Bharadwaja Rangavajhala … He proved that nothing is impossible for him
సూపర్ స్టార్ కృష్ణ సినిమా అవకాశాల కోసం పంపిన ఫొటోల్లో ఇదీ ఒకటి. ఆయన తేనెమనసులు కన్నా ముందు “పదండి ముందుకు”అనే జగ్గయ్య నేతృత్వంతో రూపుదిద్దుకున్న సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత శ్రీధర్ డైరక్షన్ లో ఓ తమిళ సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోయారు. కృష్ణన్ అని పేరు కూడా మార్చేశారు.
అయితే ఆ కారక్టరు రవిచంద్రన్ కు వెళ్లిపోయింది. అదే శ్రీధర్ డైరక్షన్ లో డెబ్బై దశకంలో “హరే కృష్ణ హలో రాధ “సినిమా చేశారు. కులగోత్రాలు, పరువు ప్రతిష్ట లాంటి సినిమాల్లోనూ కృష్ణ కనిపిస్తారు. అలాగే ఎల్వీ ప్రసాద్ తీయబోయిన ‘కొడుకులూ కోడళ్లూ’ సినిమాలోనూ కృష్ణకు ఛాన్సొచ్చింది. అదీ మరో నాల్రోజుల్లో షూటింగ్ అనగా ఆగిపోయింది.
కృష్ణ నటించిన ‘అసాధ్యుడు’ సినిమా ఎన్టీఆర్ విజయాబ్యానర్ లో చేసిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ రెండూ 1968 సంక్రాంతికి రిలీజయ్యాయి. విజయా వారి ఎన్టీఆర్ సినిమా మీద పోటీకి సినిమా వేయడమా అన్నవారు చాలా మందే ఉన్నారు. అయితే “ఉమాచండీగౌరీశంకరుల కథ” విజయా బ్యానర్ లో ఎన్టీఆర్ చేసిన సినిమాల్లోనూ అలాగే కె.వి.రెడ్డి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లోనూ కూడా తొలి ఫ్లాపు.
ఆ ఏడాది “అసాధ్యుడే” హిట్టు కొట్టింది. అలా టైటిల్ కు న్యాయం చేసిన కృష్ణ విజయాలో చక్రపాణి చేతుల మీదుగా రూపొందిన ఎన్టీఆర్ లేకుండా తీసిన రెండు సినిమాల్లోనూ కృష్ణే హీరో కావడం విశేషం. ఆ రెండు సినిమాలే గంగ మంగ, రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్.
కృష్ణ విలన్ గానూ నటించారు. విశ్వనాథ్ తీసిన ప్రైవేటు మాస్టర్ మూవీలో రామ్మోహన్ హీరో అయితే కృష్ణ విలన్ చేశారు. చివర్లో మారతాడనుకోండి. ఇక పాపకోసం లో కూడా ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు కృష్ణ. సత్యచిత్ర కోసం బాపు తీసిన “ఏది ధర్మం ఏది న్యాయం “మూవీలో ఐదు నిమిషాల నిడివి ఉన్న కోర్టు సీన్ లో కృష్ణ నటించారు.
మొత్తం మీద సినిమాల్లో చిన్నపాత్రల్లో నటించిన అనుభవం తో కృష్ణ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆతర్వాత కెరీర్ పరం గా ఎన్ని హిట్స్ కొట్టారో అందరికి తెల్సిందే. పదండిముందుకు సినిమాలో తనకు ఛాన్స్ ఇచ్చిన జగ్గయ్య తో కృష్ణ అనుబంధం చివరివరకు కొనసాగింది.
దేవుడే గెలిచాడు , దేవుడు చేసిన మనుషులు ,మీనా , అల్లూరి సీతారామరాజు అలా బోలెడు చిత్రాలున్నాయి .అసాధ్యుడు డైరెక్టర్ రామచంద్రరావు తో కృష్ణ తర్వాత కాలంలో చాలా సినిమాలు తీసాడు. వాటిలో దేవుడు చేసిన మనుషులు , సీతారామరాజు సూపర్ హిట్ అయ్యాయి.