love gift …………………………….
అప్పుడెప్పుడో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమ చిహ్నంగా తాజ్ మహల్ నిర్మించి చరిత్రకెక్కారు. తాజాగా ఆనంద్ అనే అభినవ షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్ ప్రతిరూపంలో ఉన్న ఒక ఇల్లు నిర్మించి కానుక గా సమర్పించుకున్నాడు.
ఆ అభినవ షాజహాన్ పూర్తి పేరు ఆనంద్ ప్రకాష్ చౌక్సే ముంతాజ్ తుది శ్వాస విడిచిన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో ఒక విద్యా సంస్థను నడుపుతున్నాడు ఆయన.ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ స్థాయిలో కాకపోయినా 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులలో నాలుగు బెడ్‌రూమ్‌లు, ఒక ధ్యాన మందిరం నిర్మించారు ఆనంద్.
అయితే నిర్మాణ ఖర్చు ఎంత అయిందో మాత్రం ఆనంద్ ఎవరికి చెప్పడం లేదు. హిందువులు .. ముస్లింల మధ్య ప్రేమ సందేశాన్ని పంచుతూ .. సోదరభావాన్ని పెంపొందించే లక్ష్యం తో తాజ్ మహల్ నమూనాలో తాను ఇంటిని నిర్మించానని చౌక్సే అంటున్నారు.
1,700 మంది విద్యార్థులతో ఆనంద్ పెద్ద విద్యా సంస్థను నడుపుతున్నారు. ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచే కాక విదేశాల నుండి కూడా చాలా మంది విద్యార్థులు ఇక్కడ కొచ్చి చదువుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే తల్లిదండ్రులు బుర్హాన్‌పూర్ ప్రత్యేకత గురించి అడుగుతుంటారట. అందుకే నగరంలోనే తాజ్‌మహల్‌ను నిర్మించి ముంతాజ్ చరిత్ర గురించి వారికి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఆనంద్ చెబుతున్నారు.
తన భార్య తాజ్ మహల్ లాంటి ఇంటిని నిర్మించమని తనను అడగలేదని …ఇది పూర్తిగా తన ఆలోచన అని ఆనంద్ అంటున్నారు. ఈ మినీ తాజ్ మహల్ మోడల్ ఇంటిని స్థానిక ఆర్కెటిక్స్ డిజైన్ చేశారు. పాలరాతి పనిని ఆగ్రా నుండి వచ్చిన కళాకారులు చేసారు.మూడేళ్ళ సమయం తీసుకుని ఈ మినీ తాజ్మహల్ ను అద్భుతంగా కట్టారు.
ఇక చారిత్రక కథనాల ప్రకారం ముంతాజ్ జూన్ 1631లో బుర్హాన్‌పూర్‌లోని షాహీ మహల్‌లో మరణించింది. ఆమె మృత దేహాన్ని ఆగ్రాకు తరలించడానికి ముందు అహుఖానా అనే సమాధిలో ఆరు నెలల పాటు భద్రపరిచారు. బుర్హాన్‌పూర్ జిల్లాలోని తపతి నది ఒడ్డున తాజ్ మహల్‌ను నిర్మించాలని షాజహాన్ మొదట భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆగ్రాను ఎంచుకున్నారని స్థానికులు అంటారు.బుర్హాన్‌పూర్‌లో అహుఖానా ఇప్పటికీ పదిలంగా ఉంది.ఇక ఈ తాజ్ మహల్ ను చూసి డబ్బున్న మహారాజుల భార్యలు ఇలాంటివి కోరినా ఆశ్చర్యపోనక్కర్లేదు