President Election …………………………………..
రాష్ట్ర పతి ఎన్నిక ఈసారి రసవత్తరం గా జరగనుంది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఏ ఇబ్బంది లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదనే అంటున్నారు. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కావడమే ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక పై ఉత్కంఠ నెలకొంది. జూన్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల కావచ్చు. మిత్రపక్షాలతో బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థినే గెలిపించాలని బీజీపీ అగ్రనేతలు వ్యూహరచన చేస్తున్నారు.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 25తో ముగుస్తుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య పదవీ కాలం ఆగస్టు తో ముగుస్తుంది. తదుపరి రాష్ట్రపతి ఎవరు? అనే విషయమై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సీనియర్ నేత, బీజేపీలో అందరికీ సన్నిహితుడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతిగా పదోన్నతి కల్పిస్తారా ?లేదా అన్న అంశం కూడా ఖరారు కాలేదు. అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో పాటు వివిధ సమీకరణాలు చూసుకోవాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.
ఆ కేటగిరీ లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయంటున్నారు.వీరిలో అనసూయ ఉయికే కాంగ్రెస్ పార్టీ లో కొన్నాళ్ళు పనిచేశారు. 1985 లో మధ్యప్రదేశ్ లోని దామువా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. సీఎం అర్జున్ సింగ్ క్యాబినెట్లో 1988లో మంత్రి గా చేశారు.
1991లో బీజేపీలో చేరారు. 1993.. 1998 ఎన్నికల్లో పోటీ చేశారు… కానీ ఓడిపోయారు. 2000లో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా చేశారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వచ్చాక అనసూయను ఎస్టీ కమిషన్‌కు చైర్మన్ గా నియమించారు.ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ గిరిజన కమిషన్‌కు ఉపాధ్యక్షురాలిగా చేశారు. ఆ తర్వాత 2019 లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఇక ద్రౌపది ముర్ము ఒడిశాలోని సంతాల్ తెగకు చెందిన మహిళ. ముర్ము ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించి, 1997లో ఒడిశా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు ఆమె నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. 1997లో రాయరంగపూర్ నగర్ పంచాయతీ కౌన్సిలర్‌గా కూడా ఎన్నికయ్యారు.
బిజెపి షెడ్యూల్డ్ తెగల మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తర్వాత, ఆమె 2000 , 2009లో రాయంగ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఒడిశాలోని బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.ఒడిశా శాసనసభ లో 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీలకంఠ అవార్డు ను పొందారు.ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్‌గా 2015లో ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికల్లో కూడా ముర్ము పేరు వినిపించింది.
ఆ ఇద్దరిలో ఒకరికి ఖాయంగా ఛాన్స్ రావచ్చు అంటున్నారు. అదేసమయంలో ముస్లింనేత, కేరళ గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి పదవి కోసం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఏ పార్టీ అయినా .. ఏ కూటమి అయినా సొంతంగా అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోలేని పరిస్థితుల్లో అందరికి నచ్చే అభ్యర్థిని లేదా న్యూట్రల్ అభ్యర్థిని నిలబెట్టడం మామూలే. ఒక్కోసారి ఏకగ్రీవ ఎన్నికకు కూడా ప్రయత్నిస్తుంటాయి. ఈ సారి ఎన్డీయే కూడా అలాంటి వ్యూహాన్నే అమలు చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
ప్లాన్ బీ వ్యూహంలో భాగంగా రాష్ట్రపతి ఎన్నికకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ను అభ్యర్థిగా రంగంలోకి దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నట్టు కూడా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. గులాం నబీ ఆజాద్ ను ఎంపిక చేసుకుంటే ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపినట్టు అవుతుంది.
బీజేపీపై ఉన్న ముస్లిం వ్యతిరేక ముద్రను తొలగించుకోవడంతో పాటు రాజ్యాంగపరంగా అత్యున్నత పదవి విషయంలో ఏకాభిప్రాయాన్ని సాదించిన ఖ్యాతి దక్కుతుందని మోదీ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఆజాద్ అయితే మిగతా పార్టీలు మద్దతిస్తాయని, కాంగ్రెస్ వ్యతిరేకించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.72 సంవత్సరాల ఆజాద్ గత ఏడాది ఏప్రిల్ వరకు రాజ్యసభ నేతగా ఉన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ లో కీలక పదవులెన్నో నిర్వహించారు. ఆజాద్ తో మోదీకి స్నేహ సంబంధాలు ఉన్నాయి. చూద్దాం ఏమి జరగ బోతోందో ?