Mohammed Rafee………………
ధర్మేంద్ర… కావచ్చు! ఇంకెవరైనా కావచ్చు! విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహం చేసుకుంటే ……ధర్మేంద్ర విషయంలో ఇప్పుడెదురవుతున్న మాటలే వినిపిస్తాయి! చిన్న వయసులోనే ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్ తో వివాహమైంది. సన్నీ డియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు హీరోలు వారి కుమారులే! మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. మొదటి వివాహంలో నలుగురు సంతానం.
ఆ తరువాత సూపర్ హిట్ పెయిర్ గా సినిమాల్లో ప్రసిద్ధి పొందిన ధర్మేంద్ర హేమమాలిని ప్రేమలో పడ్డారు. కానీ, మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మేంద్రకు ఇష్టం లేదు. పిల్లల కోసం కౌర్ కు ఇష్టమూ లేదు! ధర్మేంద్ర హేమమాలిని ముస్లిం మతం స్వీకరించి పేర్లు మార్చుకున్నారు. ధర్మేంద్ర దిలావర్ ఖాన్ అయ్యారు. హేమ అయేషాబీగా మార్చుకున్నారు. హిందూ మతంలో బహు భార్యత్వం చెల్లదు! అందుకే మహమ్మదీయులుగా మారి వివాహం చేసుకున్నారు.
వారికి ఈషా, అహనా ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్య కౌర్ కొన్నాళ్ళు చింతించినా తరువాత కలసిపోయింది. సన్నీ, బాబీ హీరోలు అయ్యాక ధర్మేంద్ర కూడా ఎక్కువ వారితోనే గడపడం అందరికి తెలిసిన వ్యవహారమే.
గత కొంతకాలంగా కౌర్ తోనే ధర్మేంద్ర వుంటున్నారు. అప్పుడప్పుడు హేమమాలిని ఇంటికీ వస్తున్నారని ముంబై సినిమా జర్నలిస్ట్ మిత్రురాలు, ఈషా క్లాస్మెట్ సనా తెలిపారు. చివరి దశలో కౌర్ దగ్గరే ఉన్నారు. హేమమాలిని, కుమార్తెలు కేవలం ఆసుపత్రికి వచ్చి పరామర్శించడానికే పరిమితం అయినట్లు సమాచారం.
చనిపోయినప్పుడు కూడా కేవలం శ్మశాన వాటికకు వెళ్లి మాత్రమే హేమమాలిని, ఈషా, అహనా కుటుంబ సభ్యులు ధర్మేంద్ర భౌతిక కాయాన్ని చూసుకున్నారు. కౌర్ ఇంట్లోనే ధర్మేంద్ర కనుమూసినప్పటికి, ఆ తరువాత ఆసుపత్రికి తరలించి, తిరిగి ఇంటికి కూడా తీసుకురాకుండా అటు నుంచి అటు శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
అనారోగ్యంతో చనిపోవడం వల్ల త్వరగా అంత్యక్రియలు నిర్వహించినట్లు సన్నీ డియోల్ ప్రకటించారు. కానీ, ఇరు కుటుంబాల మధ్య వివాదాల వలనే అలా కానిచ్చేసారని ముంబై మీడియా అంటోంది. ఆస్థుల వివాదాలు ఇప్పటికే చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలకు న్యాయం జరిగేలా వీలునామా తయారు చేయమని ధర్మేంద్ర గత కొన్నాళ్ళుగా చెబుతున్నా సన్నీ, బాబీ సహకరించలేదని సమాచారం.
ధర్మేంద్ర ఎంపిగా చేశారు కాబట్టి, ఆ పెన్షన్ మాత్రం తన తదనంతరం కౌర్ కు చెందేలా నామినిగా ఉంచినట్లు తెలిసింది. కుమార్తెలకు రెండు విల్లాలు మాత్రమే వచ్చాయని, వందల కోట్ల విలువ కలిగిన రిసార్టులో మాత్రం హేమమాలినికి వాటా దక్కలేదని తెలుస్తోంది. ఈ క్రమం లో ఆస్తుల వివాదం ఇంతటితో సర్దుకుంటుందా? కోర్టు మెట్ల వరకు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
హేమమాలిని స్పందన
ధర్మేంద్ర ప్రేమను మాత్రమే చూసానని, ఆయన ప్రేమకు ఫిదా అయి జీవితం అంకితం చేసుకున్నానని హేమమాలిని స్పందించారు. ఏనాడూ తాను ఆయన మొదటి భార్యను ఇబ్బంది పెట్టలేదని, జుహులో వున్న వారి ఇంటికి ఎప్పుడు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు.
ఆస్థుల జోలికి వెళ్ళలేదు, ఎన్నిఆస్థులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఏనాడూ అడగలేదు. సంపాదించుకున్న ఆస్థులు చాలు .. ధర్మేంద్రది తనది స్వచ్ఛమైన ప్రేమ అని హేమమాలిని వివరించారు.

