ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం!!

Sharing is Caring...

Paresh Turlapaati …………..    A movie to watch with the family.

టూరిస్ట్ ఫ్యామిలీ… హాయిగా అందరితో కలిసిపోయి చేదోడు వాదోడుగా ఉండే మంచి కుటుంబాన్ని చూడాలనుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడండి.  భార్య భర్త ఇద్దరు కొడుకులు .. చిన్న కుటుంబం …కలతలు, కల్మషాలు అసలే లేని మంచి కుటుంబం..

అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కాలనీలలో మనుషుల మధ్య దూరం పెరిగి ఎవడి లైఫ్ వాడిదే అనే కాన్సెప్ట్ తో జీవితాలు నడుస్తున్న రోజుల్లో ధర్మదాస్ లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూస్తే మన పక్క ఫ్లాట్లోనో.. మన కాలనీలోనో ధర్మదాస్ లాంటి వాడు ఒక్కడైనా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం.

మనం సంఘ జీవులం కాబట్టి మన చుట్టూ ధర్మ దాస్ లాంటి వాళ్ళే ఉండాలని కోరుకుంటాం కానీ మనమే ధర్మ దాస్ ఎందుకు కాకూడదని ఆలోచించం. టూరిస్ట్ ఫ్యామిలీ స్ట్రెయిట్ తమిళ్ సినిమా అయినా తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూస్తున్నా ఫీలింగ్ ఎక్కడా రాదు. టూరిస్ట్ ఫ్యామిలీలో నటులు కనిపించరు.. పాత్రలే కనిపిస్తాయి.

గతంలో యూ ట్యూబర్ గా గుర్తింపు పొందిన ఈ దర్శకుడు మొదటి ప్రయత్నంలోనే 10 కోట్లు పెట్టి తీసిన టూరిస్ట్ ఫ్యామిలీ 100 కోట్లు కలెక్షన్ రాబట్టింది. కథ విషయానికి వస్తే శ్రీలంక లో ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో చాలా కుటుంబాలు వలస పోతాయి. అలా శ్రీలంక నుంచి రామేశ్వరం వలస వచ్చిన కుటుంబాల్లో ధర్మ దాస్ కుటుంబం ఒకటి.

సిమ్రాన్ అన్న సాయంతో అక్రమంగా సముద్రం దాటి రామేశ్వరంలో ఓ కాలనీలో ఇల్లు చూసుకుని అద్దెకు దిగుతారు. అయితే సరిగ్గా వీళ్లు వచ్చిన రోజే రామేశ్వరంలో బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోతారు. శ్రీలంక నుంచి వలస వచ్చినవాళ్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ధర్మ దాస్ ను అనుమానిస్తారు. ఇంకోపక్క ధర్మ దాస్ కుటుంబం మంచి తనంతో కాలనీ వాసులకు దగ్గర అవుతారు..

క్లైమాక్స్ లో పోలీసులు కాలనీలోకి వచ్చి ప్రతి ఇంటిని సెర్చ్ చేసినా ఒక్కళ్ళు కూడా ధర్మా దాస్ గురించి బయటపెట్టరు.. ఆఖరికి ధర్మ దాస్ ను గుర్తుపట్టిన కానిస్టేబుల్ కూడా పై అధికారులకు అతడెవరో తెలీదు అంటాడు.. దాంతో పోలీసులు వెనక్కి వెళ్ళిపోతారు… అప్పుడు ధర్మ దాస్ కానిస్టేబుల్ ని అడుగుతాడు.

“నువ్వు నన్ను గుర్తు పట్టినా ఎందుకు వదిలేశావ్?” అని.. “నిజానికి నేను ఇక్కడికి వచ్చింది నిన్ను అరెస్ట్ చేద్దామనే కానీ ఈ కాలనీలోకి వచ్చాక కాలనీ వాసులు ఒక్కొక్కళ్ళు నీ ఆచూకీని బయటపెట్టకుండా ఇంతమంది నీకు మద్దతుగా మాట్లాడారంటే నీ మంచి తనం వల్లనే అని నాకు అర్థమైంది.. నీలాంటి వాడు సమాజానికి అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్..

సరదాగా సున్నితమైన హస్యం తో పాటు కొన్ని సన్నివేశాలు మనసుని హత్తుకుంటాయి.. సంపాదన కోసం తండ్రి పక్కింట్లో కారు డ్రైవర్గా చేరి కారు తుడుస్తుంటే చదువు పూర్తయి ఉద్యోగం లేని కొడుకు పడే మనో వేదన కంట తడి పెట్టిస్తుంది.. భర్త కష్టాన్నిచూసి భార్య చిన్న కొడుకు చేత లెమన్ జ్యూస్ పంపడం .. ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకోవడంతో మధన పడుతున్న అన్న మనసును తేలిక చేయడం కోసం తమ్ముడు డాన్స్ చేయడం ..

ధర్మ దాస్ కాలనీలో ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ మంచి తనంతో అందరి మనసులు గెలుచుకోవడం.. ప్రేమించిన భార్య చనిపోతే పరామర్శించడానికి బంధువులూ ఎవరూ లేరని పక్కింటి పెద్దాయన బాధ పడుతుంటే ధర్మ దాస్ కాలనీ వాసులను అందర్నీ ఒప్పించి ఆవిడకు అంతిమ నివాళులు అర్పించడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి. 

చర్చిలో దేవుడి ప్రస్తావన వచ్చి తనను కాపాడిన ధర్మ దాసే దేవుడని.. వ్యసనాల నుంచి బయటపడిన ఓ కుర్రాడు చెప్పడం .. లాంటి సన్నివేశాలు మనసును తాకుతాయి. క్లైమాక్స్ అయిపోయి ఎండ్ కార్డ్ పడగానే అరె..సినిమా అప్పుడే అయిపోయిందా ?అని అనుకుంటాం … ఇంతమంచి ఫ్యామిలీ మన పక్కనే ఉంటే ఎంత బాగుణ్ణు అనుకుంటాం. 

చివరగా టూరిస్ట్ ఫ్యామిలీ లో ఎమోషనల్ సన్నివేశాల్లో కళ్ళు తడి కాని ప్రేక్షకుడు ఉండడు.. దర్శకుడు అభిషన్ జీవింత్ ధర్మ దాస్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు మనకు నిజ జీవిత పాత్రలే దర్శనమిస్తాయి తప్ప మరొకరు కనిపించరు.

ధర్మదాస్ (శశికుమార్)..వాసంతి(సిమ్రన్) జంట బాగుంది.ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమా ఓ కాలనీలో తీశారు. చూస్తున్నంతసేపు మనం కూడా అక్కడే ఉన్నామా అనేలా సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. దర్శకుడికి అనుభవం లేకపోయినా అందరిని ఆకట్టుకునేలా ఈ సినిమా తీయడం గొప్పవిషయం.ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది .. చూడండి .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!