సంచలన తీర్పులకు చిరునామా !

Sharing is Caring...
Another name for impartiality ..........................................

ఏదో ఒక సందర్భంలో ఆయన పేరు వినే ఉంటారు. న్యూస్ పేపర్స్ ఫాలో అయ్యేవారికి ఆయన గురించి .. ఆయన ఇచ్చిన తీర్పులు గురించి బాగా తెల్సు. చట్టాలను అవపోసన పట్టిన ఘనాపాటీ.. నిష్పాక్షికత కి మరో పేరు ఆయన. ఆయన పేరు జస్టిస్ ఆర్. నారీమన్ . హార్వర్డ్ లా స్కూల్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

నారిమన్ 1979 లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. డిసెంబర్ 1993 లో, 37 సంవత్సరాల వయస్సులో సుప్రీం సీనియర్ కౌన్సిల్ గా  నియమితులయ్యారు. నారీమన్ ప్రతిభాపాటవాలను గుర్తించి అప్పటి సుప్రీం ఛీఫ్ జస్టిస్  వెంకట చల్లయ్య ఆయనను సీనియర్ కౌన్సిల్ గా నియమించారు. సీనియర్ కౌన్సిల్ కావాలంటే 45 సంవత్సరాల వయసు ఉండాలి.

ఆయన తండ్రి శామ్ నారీమన్ కూడా ప్రముఖ న్యాయవాదే . మే 1972 నుండి 25 జూన్ 1975 వరకు శామ్ నారీమన్ భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. 26 జూన్ 1975 న ఎమర్జెన్సీ డిక్లరేషన్ తరువాత ఆ పదవికి రాజీనామా చేశారు. భోపాల్ గ్యాస్ కేసులో యూనియన్ కార్బైడ్‌కు అనుకూలంగా ఆయన వాదించారు. బాధితులకు కంపెనీకి మధ్య కోర్టు వెలుపల ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ఒప్పందం వలన బాధితులకు $ 470 మిలియన్లు పరిహారంగా అందాయి. తర్వాత కాలంలో తండ్రి కొడుకులు ఇద్దరూ భోపాల్ గ్యాస్ కేసు టేకప్ చేయడం తప్పని అంగీకరించారు. శామ్ నారీమన్ ను 1991 లో పద్మభూషణ్ .. 2007 లో పద్మభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది. 1999లో రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు.

ఇక ఆర్. నారీమన్ జులై 7 .. 2014 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసారు. బార్ కౌన్సిల్ నుండి న్యాయమూర్తి పదవి చేపట్టిన నాలుగో న్యాయవాది ఆయన. అంతకు ముందు సుప్రీంకోర్టు లో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నసమయంలో (2011 జూలైలో) భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. మూడేళ్లు పదవిలో కొనసాగారు.

అప్పటి న్యాయ శాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో విభేదాలు రావడంతో నారిమన్ సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామా లేఖలో విభేదాల గురించి ప్రస్తావించలేదు. 1991నుంచి 2010 దాకా ఫాలి నారిమన్ బార్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా చేశారు. నారీమన్ చేపట్టిన కేసులు..  తీర్పు ఇచ్చిన కేసులు అన్ని కూడా చాలా కీలకమైనవి. నారీమన్ తన మొత్తం సర్వీసులో 13 వేల కేసులు టేకప్ చేశారు.

యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 లో వివాదాస్పద సెక్షన్ 66 ఎ ను కొట్టివేసిన ఖ్యాతి ఆయనది. 66 ఎ నిబంధన ఏకపక్షంగా ఉందని … వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తుందని అప్పట్లో ఆయన చెప్పారు.  ఆగష్టు 2017 లో మరో ఇద్దరు న్యాయమూర్తుల తో కలసి ఇచ్చిన తీర్పు కూడా సంచలనమే. శతాబ్దాలనాటి ట్రిపుల్ తలాక్ లేదా తలాక్-ఇ-బిడ్డాత్ రాజ్యాంగ విరుద్ధం అని తీర్పులో స్పష్టం చేశారు.

అలాగే “గోప్యత …వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగంలోని 21 వ అధికరణ ప్రకారం హామీ ఇచ్చిందని ” అని  ఆధార్ కేసులో నారిమన్ తో  సహా తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పింది.”స్వలింగ సంపర్కులు గౌరవంగా జీవించడానికి ప్రాథమిక హక్కు కలిగి ఉంటారు … చట్టాల నుంచి రక్షణకు అర్హులు. సమాజంలో వివక్షకు గురికాకుండా గౌరవంగా జీవించేందుకు అర్హులు” అంటూ నారిమన్ మరో సంచలన తీర్పు ఇచ్చారు.

సెప్టెంబర్ 2018 లో, జస్టిస్ నారిమన్ తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 ను రద్దు చేసింది, ఇది వివాహేతర సంబంధాన్ని పురుషులకు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది, 158 ఏళ్ల  ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని  ఆర్టికల్ 21 (జీవించే హక్కు ..  వ్యక్తిగత హక్కు) స్వేచ్ఛ) మరియు ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)లకు వ్యతిరేకమని తీర్పులో స్పష్టం చేశారు.

2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లి పూజలు చేయొచ్చని తీర్పుఇచ్చింది. అంతకు ముందు ఆ ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా నిషేధం ఉంది. … దీనిపై 2006లో కొందరు మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన బెంచ్ లో నారిమన్ కూడా ఉన్నారు.

2020 డిసెంబర్‌లో నారిమన్  నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం మానవ హక్కుల పరిరక్షణ కోసం సీబీఐ ..  NIA వంటి కేంద్ర ఏజెన్సీల కార్యాలయాలలో…  అన్ని పోలీస్ స్టేషన్లలో CCTV ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే  2018 సెప్టెంబర్‌లో నారిమన్ ఉన్న ధర్మాసనం SC/ST లలో సంపన్నులను రిజర్వేషన్ పరిధి నుండి మినహాయించాలనే క్రీమీలేయర్ సూత్రాన్ని సమర్థించింది. ముఖేష్ అంబానీ సోదరుల మధ్య ఆస్తి వివాదాన్ని కూడా నారీమన్ పరిష్కరించారు. ఇలాంటి సంచలన తీర్పులు నారిమన్ హయాంలో ఎన్నో వెలువడ్డాయి. నారీమన్ ఆగస్టు 13 ..  2021 న పదవీ విరమణ చేశారు.

————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!