమూసారు. దర్శకులు సియస్ రావు ఆ చిత్రాన్ని పూర్తి చేశారు.

అది ప్రేక్షకులకు నచ్చలేదు. చివరి వరకు సినిమాలే ఊపిరిగా బ్రతికారు ఆదుర్తి. 1922 డిసెంబర్ 16న జన్మించిన ఆదుర్తి… ఆయన 53 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో 1975  అక్టోబరు 1 న తుది శ్వాస విడిచారు. ఈ నాటి దర్శకులకు ఆయన ఒక గ్రంధాలయం వంటి వంటి వారు అనడం  ఏమాత్రం అతి శయోక్తి కాదు. ఆయనకు ఎందరో ఏకలవ్య శిష్యులున్నారు. 

————- KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!