ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్!!

Sharing is Caring...

Paresh Turlapati ……………

అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. వాళ్ళ సినిమాల్లో కథ కన్నా కథనం బాగుంటుంది.. చిన్న బొంగరం దొరికితే చాలు దానికి పెద్ద తాడు వేసి గిరగిరా తిప్పి వదులుతారు.. ‘తుడరుం’ అలాంటిదే ..

కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ‘తుడరుమ్’ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 232 కోట్లను వసూలు చేసింది. కేరళ నుండి రూ. 118 కోట్లు వచ్చాయి.జియో హాట్ స్టార్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక తుడరుం కథ విషయానికి వస్తే రొటీన్ క్రైమ్ థ్రిల్లరే కానీ చూసే ప్రేక్షకులకు రెండున్నర గంటల పాటు ఉత్కంఠత కలిగించే విధంగా వెండి తెర మీద ఆవిష్కరించిన దర్శకుడి ప్రతిభకు పూర్తి మార్కులు పడతాయి. 

కథ మొత్తం టాక్సీ డ్రైవర్ షణ్ముగం అలియాస్ బెంజ్ ( మోహన్ లాల్ ) , అతడి భార్య లలిత ( శోభన) ఇద్దరు పిల్లలు, SI బెన్నీ ( బిను పప్పు), CI జార్జ్ (ప్రకాష్ వర్మ )  పాత్రల చుట్టూనే తిరుగుతుంది. 
సినిమా ప్రారంభంలో టాక్సీ నడుపుకుంటున్న బెంజ్ అతడి భార్య లలిత.. ఇద్దరు పిల్లలను చూసి ఇదేదో కుటుంబ కథా చిత్రం అనుకుంటాం.

కానీ ఎప్పుడైతే పోలీసులు బెంజ్ కారును సీజ్ చేస్తారో అప్పట్నుంచి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఎంటర్ అవుతుంది
బెంజ్ కి తన కారు అంటే ప్రాణం. అలాంటిది ఓ రోజు అనుకోకుండా పోలీసులు గంజాయి కేసులో అతడి కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. తన కారును విడిపించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు బెంజ్.

కానీ SI బెన్నీ ఆ కారును తిరిగివ్వడానికి ససేమిరా అంటాడు. చివరికి బెంజ్ CI జార్జ్ ను బతిమాలుకుంటే అడవిలో జరిగే జాతరకు తమను కారులో తీసుకెళ్లాలని కండిషన్ పెట్టి కారు కీస్ ఇస్తాడు . ఎలాగైతేనేమి తన కారు దక్కిందని బెంజ్ ఆ షరతుకు ఒప్పుకుని పోలీసులను అడవిలోకి తీసుకెళ్తాడు.. అక్కడ బెంజ్ ఊహించని సన్నివేశం ఎదురౌతుంది.

తన కారు డిక్కీలోనుంచి శవాన్ని అడవిలోకి తీసుకెళ్లడం చూస్తాడు బెంజ్. సరే ఎలాగోలా ఇంటికి చేరుకున్న బెంజ్ కి కొడుకు మిస్సయాడనే వార్త తెలుస్తుంది. దీంతో బెంజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కానీ తన కొడుకు విషయంలో పోలీసులే హంతకులని బెంజ్ కు అప్పటివరకు తెలీదు. తన కూతురిని ప్రేమించాడని పగ పెంచుకున్న CI బెంజ్ కొడుకుని స్టేషన్లోనే చంపేస్తాడు..

ఒకరకంగా ఇది చాలా సినిమాల్లో మనం చూసిన పరువు హత్యే. ఈ క్రమంలో తన కొడుకును చంపడంలో SI, CI ల పాత్ర ఉందని తెలుసుకుని వాళ్ళని మట్టు బెట్టడానికి వేట మొదలు పెడతాడు. వేట ఎలా ముగిసిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 

ఇక పాత్రల విషయానికి వస్తే 65 ఏళ్ల మోహన్ లాల్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అదేంటో మోహన్ లాల్ కి వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో గ్లామర్ పెరుగుతుంది. అతడి భార్యగా నాట్య కళాకారిణి శోభన కూడా చక్కటి నటన ప్రదర్శించింది.. కాకపోతే ముఖంలో ముడతలు దాయలేకపోయింది..

ఇక విలన్ల గురించి చెప్పాలంటే ముఖంలో క్రూరత్వం ఎవరైనా పలికిస్తారు. కానీ నవ్వుతూ క్రూరత్వం పలికించేవారు అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో జార్జ్ పాత్ర వేసిన ప్రకాష్ వర్మ అటువంటి క్రూరత్వాన్ని ప్రదర్శించి విలన్ గా పూర్తి మార్కులు కొట్టేశారు. 

తుడరుమ్ కథను ఆద్యంతం ఉత్కంఠత కలిగించేలా మలచడంలో దర్శకుడు తరుణ్ మూర్తి విజయం సాధించారు. కాకపోతే కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దృశ్యం కు సీక్వెల్ చూస్తున్నామా అనిపిస్తుంది. నిడివి తగ్గితే బాగుండేది.

పోలీస్ స్టేషన్ లో సన్నివేశాలు, హోటల్ రూమ్ లో పోలీసులను మోహన్ లాల్ బంధించి నిజాలు రాబట్టే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఓవరాల్ గా సస్పెన్స్.. క్రైమ్.. థ్రిల్లర్ మూవీ చూడాలనుకునేవాళ్ళు తుడరుమ్ చూడండి!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!