తెలుగు సినిమా నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం తెలుగులో కథలు లేవని కాదు. రాసే వాళ్ళు లేరని కాదు. సాహసం చేయలేకనే అని చెప్పుకోవాలి. ప్రూవ్డ్ సబ్జెక్టు అయితే హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం.అందుకే రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ధోరణి కి భిన్నంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల ఆధారం గా సినిమా తీస్తున్నారు.
ఆ సినిమా పేరే ” కొండ పొలం ” నవల పేరు కూడా అదే. సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి ఈ నవల రాశారు. 2019 లో ఈ నవల తానా బహుమతి అందుకున్నది. రచయిత కడప జిల్లా వారు. బడుగు జీవుల సమస్యలు బాగా తెలిసినవారు. కథ గ్రామీణ ప్రజల జీవితానికి దర్పణంగా నిలుస్తుంది. పశువులు మేపుకునే కాపరుల జీవన శైలిని చూపుతుంది. భిన్న పార్శ్వాలను స్పృశిస్తూ రచయిత కథనాన్ని నడుపుకొస్తారు.
అడవుల్లో జంతువులు కాదు ప్రమాదకరమైన ఎర్ర చందనం స్మగ్లర్లు తిరుగుతుంటారు. గొర్రెల కాపరి కొడుకు ఇందులో ప్రధాన పాత్ర. ఇంతకు ముందు ఎవరు టచ్ చేయని కొత్త సబ్జెక్ట్ ఇది. కథలో ఆసక్తికరమైన మలుపులు కూడా ఉంటాయి. సినిమాకు సూటయ్యే కథే.ఈ బ్యాక్ డ్రాప్ లో కథను అద్భుతం గా తెరకెక్కించవచ్చు.దర్శకుడు క్రిష్ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 45 రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశారు.
సినిమాలో పులి క్యారెక్టర్ కూడా కీలకం కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ జోడిస్తున్నారు. మూల కథకు క్రిష్ తనదైన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసి మరింత ఆసక్తికరంగా తెరపై కెక్కిస్తున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రిష్ టీమ్ అంతా ఈ సినిమాకు పనిచేస్తున్నారు
మంచి కథాబలం గల ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఓటీటీ వేదిక ద్వారా విడుదల చేయాలనుకున్నారు. అయితే నిర్మాతలు సినిమాను థియేటర్ల లో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఫినిషింగ్ టచ్ లో ఉంది. ఉప్పెన లో నటించిన వైష్ణవ్ తేజ్ కొండపొలం లో హీరో గా చేస్తున్నారు. తొలి సినిమాతోనే రికార్డులు సృష్టించిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండ పొలం తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.