జగమెరిగిన జర్నలిస్ట్ పై దేశ ద్రోహం కేసా ?

Sharing is Caring...

Taadi Prakash….……………………………………………………

The First Treason Case………………………………………….

దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి… నను జూసి నవ్వింది కవిత్వం. నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి.. నా దోసిలి నింపింది సంగీతంకరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి.. కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం… గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది మాత్రం జర్నలిజం.

తెలుగు జర్నలిజంలో నేను తొలి అక్షరాలు దిద్దుతున్న నాటికే టి.జె.ఎస్. జార్జి పెద్ద జర్నలిస్టు. ఈ దేశం గర్వించదగ్గ ఉత్తమ జర్నలిస్టుల్లో కెల్లా ఉత్తముడు. 94 సంవత్సరాల వయసు దాటి 95వ పడిలో ప్రవేశిస్తున్న జార్జి పాదాల మీద నాలుగు అక్షరాల పూలు జల్లే చిన్న ప్రయత్నం ఇది. ఆయన 1997 నుంచి ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ దినపత్రికలో 25 సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా కాలమ్ రాశారు.

2022 జూన్ 12వ తేదీ ఆదివారంతో జార్జి కాలమ్,point if view కి పాతికేళ్ళు నిండాయి. NOW IS THE TIME TO SAY GOODBYE అనే శీర్షికతో ఆయన చివరి కాలమ్ రాశారు. “పావు శతాబ్దం పాటు వారంవారం అవిశ్రాంతంగా రాశాను, చాలిక” అంటూ ముగించారు. పేరెన్నికగన్న రచయితలూ, జర్నలిస్టులూ, చేయి తిరిగిన సెలబ్రిటీలతో దిన వార పత్రికలు “కాలమ్” రాయిస్తాయి. వారానికో, పదిహేను రోజులకో వచ్చే ఆ వ్యాసంలో వాళ్లకి తోచిన అంశం మీద రాస్తారు.

ఆ వ్యాసంలో మార్పులు, చేర్పులు చేయడం కానీ, సంపాదకుడు దిద్దటం కానీ వుండదు. అది పత్రికలు వాళ్లకిచ్చే గౌరవం. ఆదివారం నాగపూర్ లో నిమ్మకాయల ధరల నుంచి న్యూయార్క్ లో కూలిపోయిన భవనాల దాకా ఏ విషయమ్మీదైనా రాస్తారు. వాళ్ల అభిప్రాయం చెబుతారు.. వ్యంగంగానో, వీపుపగిలేట్టుగానో! “కాలమిస్ట్” అనే వాళ్లకి దక్కే అరుదైన గౌరవం అది.అలాంటి టాప్ క్లాస్ ఇండియన్ జర్నలిస్టుల్లో కుష్వంత్ సింగ్, డామ్మొ రేస్, అనిల్ ధర్కర్, వీర్ సంఘ్వి, ఎంజె అక్బర్, నిఖిల్ చక్రవర్తి, నీహాల్ సింగ్, టి.జె.ఎస్. జార్జి నాకు ఇష్టమైన వాళ్ళు.

ఇంకా కార్టూనిస్టు అబూ అబ్రహం, కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ చాలా బాగా రాస్తారు. కరణ్ థాపర్, వినోద్ మెహతా, హెచ్.కె.దువా, ఎం.వీ.కామత్, కులదీప్ నయ్యర్ రాసినవీ చదివేవాణ్ణి. మహిళల్లో శోభాడే, అనీస్ జంగ్ అందంగా రాస్తారు. తెలుగు పేర్లు చెప్పాలంటే.. కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు, పాలగుమ్మి సాయినాథ్ అద్భుతంగా రాస్తారు. అరుంధతి రాయ్ లాంటివాళ్లు గెస్ట్ కాలమిస్టులుగా వ్యవస్థని బాంబుల్తో పేల్చేస్తూ వుంటారు.

కోసి కారం పెట్టినట్టు రాయడంలో జార్జి, అరుంధతి స్పెషలిస్టులు. జర్నలిజం అంటే తీయటి కబుర్లతో చల్లటి ఐస్ క్రీమ్ చప్పరించటం కాదు. కులూమనాలీ సౌందర్యమూ, నయాగరా జలపాతం హోరులోని పులకింతా కానేకావు. Sense of Social responsibility is the difference between Journalism and any other career.. Journalism is one of the continuing thought process of civilization – అంటారు జార్జి.

థాయిల్ జాకబ్ సోనీ జార్జ్ కేరళలోని తుంపమోన్ లో 1928 మే 7న పుట్టారు. తండ్రి థాయిల్ థామస్ జాకబ్ మెజిస్ట్రేటు. తల్లి చాచియమ్మ గృహిణి. భార్య అమ్ముతో జార్జి బెంగళూరు లో సెటిలయ్యారు. ఆయన కూతురు షీబా థాయిల్. కొడుకు సన్ జీత్ థాయిల్ రచయిత. T.J.S గా ఆయన ప్రపంచమంతా తెలుసు. గొప్ప రచయితగా, సీరియస్ పొలిటికల్ కాలమిస్ట్ గా, అనేక పుస్తకాలు రాసినవాడుగా అందరి మన్ననలూ పొందినవాడు.

మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి జార్జి వయసు 19 సంవత్సరాలు. 1950లో అంటే 22 ఏళ్లకే బొంబాయిలో “ఫ్రీ ప్రెస్ జర్నల్”లో ఆయన కెరీర్ మొదలయ్యింది. కొన్ని అంతర్జాతీయ పత్రికల్లో, సంస్థల్లో పనిచేశాక, హాంకాంగ్ లో “ఆసియా వీక్” పత్రిక ఆయనే పెట్టారు. దానికి జార్జే సంపాదకుడు. ప్రస్తుతం ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఎడిటోరియల్ అడ్వైజర్ గా వుంటున్నారు. సాంఘిక దురన్యాయం, అవినీతి, రాజకీయ అరాచకం మీద అక్షరాలతో మెరుపుదాడులు చేసిన మొనగాడు జార్జి.

ఆయన బీహార్ లో ఒక పత్రిక సంపాదకుడిగా వుండి, నాటి ముఖ్యమంత్రిని రాతల్లో చీల్చిచెండాడినందుకు “దేశద్రోహి” అని కేసు పెట్టారు. స్వేచ్ఛా భారతావనిలో తొలి దేశద్రోహం కేసు గౌరవం పొందిన మొదటి సంపాదకుడు మన జార్జి! ఆసియా వీక్ ఎడిటర్ గా ఆయన ఆగ్నేయాసియా దేశాల పాలకులకు నిద్ర లేకుండా చేసారు.సాహిత్యం, విద్యారంగాల్లో చేసిన సేవకు గుర్తింపుగా 2011లో భారత ప్రభుత్వం జార్జిని పద్మభూషణ్ సత్కారంతో గౌరవించింది. రాష్ట్రస్థాయి జర్నలిజం అవార్డులు కొన్ని పొందారు.

మన సంగీత సరస్వతి సుబ్బులక్ష్మి జీవిత కథని జార్జి రాశారు. ఆ పుస్తకం పేరు MS – A Life in Music. దక్షిణాది అగ్రవర్ణ బ్రాహ్మల సనాతన సంప్రదాయ అగ్రహారాల గోడల్ని బద్దలుకొట్టుకు వచ్చిన, మద్రాసులో కర్ణాటక సంగీతం అనే పురుషాధిపత్య కోటని కూల్చివేయగలిగిన సుబ్బులక్ష్మి గురించి జార్జి రాసిందొక మాస్టర్ పీస్.

2004లో ఈ పుస్తకం పబ్లిష్ అయింది. “మదర్ ఇండియా”గా కన్నీటి దీపాలు వెలిగించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హీరోయిన్ నర్గీస్ జీవిత కథను కూడా జార్జి రాశారు. ఆ పుస్తకం పేరు: The life and times of Nargis (1994). కమర్షియల్ బురదలో కూరుకుపోని భారతీయ సినిమా స్వర్ణయుగాన్ని ఉత్తేజకరంగా జార్జి ఆవిష్కరించారు. భారత రాజకీయవేత్త కృష్ణమీనన్ వ్యక్తిత్వంపై ఆశ్చర్యపరిచే వివరాలతో మరో పుస్తకం రాశారు.

యువ జర్నలిస్టుల కోసం “లెసన్స్ ఇన్ జర్నలిజం”, మరో రెండు ప్రామాణికమైన పుస్తకాలు జార్జి రాశారు. ***సాధారణంగా ఎంత ప్రముఖులు రాసిన “కాలమ్” అయినా దినపత్రికల్లో ఎడిట్ పేజీలో, లేదా సండే మేగజైన్లో ప్రచురిస్తారు. సచిన్ టెండూల్కర్ కి “భారతరత్న” ఇవ్వాలని ఎంతోమంది డిమాండ్ చేస్తున్నప్పుడు టీజేఎస్ జార్జి “కాలమ్”ని ఇండియన్ ఎక్స్ప్రెస్ మొదటి పేజీలో పబ్లిష్ చేసింది. జార్జి కారాలూ మిరియాలూ నూరుతూ రాశారు.

క్రికెట్ లో కొన్ని సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ అనేవాడు కోట్ల రూపాయలు సంపాదించాడు. దేశం కోసం ఆడుతున్నానని చెప్పినవాడు ఆ కోట్లతో ఏం చేశాడు? మరిన్ని కోట్లు సంపాదించడం కోసం బొంబాయిలో “టెండూల్కర్స్” అని ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు పెట్టాడు. సచిన్ అనే ఆటగాడు వ్యాపారస్తుడు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మిని మనం ఎందుకు పట్టించుకోవడం లేదు?

ఐక్యరాజ్యసమితిలో కచేరీ చేసి భారతీయ శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని ప్రపంచవేదికపై అందరి హృదయాల్లో పలికించిన మన సంగీత కళానిధిని మనం ఎందుకు విస్మరిస్తున్నాం. కచేరీ చేస్తే వచ్చిన డబ్బుని ఆమె గుడి మెట్ల మీద కూర్చుని ఉండే బిచ్చగాళ్లకు పంచిపెట్టేది. అవి 20 రూపాయల నోట్లా, 50 రూపాయల నోట్లా అని కూడా ఆమె పట్టించుకునేది కాదు. పవిత్రమైన కళాకారుల్ని కాదని పచ్చి వ్యాపారస్తులకు భారతరత్న ఇవ్వాలని అడిగే దుర్గతి ఈ దేశానికి దాపురించింది” అని జార్జి ఎంతో ఆవేదనతో, ఆగ్రహంతో రాశారు.

మాటలతో కాల్పులు జరపొచ్చనీ, వాక్యాలతో బాంబులు పేల్చవచ్చనీ ఆ కాలమ్ చదివినపుడు నాకు అర్థం అయింది. PATRIOTISM is the last refuge of a SCOUNDREL అని శామ్యూల్ జాన్సన్ ఏనాడో అన్నారు.జార్జి రాసిన కాలమ్స్ ని ఒకచోట చేర్చి 2003లో పుస్తకం వేశారు. ఆ పుస్తకానికి ఆయన పెట్టిన పేరు – The first Refuge of Scoundrels – Politics in Modern India.ఎంత పట్టరాని కోపమో, అంత హాస్యదృష్టి ఆయనిది!

what a man! ఇంగ్లీషులో జార్జి విరుపు, జార్జి విసురు, జార్జి విన్యాసం, జార్జి విరుచుకుపడే తీరు చాలాచాలా ప్రత్యేకం! చదివితీరాలి!***జార్జి లాంటి జర్నలిస్టులు మన జాతిసంపద. కాలమ్ అంటే ప్రతి వారం శనివారం సాయంత్రంకల్లా రాసి ఇవ్వాలనే కంపల్షన్ ఉంటుంది. 94 ఏళ్ల వయసులో ఇంకా అలా deadlines ని మీట్ కాలేనని చెబుతూ, అడపాదడపా రాస్తూనే వుంటానని మాట ఇచ్చారు జార్జి.

జూన్ పన్నెండవ తేదీ ఆదివారం నాడు రాసిన చివరి కాలమ్ లో. సంవత్సరానికి యాభై రెండు వారాలు 25 ఏళ్లతో వెచ్చిస్తే పదమూడు వందల వ్యాసాలు రాశాను చాలా సుదీర్ఘమైన పరుగు… పావు శతాబ్దం పాటు రాశాను. It’s time to sit back and let others carry on… the fight must go on- అని ముగించారాయన. ఆ కాలమ్ లోనే జార్జి ఈ దేశమ్మీద అవ్యాజమైన అనురాగంతో – Prime ministers may come and go, home ministers may say this and that, but the essence of India will go on, unaffected by the manipulations of Power-Seekers. Ours is a truly great country…అన్నారు.

చివరిమాట: వూటీ, కూర్గ్, శ్రావణ బెళగొళ, మైసూరు మహారాజా పేలస్ చూడ్డానికి వెళ్తుంటారు కదా, అప్పుడు వీలైతే బెంగుళూరులో టిజెఎస్ జార్జి అనే మహానుభావుణ్ణి కలిసి, షేక్ హాండ్ యిచ్చి, చేతివేళ్ళు ముద్దుపెట్టుకుని రండి…. ఈ పాడు బతుకు ధన్యం అవుతుందేమో!-

TAADI PRAKASH 97045 41559

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!