అనంత రూపాల్లో ఆదిశక్తి (2)

Sharing is Caring...

Kasi Vishalakshi…………………………..

సతీదేవి చెవి పోగు పడిన కాశీ క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠంగా పేరు గాంచింది. కాశీ క్షేత్రం ఆది దేవుడైన శివుని నివాసం. శివునికి కైలాసం కన్నా ఇష్టమైన ప్రదేశం ఇది. పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు  సరైన  పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే క్షత్రీయుడికి రాజ్య పాలన కట్టబెడతాడు. 

అప్పుడు దివోదాసు దేవతలంతా భూమిని వదలి పెట్టి వెళ్ళిపోవాలని కోరతాడు. మహా శివుడితో సహా దేవతలంతా వెళ్ళిపోగా దివోదాసు కాశీని రాజధానిగా చేసుకొని పరిపాలించసాగాడు. కొన్నేళ్ల తర్వాత   శివుడు గణేశుని కాశీకి పంపుతాడు. గణేశుడు దివోదాసుకు వైరాగ్యం కలిగించి, భక్తి మార్గాన పెడతాడు. అతని చేతనే శివుడ్ని తిరిగి కాశీకి ఆహ్వానింప చేస్తాడు.

అప్పుడు శివుడు పరమానందభరితుడై సమస్త పరివార సమేతుడై కాశీకి వస్తాడు. ఆ సమయంలో శివుని ఆనందం చూసి ఆశ్చర్యపోయిన గౌరీ మాత కనులు పెద్దవి చేసుకొని కాశీలో ప్రవేశించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి విశ్వేశ్వరుని సన్నిధిలో నిలుస్తుంది. పెద్ద కనులున్న దేవి కనుక విశాలాక్షి అని పిలుస్తారు.

జ్యోతిర్లింగంతో పాటు శక్తిపీఠం కావడంతో అందరికి ఈ కాశీ ఆరాధ్య నిలయం, పుణ్య క్షేత్రం. ఆ ఆదిదంపతులు స్వయంగా వెలసిన అరుదైన క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ శక్తి పీఠంలో విశాలాక్షి గర్భాలయంలో భక్తులకు రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు కాగా మరొక రూపం అర్చామూర్తి.

మనం ఆలయంలోకి  ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, అటు పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాంకృతురాలైన విశాలాక్షిని  భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. 

సకల ప్రాణికోటికి  ఆహారాన్ని ఈ లోకమాతే అందిస్తుంది కనుకే ఆమెను అన్నపూర్ణ గా పిలుస్తారు. ఆమె కరుణా, కటాక్షాలు లేకపోతే విశ్వంలో ఆహారానికి కొరత ఏర్పడుతుందని అంటారు. సకల మానవాళి ఆకలి బాధలు తీర్చేందుకే ఆదిశక్తే అన్నపూర్ణ మాతగా కాశీక్షేత్రంలో వెలిశారు. ఇక్కడ రామ భక్త హనుమాన్‌ ఆలయం, సంకట్‌మోచన్‌ మందిరాన్ని కూడా చూసి రావాలి. 

అద్వైత సిద్ధాంత కర్త ఆదిశంకరుల వారికి  ఈ కాశీతో అనుబంధముంది. ఆయన ఇక్కడే బ్రహ్మసూత్రాలు, భజగోవిందం వంటి  గ్రంథాలను  రచించారు. రామకృష్ణపరమహంస, కబీర్‌, తులసీదాస్‌, రవిదాస్‌ వంటి ప్రముఖులు ఈ క్షేత్ర గొప్పదనాన్ని  తమ ప్రసంగాల్లో, రచనల్లో  ప్రస్తావించారు.

కాశీలో కన్నుమూస్తే శివసాయుజ్యం పొందుతారని భక్తులు నమ్ముతారు. దీంతో వయోధికులు అనేకమంది కాశీలోనే తమ ఆఖరి రోజులను గడపాలని వస్తుంటారు. గంగాతీరంలో 80 కి  పైగా ఘాట్లు వున్నాయి. వీటిలో దశాశ్వమేధ్‌ ఘాట్‌, మణికర్ణిక ఘాట్‌, హరిశ్చంద్ర ఘాట్‌… ముఖ్యమైనవి.

దశాశ్వమేథ్‌ ఘాట్‌లో బ్రహ్మదేవుడు పది అశ్వమేధయాగాలను నిర్వహించినట్టు పురాణకథనాలు చెబుతున్నాయి. మణికర్ణిక ఘాట్‌ను శ్రీ మహావిష్ణువే నిర్మించారని అంటారు. ఈ ఘాట్‌ను నిర్మిస్తుండగా విష్ణువు చెవి కుండలం ఇందులో పడిపోయింది.మణికర్ణిక పేరు అలా వచ్చిందంటారు. 

ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీ క్షేత్ర పాలకుడు భైరవుడు జీవిని కాశీ లోనికి అనుమతించడని భక్తులు భావిస్తారు. కాశీ లో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం అనంతరం ముందుగా డిండి  వినాయకుడు, విశ్వనాథ ,విశాలాక్షి, కాలబైరవుని దర్శించుకోవాలి.

కాశీ లో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనం ఇచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తారట.  కాశీలో మరణించిన వారికి యమ బాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదని భక్తుల విశ్వాసం. కాబట్టే  చాలామంది తమ చివరి  జీవితకాలం కాశీ లో గడుపుతారు.

కాశీ కేవలం హిందువులకే కాదు బౌద్ధం, జైన మతాలకు పవిత్రభూమి. బౌద్దులకు పవిత్రమైన స్థలాల్లో ఇది కూడా ఒకటి. జైన మత 23 తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఇక్కడే జన్మించారు. కాశీలో సూర్యాస్తమయం వేళలో గంగా హారతి చూడాలనేది చాలా మంది వస్తుంటారు.

సాయంత్రం గంగా నదీ తీరం చుట్టూ, డమరుకం, శంఖం, కీర్తనలతో గంగానది హారతి నిర్వహించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది.ఈ గంగా హారతిని తిలకించేందుకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దశాశ్వమేధ ఘాట్ వద్ద ఈ గంగా హారతి నిర్వహిస్తారు.గంగానది హారతిని వారణాసిలో 1991 నుంచి నిర్వహిస్తున్నారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!