ఆకట్టుకునే ‘దొంగాట’ !

Sharing is Caring...

Impressive movie…………………………….

దొంగాట …. ఈ సినిమా కూడా పోలీస్ వ్యవస్థలోని లొసుగులు …కేసులు కట్టే విధానాలు, చోరీ సొత్తు రికవరీ ఎలా చేస్తారు ? దొంగలతో పోలీసులు ప్రవర్తన ఎలా ఉంటుంది ? మధ్య తరగతి కుటుంబీకులు కేసులు పెట్టి ఎలాంటి ఇబ్బందులు పడతారో ? కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. 

కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది. ఫ‌హాద్ ఫాజిల్‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు, నిమిషా స‌జ‌య‌న్ పాత్రల చుట్టూ తిరిగిన కథ.  దొంగ పాత్ర‌లో ఫ‌హాద్ ఫాజిల్ అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్రదర్శించాడు. కథ లో హీరో ఫాజిలే. 

దక్షిణాది విలక్షణ నటుల్లో ఫహద్ ఫాజిల్ ఒకరు. ఓటీటీల ద్వారా విడుదలైన సినిమాలతో  ఫహద్ ఫాజిల్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. పాత్ర బలంగా ఉంటే ఎలాంటి సినిమా అయినా చేసేందుకు ఫాజిల్ వెనుకాడరు.

జోజి .. మాలిక్ .. పుష్ప చిత్రాల్లో తనదైన శైలి తో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు. అంతకు ముందు కూడా డిఫరెంట్ మూవీస్ లో విభిన్న పాత్రలు చేశారు. ఇక ఈ దొంగాట  (మలయాళం వెర్షన్  తొండిముత్యాలుం దృక్సాక్షియుం) లో కూడా తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం పొందారు.

2017 లో విడుదలై  మంచి విజయం సాధించిన ఈ సినిమాను తాజాగా  ‘దొంగాట’ పేరుతో తెలుగు లో డబ్ చేసి ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేశారు. చిన్నకథను దర్శకుడు దిలీప్ పోతన్ చక్కగా తెరకెక్కించారు. ప్రథమార్ధం స్పీడ్ గా సాగిన .. ద్వితీయార్ధం కొంత స్లో గా నడుస్తుంది. 

పెద్ద‌ల‌ను ఎదురించి త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డ‌టానికి  ప్ర‌య‌త్నించే జంట‌గా సూర‌జ్‌, నిమిష క్యారెక్టర్స్ ను దర్శకుడు సహజంగా తీర్చిదిద్దారు.  భ‌ర్త క‌ట్టిన తాళి చేజారిపోవ‌డంతో దానిని తిరిగి పొందాల‌ని త‌పించే  శ్రీజ  పాత్రలో నిమిష నటన ఆక‌ట్టుకుంటుంది.  గొలుసును కాజేసిన దొంగ నుంచి దాన్ని ఎలాగైనా పొందాలని  ఆరాట‌ప‌డే వ్య‌క్తిగా సూర‌జ్ చ‌క్క‌టి అభిన‌యాన్ని క‌న‌బ‌రిచాడు.

సామాన్యులతో పోలీసులు వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది ? పరిస్థితులకు అనుగుణంగా తమకు ఎలాంటి సమస్య రాకుండా పోలీసులు కేసులను ఎలా మారుస్తారో ?  దొంగలు పారిపోయినపుడు ఎంత టెన్షన్ పడతారో తెలియజేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ముగింపు అంత గొప్పగా లేదు. ఫాజిల్ చివరిలో ఎందుకు మంచివాడిగా మారాడో ఎస్టాబ్లిష్ కాలేదు. బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సజీవ్‌ పజూర్‌ కూడా జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డును కేరళ ప్రభుత్వం నుంచి అందుకుంది ఈ సినిమా. బిజిబల్ మ్యూజిక్, రాజీవ్ రవి కెమెరా పనితనం సినిమాకు బలాన్ని చేకూర్చాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!