నిజాయితీకి నిలువెత్తు రూపం ఎం.సీ.!!

Sharing is Caring...

Taadi Prakash……………………..

1983 మార్చి 25వ తేదీ… సాయంకాలం. ఢిల్లీలో అలవాటు ప్రకారం ఈవెనింగ్ వాక్ కి వెళుతున్నారో పెద్దాయన. అది కాకానగర్.అక్కడ చాయ్ తాగడం ఒక పాత అలవాటు.వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు. టీ పెట్టే యాదవ్ సింగ్ పెద్దాయన్ని చూసి కిచెన్ లోకి వెళ్ళాడు.

కుర్చీలో పెద్దాయన ఒక పక్కకి వాలిపోయాడు. అది చూసిన అక్కడి బోయ్ ఒకడు యాదవ్ కి చెప్పాడు. ఒక చెక్క మంచమ్మీద పడుకోబెట్టారు. ఆయన వొళ్ళు చల్లబడిపోయింది. పెద్దాయనెవరో అక్కడెవరికీ తెలీదు. పోలీసులకి చెప్పారు.వారు వచ్చి బాడీని పెద్దాసుపత్రికి అప్పజెప్పారు.

ఇంతకూ ఆయన ఎవరో కాదు ఎం.సీ.గా ప్రసిద్ధుడైన ప్రముఖ జర్నలిస్ట్ మానికొండ చలపతిరావు. మన తెలుగువాడు. జవహర్లాల్ నెహ్రూకీ, ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ పిళ్ళైకి సన్నిహిత మిత్రుడు. మర్నాడు ఫోన్ చేసిన ఇందిరా గాంధీకి ఎం.సీ కనిపించడం లేదని తెలిసింది. ఆమె సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు.

అనాధ శవాల గురించి ఎంక్వయిరీ జరిగింది. ఆస్పత్రి మార్చురీలో ఒక శవం వుందని తెలిసింది. శంకర్ పిళ్ళై వెంటనే వెళ్లి, అది చలపతిరావు గారేనని చెప్పాడు. ఎం.సీ పెళ్లి చేసుకోలేదు. ఒంటరివాడు. ఇండియా గర్వించదగ్గ జర్నలిస్ట్..ఆయనిక లేడన్న వార్త ఇందిరా గాంధీని, ఇతర పెద్ద జర్నలిస్టుల్నీ కలచివేసింది. 27వ తారీఖున ఢిల్లీలో అంత్యక్రియలు జరిగాయి.

*** *** ***
1957లో దేశంలో ఎన్నికలు జరుగుతున్నపుడు ప్రచారం కోసం నెహ్రూ బొంబాయి వెళ్లారు. అక్కడ ఆంగ్ల దినపత్రిక నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ కి వెళ్లి, చీఫ్ ఎడిటర్ ఎం.సీ ని కలిశారు. ‘నా ఎన్నికల సభలన్నీ మీరే స్వయంగా వచ్చి కవర్ చేయాలి’ అని కోరారు. నెహ్రూతో పాటు ప్రతిరోజూ ఎన్నికల ప్రచార సభలకు వెళ్లడం, సాయంత్రం లేటుగా వచ్చి నెహ్రూ ప్రసంగాలని రాయడం చలపతిరావు పని.

కొన్నిరోజుల తర్వాత, ఒకనాడు ఎందుకో ఎం.సీ కి నెహ్రూతో వెళ్లడం కుదర్లేదు. అయినా, మర్నాడు నేషనల్ హెరాల్డ్ లో నెహ్రూ ప్రసంగం, సభ విశేషాలతో వివరంగా వార్త వచ్చింది. ఇంత చక్కని ఇంగ్లీషులో వార్త రాసిందెవరు? అని ఆశ్చర్యపోయిన ఎం.సీ, సీనియర్ జర్నలిస్టుల్ని పిలిచి ‘ఇదెలా జరిగింది?’ అని అడిగారు.

‘రాత్రి లేట్ గా ప్రధాని నెహ్రూగారే ఆఫీసుకు వచ్చి, ఆయనే వార్త రాసి ఇచ్చారు’ అని వాళ్ళు చెప్పారు. ఈ తీయని జ్ఞాపకాన్ని ఒక వ్యాసంలో ఎం.సీ.నే రాశారు.చలపతిరావు తెలుగు పత్రికల్లో పనిచేయకపోవడం వల్ల ఆయన మన వాళ్ళకి పెద్దగా తెలీదు. ఎం.సీ ఢిల్లీలో, బొంబాయిలో మాట్లాడుతుంటే కొమ్ములు తిరిగిన జర్నలిస్టులంతా చేతులు కట్టుకుని వినేవాళ్లు.

నెహ్రూ, ఇందిరా గాంధీ ఎం.సీ  ని ఆదరించి, సొంత ఇంటి మనిషిలా గౌరవించేవారు. ఎం.సీ ఇంగ్లీషు వ్యాసాలు, రాజకీయ విశ్లేషణలూ, వ్యాఖ్యానాలూ మాలాంటి అరకొర జర్నలిస్టులకు పాఠ్యపుస్తకాలు.శ్రీకాకుళం జిల్లాలో ‘అంబఖండి’ అనే కుగ్రామానికి చెందినవారు ఎం.సీ. 1910లో విశాఖలో జన్మించారు.

1936 నుంచీ ప్రసిద్ధ ఆంగ్ల దినపత్రికల్లో పనిచేశారు. 1946లో ప్రతిష్టాత్మకమైన నేషనల్ హెరాల్డ్ ఇంగ్లీష్ డైలీకి ప్రధాన సంపాదకుడయ్యారు. 1978 వరకు 36 సంవత్సరాల పాటు పత్రికను అద్భుతంగా నడిపించారు. 1968లో తనని వరించి వచ్చిన ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చివేశారు.

‘జర్నలిస్టు అయినవాడు గొప్ప కమ్యూనికేటర్ కావాలి. అలా ప్రజలతో కమ్యూనికేట్ చేయగలిగిన వాడూ, స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం పోరాడినవాడూ అయిన మహాత్మా గాంధీ దేశంలోకెల్లా అత్యుత్తమ జర్నలిస్టు’ అన్నారు ఎం.సీ.

‘చలపతిరావు లాంటి సమర్థవంతుడైన, నిజాయితీపరుడైన ఎడిటర్ ని ఈ దేశంలో మరొకరిని నేను ఊహించలేను’ అన్నారొకసారి నెహ్రూ. వామపక్ష జర్నలిజం తండ్రిగా గుర్తింపు పొందిన మద్దుకూరి చంద్రశేఖరరావు తొలి స్మారకోపన్యాసం ఎం.సీ చేశారు. విజయవాడలో 1982లో ‘విశాలాంధ్ర’లో ఈ సభ జరిగింది.తొలి ప్రెస్ కమిషన్, ప్రెస్ కౌన్సిల్, జర్నలిస్టుల వేజ్ బోర్డు… అన్నీ ఎం.సీ చలవే, ఎం.సీ చొరవే!

కట్ చేస్తే అది  1980. విశాఖపట్నం ‘ఈనాడు’లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను.. నా వయసు 23 ఏళ్లు. ఒక మధ్యాహ్నం ఆఫీసులో కూర్చుని వార్తలు రాసుకుంటున్నాను. అప్పటి మా న్యూ ఎడిటర్ తెన్నేటి కేశవరావు గారు పెద్దమనిషి, బాగా చదువుకున్నవాడు.ప్రకాష్ మీకు ఎంసీ తెలుసా? అని అడిగారు. మానికొండ చలపతిరావు గారేగా.. తెలియకేం ఆయన ఇంగ్లీషు వ్యాసాలు కొన్ని చదివాను  అని చెప్పా.

ఎంసీ ఇప్పుడు వైజాగ్ లోనే ఉన్నారు “కలిసి మాట్లాడి రారాదూ” అన్నారాయన. కొంత ఆశ్చర్యం.. ఆనందం. ఈనాడు ఆఫీసు సీతమ్మధారలో ఉండేది. పది నిమిషాలు నడిచి వెళ్లేంత దూరంలోనే, బంధువుల ఇంట్లో ఎంసీ ఉన్నారు. అంత పెద్ద సంపాదకునితో ఏం మాట్లాడాలి అనుకుంటూనే, చిన్న నోట్ బుక్ తీసుకొని వెళ్ళాను. కొంత ఉద్వేగంతో ఉన్నాను.

జాతీయ స్థాయి ఉన్న టాప్ క్లాస్ జర్నలిస్ట్ ఆయన. లక్నోలో ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులు పొందిన వాడు.ఈశ్వర దత్, కోటంరాజు రామారావు లాంటి అనేకమంది గొప్ప సంపాదకులు ఎంసీ అంటే ఎంతో గౌరవంతో మాట్లాడేవాళ్లు.  నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా రాసే చలపతిరావుని …నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తే స్పేర్ చెయ్యకు. నన్ను కూడా మందలించు, విమర్శించు’ అని చెప్పిన ప్రజాస్వామికవాది నెహ్రూ.

ఆ వ్యక్తులూ.. ఆ పోరాటం.. అదొక మహెూజ్వలమైన కాలం. మా పాలనకు కాలం చెల్లిందని బ్రిటిష్ వాళ్ళు గ్రహించి, గడగడలాడుతున్న మంచి రోజులవి. ట్రాఫిక్కూ, హడావిడీ, రణగొణ ధ్వనులు లేని ప్రశాంతమైన విశాఖ.. పరిశుభ్రంగా ఉన్న ఒక మధ్యతరగతి ఇల్లు .. ముందు గదిలో ఒక సోఫాలో మానికొండ చలపతిరావు అనే మహెూన్నత మానవుడు కూర్చుని ఉన్నాడు.

చాలా సాధారణమైన మనిషి, చామన ఛాయ. బట్టతల. 70 ఏళ్ళు దగ్గర పడుతున్న వయసు. విష్ చేశాను. నవ్వి, పలకరించి, కూర్చోండి అన్నారాయన. జర్నలిజంలో తొలి అక్షరాలు దిద్దుతున్న కుర్రకుంకని ఆ హిమాలయానికి ఎదురుగా కూర్చోవడమా! మన శ్రీకాకుళం జిల్లా మనిషి. తెలుగు వాడు. భారతీయ జర్నలిజం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాన సంపన్నుడు. నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచిన వాడు. రెండు మూడు మాటలేవో మాట్లాడాను.

వీడు పిల్ల ముండాకొడుకు అని కొట్టి పారేయకుండా. మన ప్రజాస్వామ్యం , దిగజారుతున్న దేశ రాజకీయ పరిస్థితి గురించీ, ప్రజల జీవితాలు అద్వాన్నమైపోతున్న తీరు గురించీ చక్కని తేట తెలుగులో ఎంసీ మాట్లాడారు. కళ్ళజోడు లోంచి కాంతులీనుతున్న ఆయన బ్రిలియంట్ కళ్ళనే చూస్తూ… శ్రద్ధగా వింటూ- నేను. అరగంటకు పైగా మాట్లాడారు. లేచి నిలబడి ‘థాంక్యూ సర్’ అన్నాను.

పెద్దాయన లేచి నిలబడి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. వస్తాను సర్ అంటే చిన్నగా నవ్వి, తల ఊపారు. నెహ్రూకి, ఇందిరా గాంధీకి ఎన్నోసార్లు షేక్ హ్యాండ్ ఇచ్చిన మహత్తరమైన ఒక అరచేతి స్పర్శని నా చేతిలో దాచుకుని, బయటికి నడిచాను..

పొంగిపొర్లుతున్న పట్టలేని ఆనందంతో… వచ్చి ఎంసీ మాట్లాడిన దాన్ని వివరంగా వార్త రాశాను. అది మర్నాడు ఈనాడులో ప్రముఖంగా వచ్చింది.హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఆఫీసు ముందున్న నాలుగు రోడ్ల కూడలిలోఎంసీ విగ్రహం చూసినప్పుడు ఇలాంటి జ్ఞాపకాలు నన్ను కమ్ముకుంటాయి.

(అమరయ్యకి అభినందన  ఎంసీ వంటి మహోన్నతుడి గురించి తెలుగులో వచ్చిన తొలి పుస్తకం ‘భారతీయ జర్నలిజం ధృవతార – మానికొండ చలపతిరావు’. సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య ఎంతో శ్రద్ధగా ఈ పుస్తకం రాశారు. మరికొందరు సీనియర్లు రాసిన వ్యాసాలు కూడా ఇందులో వున్నాయి.అమరయ్య గారూ.. మీ కృషి తెలుగు జర్నలిజం చరిత్రలో ఎప్పటికీ నిలిచి వుంటుంది.)

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!