ఫీల్ గుడ్ మూవీస్ లో ఓ మాణిక్యం !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………………

మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా.  ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట . ముందు తల్లీకొడుకులు అనుకున్నారట . ఆమె కొరకు వదినా మరిదులుగా మార్చారట . ఆ తర్వాత ఆమె డైలాగులు . సినిమాలో ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు పెట్టేస్తుంది. 

లావుగా ఉంటే బస్తా అనో రబ్బరు బంతి అనో .  ఈ సినిమాలో కూడా మల్లయ్య పాత్రలో ధూళిపాళను , జమున తల్లి పాత్రలో మోహనను ఇలా రకరకాల పేర్లతో వాయించేస్తుంటుంది. భానుమతి ని దృష్టిలో ఉంచుకునే రాజశ్రీ మాటలు కూడా రాశారు.

మంచి సినిమా . An entertaining Feel Good Movie . బాగా ఆడింది . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే. సినిమా ప్రారంభమే భానుమతి పాడే శరణం నీ దివ్య చరణం అనే పాటతో . చెవుల్లోని తుప్పు వదులుతుంది . మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట , నా మాటే నీ మాటై చదవాలి పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .

రిం జిం రిం జిం హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ పాటతో , పాటలో హైదరాబాద్ వర్ణన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో టీజింగ్ పాట హుషారుగా ఉంటుంది ఆ డియ్యాలో అనే పదాన్ని రచయిత రాజశ్రీ ఎక్కడ నుండి పట్టుకొచ్చాడో కానీ గమ్మత్తుగా ఉంటుంది .

బి వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భానుమతి , జమున , రుష్యేంద్రమణి , గీతాంజలి , మోహన , చలం , ప్రభాకరరెడ్డి , సాక్షి రంగారావు , రాజనాల , కె వి చలం , పద్మనాభం ప్రభృతులు నటించారు .

చలం ‌స్వంత సినిమా కదా ! చాలామంది హాస్య నటుల్ని ఏదో ఒక పాత్రలో చూపించాడు . రాజశ్రీ డైలాగులు బాగుంటాయి . కోకమ్మ గారు అని జమునని చలం చేత అనిపిస్తారు . కోక అంటే చీరె . చీరె అంటే శారీ ..

జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా అందుకుంది. చలం అదృష్టవంతుడు . పద్మనాభం , కాంతారావుల్లాగా చేతులు కాల్చుకోలేదు. శారదతో కలిసి ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. అటు పేరు , ఇటు డబ్బులు అన్నీ వచ్చాయి. తెలుగు సినిమాల్లో ఇదొక మాణిక్యం అనుకోవచ్చు.. మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . యూట్యూబులో ఉంది . చూడనివవారు ఉంటే వాచ్ లిస్టులో పెట్టేయవచ్చు .

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!