The struggle of sex workers ……..
జ్యోతిలక్ష్మి…. 2015లో రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమా పేరు ‘జ్యోతిలక్ష్మి’ కానీ ఇందులో నృత్యతార జ్యోతిలక్ష్మి నటించలేదు. ఆపాత్రలో నటి ‘ఛార్మి’ నటించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ’మిసెస్ పరాంకుశం’ ఆధారంగా తీసిన సినిమా ఇది.
వేశ్యల జీవితాలపై తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి కానీ విజయవంతమైనవి దాదాపుగా లేవు. పూరీ జగన్నాథ్ ధైర్యం చేసి ఈ సినిమా తీశారు. ఇది ఓ వేశ్య తిరుగుబాటు అనుకోవచ్చు. సమాజం పై చేసిన పోరాటం అనుకోవచ్చు.
కథ విషయానికి వస్తే.. జ్యోతిలక్ష్మీ అనే వేశ్యని చూసిన సత్య అనే యువకుడు తొలిచూపులోనే ప్రేమలో పడి… ఆమె కోసం వెతుకుతాడు… నారాయణ పట్వార్ అనే రౌడీ ఆధ్వర్యంలో నడుస్తున్న గంగాభాయి బ్రోతల్ హౌస్ లో జ్యోతిలక్ష్మీ పాపులర్ కాల్ గర్ల్ అని తెలుసుకుంటాడు.ఓ విటుడిగా వెళ్లి తనను ప్రేమిస్తున్న విషయం చెబుతాడు.
తనను కామిస్తున్నాను అనే వారిని తప్ప ప్రేమిస్తున్నాను అనే పిలుపు వినడం కొత్తగా ఫీలయిన జ్యోతిలక్ష్మీ.. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా.. సత్య ప్రేమ లోని నిజాయితీ నచ్చి అంగీకరిస్తుంది. దీంతో బ్రోతల్ హౌస్ నుంచి ఆమె ను బైటకు తీసుకొచ్చి పోలీసుల సహాయంతో జ్యోతిలక్ష్మీని పెళ్లి చేసుకుంటాడు సత్య…ఇక జ్యోతిలక్ష్మీ పెళ్లి విషయం తెలిసిన నారాయణ పట్వార్.. సత్యపై దాడి చేయించి ఆసుపత్రి పాలు చేస్తాడు.
మరోమార్గం లేక జ్యోతిలక్ష్మి తమవద్దకే వస్తుందన్నది నారాయణ పట్వార్ ప్లాన్. అయితే జ్యోతిలక్ష్మీ ఇందుకు అంగీకరించదు. ఈ లోపు బ్రోతల్ కేసులో ఇరికించడంతో పరువుకు బయపడ్డ జ్యోతిలక్ష్మీ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటుంది… దీనిని ప్రతిఘటించిన జ్యోతిలక్ష్మీ ఈ సెక్స్ రాకెట్‌ను ఎలా ఎదిరించింది అనేది మిగతా కథ.
‘జ్యోతిలక్ష్మీ’ టైటిల్ రోల్ పోషించిన చార్మి అందం, అభినయం ఆసాంతం ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం సన్నబడిన చార్మి నాజూకు అందాలతో కనువిందు చేసింది. అప్పటికి ఛార్మి ఫేడవుట్ కాలేదు. ఇక సత్య పాత్రలో నటించిన సత్య పర్వాలేదు.. టెంపర్ సినిమాలో రేప్ విక్టిమ్‌గా నటించిన అపూర్వ.. ఈ సినిమాలో హీరోను లవ్ చేసే శ్రావణి పాత్రలో నటించింది.
ఇక శాండీగా నటించిన కుర్రాడు కూడా చలాకీ నటనతో నవ్వించాడు. ప్లే బాయ్ కమలాకర్‌గా బ్రహ్మానందం.. నవ్వించే ప్రయత్నం చేశాడు. క్లైమాక్స్‌లో సంపూ, సప్తగిరి, సత్యం రాజేశ్, కాదంబరి కిరణ్ వంటి కమెడియన్స్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రోతల్ కేసుల్లో అమ్మాయిలు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు.. ప్రముఖ పారిశ్రామిక వేత్తల పేర్లు ఎందుకు బయటకు రావు అనే విషయాలను స్పృశించారు.
ఇది నటి శ్వేతాబసు అరెస్ట్ వ్యవహారాన్ని గుర్తుకు తెస్తుంది. సెక్స్ రాకెట్ గ్రూప్‌ని చార్మి ఎదిరించే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి.’ఆడపిల్లలంటే ఆ దేవుడికి కూడా చులకనే… అందుకే ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు. అందరూ మగపిల్లల్నే కన్నారు! ఆకట్టుకుంటాయి ..‘ఆడదాని పరువు తీస్తారు… మగవాడి పరువు దాస్తారు..’ వంటి డైలాగులు ఆకట్టుకుంటాయి. మొత్తానికి అప్పుడెప్పుడో వచ్చిన నవలను ఈ కాలపు పరిస్థితులకు అన్వయిస్తూ పూరీ సినిమాను బాగానే తెరకెక్కించాడు.
కానీ ఇంకా బాగా తీసి ఉండాలి ఆయన స్థాయికి. భాస్కరభట్ల పాటలు .. సునీల్ కశ్యప్ సమకూర్చిన బాణీలు బాగున్నాయి. పి.జి. విందా కెమెరా పనితనం పాటల్లో సూపర్బ్ అనిపించుకుంటుంది.అయితే సినిమాలో భావోద్వేగాలు పండే సన్నివేశాలు బహు తక్కువ. జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్ పై మరింత శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.
అక్కడక్కడా జ్యోతిలక్ష్మి క్యారెక్టర్ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మరీ సినిమాటిక్గా ఉందనిపిస్తుంది. ఈ కథను ఇంకొకరు తీసినా ఇంత కంటే గొప్పగా తీయలేరేమో . ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది. పూరి ,ఛార్మి అభిమానులు, చూడనివారు చూడవచ్చు.