యానోమామి తెగలో కనిపించే వింత ఆచారం !!

Sharing is Caring...

 Strange Custom………….

యానోమామి తెగల ప్రజలు వెనిజువెలా (Venezuela) దక్షిణ భాగం ,బ్రెజిల్ (Brazil) ఉత్తర భాగం,ఈ రెండు దేశాల సరిహద్దు వెంబడి విస్తరించిన అమెజాన్ వర్షారణ్యాలు, ఒరినోకో నది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నారు.ఈ తెగ జనాభా 35,000–40,000 మంది వరకు ఉంటారని అంచనా.

ఆ తెగలో మృతుల ఆత్మ కుటుంబంలోనే ఉండాలని భావిస్తారు. అందుకే మృతదేహాన్ని దహనం చేయగా మిగిలే బూడిదను (Ashes) అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.దహనం తర్వాత మిగిలిన ఎముకలను పొడి చేసి, బూడిదతో కలిపి భద్రపరుస్తారు.ఈ బూడిదను అరటిపండ్లతో చేసిన ఒక ప్రత్యేకమైన  గంజిలో కలుపుతారు. దీనిని ‘రిపు’ (Ripu) అని కూడా అంటారు.

ఒక మంచి రోజు చూసి ఆ గంజి ని కుటుంబ సభ్యులు సేవిస్తారు.ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మ తమలోనే ఉంటుందని,తదుపరి జన్మలో రక్షణ లభిస్తుందని ఆ తెగ ప్రజల నమ్మకం.చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలంటే, ఆ వ్యక్తి శరీర అవశేషాలు తమ సొంత మనుషుల శరీరాల్లోకి చేరాలని వారు నమ్ముతారు. అందుకే తెగలోని వారందరూ కలిసి ఆ బూడిద కలిపిన గంజి ని తాగుతారు.

ఈ తెగలో కనిపించే ఈ ఆచారం పూర్తిగా ఆధ్యాత్మిక–సాంస్కృతిక విశ్వాసం మాత్రమే. ఈ ప్రక్రియలో భాగంగా ఆ ఆత్మకు సరైన విధంగా వీడ్కోలు ఇవ్వకపోతే, అది అక్కడే తిరుగుతూ కుటుంబానికి కష్టాలు తెస్తుంది.వ్యాధులు, అపశకునాలు వస్తాయని ఆ తెగ నమ్మకం. అందువల్ల మృతుడి ఆత్మను తిరిగి  కుటుంబంలో విలీనం చేయడం ప్రధాన లక్ష్యం.

మరణం తరువాత శవాన్ని అడవిలో ఒక ప్రత్యేక స్థలానికి తీసుకెళ్తారు.సంపూర్ణంగా దహనం చేస్తారు. ఇలా చేయడం ద్వారా శరీరాన్ని ప్రకృతిలోకి తిరిగి పంపామని, ఆత్మకు శరీర బంధం లేకుండా చేశామని భావిస్తారు. కొన్నిచోట్ల భస్మాన్ని సేవించకుండా కేవలం దహనం, స్మరణ మాత్రమే చేస్తున్నారు.శత్రువుల చేతిలో తమ తెగ వ్యక్తి చనిపోతే, ప్రతీకారం తీర్చుకునే వరకు ఆ బూడిదను భద్రపరిచి, ప్రతీకారం తీర్చుకున్నరోజే ఈ ఆచారాన్ని పూర్తి చేస్తారు.

ఈ యానోమామి ప్రజలు వృత్తాకారంగా నిర్మించిన పెద్ద సామూహిక గుడిసెల్లో నివసిస్తారు..దీనిని షబోనో అంటారు..మధ్యలో పెద్ద ఖాళీ ప్రాంగణం ఉంటుంది.వీరివి వ్యక్తిగత ఇళ్లు కాదు. సమూహ జీవితం వీరి సంస్కృతి మూలం.యానోమామి తెగ ప్రజల జీవనం వేటతో పాటు చిన్నపాటి వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది.

అడవి పందులు,పక్షులు,నదుల్లోని చేపలను వేటాడతారు. పండ్లు, తేనె, వేర్లు సేకరిస్తారు.అరటి (plantain) కసావా (manioc) మిరపకాయలను పండిస్తారు.విషపూరిత మొక్కలతో చేపలకు మత్తెక్కించి పట్టే పద్ధతిని అనుసరిస్తారు.వీరివి చిన్న గ్రామాలు ..ఒక్క గ్రామం లో  50–200 మంది నివసిస్తారు.

పెద్దలు, ముఖ్యంగా శామన్ల (Shamans) కు అధిక గౌరవం ఇస్తారు. శామన్లు అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువులు.. వైద్యం కూడా చేస్తారు. వీరు భౌతిక ప్రపంచానికి ..ఆత్మల లోకానికి మధ్య వారధులుగా వ్యవహరిస్తారు.

వీరు చాలా సరళమైన దుస్తులు ధరిస్తారు.శరీరంపై ఎర్ర రంగు (అనాట్టో విత్తనాల రసం) పూసు కుంటారు.నలుపు రంగు పూసలు, పక్షుల ఈకలతో  శరీరాలను  అలంకరించుకుంటారు. నాగరిక ప్రపంచంతో సంబంధాలు పరిమితంగా ఉంటాయి. 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి మిషనరీలు ప్రభుత్వ అధికారులు అపుడపుడు ఈ అడవుల్లోకివెళ్తున్న కారణంగా నాగరికత గురించి తెలుసుకుంటున్నారు.

1980 తర్వాత నుంచి అక్రమ బంగారం మైనింగ్ చేసేవారు (గారింపెయిరోస్) యానోమామి ప్రాంతాల్లోకి చొరబడి అడవిని నాశనం చేయడంతో పాటు మలేరియా, గొంతు వాపు వంటి వ్యాధులను వ్యాపింపజేశారు. దీనివల్ల తెగ జనాభాలో దాదాపు 20% మంది మరణించారు.చట్టపరమైన రక్షణ ఉన్నా, అక్రమ గనుల సమస్య కొనసాగుతోంది. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!