ప్రఖ్యాత రచయిత టాల్ స్టాయ్ రాసిన దెయ్యాల కథ

Sharing is Caring...

AG Datta…………………………………… 

( టాల్‌స్టాయ్‌ జన్మదినం సందర్భంగా ఆయన రాసిన ‘ద ఇంప్‌ అండ్‌ ది క్రస్ట్‌’ అనే కథానిక స్వేచ్ఛానువాదo )

ఒక ఊర్లో ఒక పేద రైతు ఉదయమే రొట్టెల మూట భుజాన వేసుకొని పొలానికి బయల్దేరాడు. ఒక పొదచాటున రొట్టెల మూట పెట్టి, పొలం దున్నసాగాడు. మధ్యాహ్నానికి దున్నే గుర్రం అలసిపోయింది. రైతుకూ ఆకలేసింది. దానికింత గడ్డి పడేసి, తనూ భోజనానికి సిద్ధమయ్యాడు.

రొట్టెల మూట పెట్టిన పొద దగ్గరకెళ్లి చూస్తే, ఇంకేముంది. అక్కడ ఉంచిన రొట్టెలు లేవు. అనూహ్యంగా మాయమయ్యాయి. విచిత్రం! ఆ చుట్టపక్కల నరమానవుడు లేడు. కుక్క, నక్కలాంటి జంతువులూ లేవు. రొట్టెలు ఎలా పోయాయో రైతుకి అంతుపట్టలేదు. ‘సరే, చేసేదేముంది. ఎవరో ఆకలిగొన్న వారు తిని ఉంటార’ని భావించాడు.నిజానికి ఆ రొట్టెల మూటను దొంగిలించింది ఓ పిల్ల దయ్యం!

ఆ పొద వెనకే దాక్కొని రైతు ఏమంటాడో అని చెవులు రిక్కించింది.‘ఒకపూట తినకపోతే నేనైతే చచ్చిపోను. పోనీలే, ఎవరు తిన్నా, వారి ఆకలి తీరుతుంది. వారికి దేవుడు మేలు చేయుగాక’ అని అనుకుంటూ ఆ అభాగ్యరైతు కడుపునిండా మంచినీళ్లు తాగి పనిలోకి దిగాడు.పొదవెనుక ఉన్న చిన్ని భూతానికి ఆశాభంగమైంది. ఎలాగైనా ఆ రైతు నోటి నుంచి చెడు మాటలు రప్పించాలని, ఆ రకంగా అతనితో పాపం చేయించాలని దాని కోరిక.

ఆ కోరిక నెరవేరలేదు. తల్లి దయ్యం దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. తల్లి దయ్యానికి విపరీతమైన కోపమొచ్చింది. ‘మడిసి నీ మేలు కోరాడంటే నీ పనిలో విఫలమైనట్టే. నీవేం చేయాలో, దాని గురించి నీకు అర్థమైనట్లు లేదు. మనుషుల్ని రాతికి రాపాడించడమే మన దెయ్యాల పని. తిరిగెళ్లు, వెళ్లి వాళ్ల పని పట్టు. లేదా నిన్ను ‘పవిత్ర జలం’లో ముంచేస్తా’ అని తల్లి దయ్యం హెచ్చరించింది.

‘పవిత్ర జలం’ మాట వినగానే పిల్ల దయ్యం భయంతో గడగడా వణికిపోయింది.ఎలాగైనా రైతుని నాశనం చేయాలని తలపోస్తూ భూమ్మీదకొచ్చింది. అది చాలాసేపు ఆలోచించింది. చివరాఖరికి ఒక పథకం దాని బుర్రలో మెరిసింది. రైతుకూలీ వేషంలోకి మారిపోయింది. పేదరైతు దగ్గర కూలికి కుదిరింది. బురదనేలలో జొన్న వేయమని సలహా ఇచ్చింది. దాని మాట విని రైతు ఆ సంవత్సరం అలాగే చేశాడు. ఆ సంవత్సరం అసలు వర్షాలే పడలేదు.

అందరి పంటలు ఎండిపోయాయి. మన రైతు పంట మాత్రం విరగకాసింది. సంవత్సరం పొడువునా తినడానికి పోగా, ఇంకా బోలెడు గింజలు ఇంటి నిండా చేరాయి.రెండో ఏడాది కొండపైన పంట వేయమని పిల్ల దయ్యం రైతుకి సూచించింది. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు ఆ సూచనను తూచా తప్పకుండా పాటించాడు. ఈసారీ మిగిలిన రైతుల పంటలు అంతంత మాత్రమే! మన రైతు పొలం మాత్రం ధాన్యరాశులు పోసింది. అంత ధాన్యంతో ఏం చేసుకోవాలో రైతుకి పాలుపోలేదు.

పిల్ల దయ్యం ఊరకుంటుందా, మిగులు ధాన్యంతో సారాయి తయారు చేయడం రైతుకు నేర్పింది. మాంచి ఘాటైన సారాయి తయారు చేసుకొని రైతు తాగడం మొదలెట్టాడు. చుట్టపక్కలవారికి కూడా పోయసాగాడు.పిల్ల దయ్యం ఎట్టకేలకు విజయం సాధించింది. బోరవిడుచుకొని తను సాధించిన ఘనకార్యాన్ని తల్లి దయ్యానికి చెప్పింది. అయితే తల్లి దయ్యం స్వయంగా చూసి కానీ ఏ విషయం చెప్పలేనంది.

దాంతో తల్లీ, పిల్ల దయ్యాలు భూమికి బయలుదేరాయి. రైతు ఇంటికి చేరుకొని చూరులో నక్కి జరిగే తంతు గమనిస్తున్నాయి.రైతు ఇంటి చుట్టపక్కల కొద్దోగొప్పో డబ్బున్నవారంతా మందు కోసం సాయంకాలానికి చేరారు. రైతు వారిని సాదరంగా ఆహ్వానించాడు. అందరూ కూచొని ఘాటైన సారాయం సేవిస్తూ చక్కగా ముచ్చట్లు పెట్టుకున్నారు. తల్లి దయ్యం ఒకింత కోపంతో ఇదేనా నీవు సాధించింది అన్నట్లు పిల్ల వైపు చూసింది. అప్పుడేనా కాసేపాగు అన్నట్లు పిల్ల దయ్యం తోకతో సైగ చేసింది.

రైతు భార్య అందరికీ మందు పోస్తోంది. అనుకోకుండా చేతిలోని సారాయి గిన్నె చేజారిపోయింది. సారాయి కింద ఒలికిపోయింది. రైతుకు పట్టరాని కోపమొచ్చింది.‘లంజా, ఏమనుకుంటున్నావే, అదేమైనా మురికి నీళ్లనుకున్నావా, పిచ్చిముండా, అమృతాన్ని నేలపాలు చేశావు కదే’ అని విరుచుకపడ్డాడు.పిల్ల దయ్యం తల్లిని మోచేతితో పొడిచింది, ఒకప్పుడు నోటి దగ్గర రొట్టెలు పోయినా సహనం పాటించిన ఆ పేద రైతుని ఎలా మార్చానో చూడు అన్నట్లు చూసింది.

అందరికీ మందు పోస్తున్న భార్యను ఇంకా తిడుతూనే ఉన్నాడా రైతు. ఇంతలో పిలవని పేరంటంగా, కాస్త నాలుక తడుపుకుందామని ఒక నిరుపేద రైతు లోపలికి వచ్చాడు. అందరికీ అభివాదం చేశాడు. కింద కూచున్నాడు. ఉదయం నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని అలసిపోయిన అతగాడు తనక్కూడా మందు పోస్తారేమోనని పడిగాపులు కాశాడు.అయితే అతడి ఆశ అడియాశ అయింది.

‘అడ్డమైన వారందరికీ తాపడానికి నా ఇల్లు సత్రం కాద’ని గృహస్థు ఆడిపోసుకున్నాడు తప్ప ఒక్క చుక్క కూడా రాల్చలేదు.ఆ మాటలకు తల్లి దయ్యం సంతృప్తి చెందింది. పిల్ల అయినా పిడుగులా పని చక్కపెట్టుకొచ్చిందని మెచ్చుకొంది. పిల్ల దయ్యం నవ్వింది. ‘అప్పుడే ఏమైంది. జరగబోయేది చూడు’ అంది.అందరిలో మందు మహత్తు చూపసాగింది. మాటలు గాడి తప్పాయి. అవన్నీ వింటోంటే తల్లి దయ్యం ‘హృదయం’ పొంగిపోయింది.

‘చూస్తుంటే మద్యం మత్తులో ఈ మనుషులు తేలిగ్గా దారి తప్పేలా ఉన్నారే’ అంది.‘కంగారు పడక, ఇప్పుడు వీరంతా నక్కల్లాగా ఒకరినొకరు మోసపుచ్చుకోవడానికి చూస్తున్నారు. ఇంకో గ్లాసు పడనీ, తోడేళ్లలాగా ఎలా కాట్లాడుకుంటారో చూద్దు గానీ’ అని పిల్ల దయ్యం ధీమాగా చెప్పింది. ‘నిజమా’ అన్నట్లు తల్లి దయ్యం చూసింది. రైతులంతా మరో గ్లాసు ఖాళీ చేశారు. వాతావరణం వేడెక్కింది. దూషణ, భూషణలు మొదలయ్యాయి. తిట్టుకోవడం కాస్తా కొట్టుకోవడంలోకి దిగింది.

కిందా మీదా పడుతున్నారు. రంగంలోకి గృహస్థు కూడా దిగాడు. దొమ్మిలో అతగాడి మూతీ… ముక్కు… ఏకమయ్యాయి.తల్లి దయ్యం పరమానంద భరితురాలైంది. ‘భలే చక్కగా పాడు చేశావు, సెబాస్‌ పిల్లా’ అని మెచ్చుకుంది.‘అమ్మా నీకు తొందరెక్కువే. అసలు సినిమా ఇంకా మొదలు కాలేదు. కాస్త ఓపిక పట్టు, మూడో గ్లాసు ఖాళీ అవనీ, వీళ్లంతా పందుల్లా ఎలా మారుతారో చూద్దు గానీ’ అంది పిల్ల దయ్యం.మూడో గ్లాసూ పూర్తయ్యింది. అందరూ పశువుల్లా తయారయ్యారు.

ఎవడి మాటా ఎవడూ వినడం లేదు. పెద్ద పెద్దగా గొంతెత్తి అరుచుకుంటున్నారు. అకస్మాత్తుగా విందు కాస్తా చిందు అయింది. గుంపులుగా, విడిగా రైతులంతా బయటపడ్డారు. వెళ్లే వారి వెనకబడిన మన రైతు తిడుతూ ‘పొండిరా.. పొండి’ అంటూ కాలు జారి బురదలో పడ్డాడు. పైకి లేవలేక అలాగే పందిలా కాసేపు పొర్లి మత్తులో జారిపోయాడు.దీంతో తల్లి దయ్యం సంపూర్ణంగా సంతృప్తి చెందింది.‘బాగుందమ్మా, చక్కగా చేశావు. మాంచి మందు తయారు చేయించావు.

అసలు ఇలాంటి మందు ఎలా చేయించావో ఒకసారి చెబుతావా? మొదట ఆ మద్యంలో నక్క రక్తం కలిపినట్లున్నావు. అందుకే సిగ్గరి రైతులు కాస్త మొదటి గ్లాసుకే నక్కల్లా ప్రవర్తించారు. తరువాత తోడేలు రక్తం కలిపావేమో, అచ్చం వాటిలాగే కోపంగా గుర్రుపెట్టారు. ఆఖర్లో పంది రక్తం కలిపినట్లున్నావు. పందుల్లాగా కిందపడి దొర్లారు. అవునా’ అడిగింది తల్లి దయ్యం.‘కాదు, కానే కాదు’ అంది పిల్ల దయ్యం. ‘నేనలా చేయలేదు. రైతుతో అవసరానికన్నా ఎక్కువ జొన్న పండించాను… అంతే!

మృగ లక్షణాలు మనిషి రక్తంలోనే ఉన్నాయి. అయితే తనకు సరిపడా ధాన్యం పండినంత కాలం హద్దుల్లోనే ఉన్నాడు. అందుకే తాను తినే రొట్టెలు పోయినా సహనం కోల్పోలేదు. ఎప్పుడైతే మిగులు ధాన్యం వచ్చి పడిందో, దాన్నుంచి సుఖం పిండాలనుకున్నాడు. నేనో మార్గం చూపించాను- అదే మద్యం!

ఆహారం కోసం దేవుడిచ్చిన ధాన్యం నుంచి ఎప్పుడైతే మద్యాన్ని తయారుచేశాడో, తన రక్తంలోనే ఉన్న నక్క, తోడేలు, పంది బయటికొచ్చాయి. అలా తాగుతూంటే మనిషి పూర్తిగా పశువుగా మారిపోతాడు. నేను చేసిందింతే’ అని పిల్ల దయ్యం చెప్పుకొచ్చింది.‘మొత్తానికి మన దయ్యాల పేర్లు నిలబెట్టావు. ఇక నీకు మరో గురుతర బాధ్యత అప్పగిస్తా’నంది తల్లి దయ్యం.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!