2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతున్నది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అగ్ర నేతల తీరుపై పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో పార్టీలో కొంత కదలిక వచ్చింది. అంతలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీ పనితీరుపై పూర్తి స్థాయిలో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు.దీంతో పార్టీ ఏ స్థాయిలో ఉందో అగ్రనేతలకు అర్ధమైంది.
వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రెండేళ్ల నుంచి కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే సోనియా పట్టించుకోలేదు. రాహుల్ మొదటి నుంచి నాన్ సీరియస్ కావడం, ప్రియాంకకు అనుభవం లేకపోవడం పార్టీ కి పెద్ద మైనస్ గా మారింది. ఫలితంగా వరుస పరాజయాలు ఎదురైనాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ రాజస్థాన్లోని ఉదయ్ పూర్ లో మే 13 – 15 తేదీల మధ్య కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సు నిర్వహించబోతోంది.
ఈ సదస్సు లో 400 మంది కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరిలో అత్యధికులు పార్టీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదవులు నిర్వహించిన వారు కూడా ఉన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన వారు ఉన్నారు. వీరంతా ఆరు బృందాలుగా మేథోమధన చర్చలు చేస్తారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, వ్యవస్థీకృత సమస్యలపై చర్చిస్తారు. ఎవరెవరు ఏ బృంద చర్చల్లో పాల్గొనాలో కూడా ఇప్పటికే నిర్ణయించారు. మే 15న మధ్యాహ్నం సీడబ్ల్యూసీ ఆమోదం తర్వాత ఉదయ్ పూర్ నవ్ సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది.
కాగా 1998, 2003, 2013లలో కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సులు నిర్వహించింది. ఇందులో 2003 సదస్సు మాత్రమే కాంగ్రెస్ కు ఎక్కువగా ఉపయోగపడింది. నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడంలో తోడ్పడింది. అప్పటి నుంచి 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పాలన నడిచింది.
అయితే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటములను చవిచూస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో 53 సీట్లు, రాజ్యసభలో కేవలం 29 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో దారుణమైన ఓటములను చవిచూసింది. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ కూడా యూపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కేరళ నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి సరిపోయింది. లేకపోతే పూర్తిగా పరువు పోయేది.
అదలా ఉంటే సంస్థాగత మార్పులపై కూడా సోనియా దృష్టి సారిస్తే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. కీలక పదవులు యువనేతలకు అప్పగించి పార్టీ లో మార్పులు తీసుకురావాలి. అపుడే పార్టీ బలోపేతమవుతుంది. కీలకమైన ఈ అంశాలను పట్టించుకోకుండా మళ్ళీ పాత తరం నాయకులకే బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం రావడం సందేహమే. ఈ మేధో మధన చర్చలన్నీ వృధా అవడం మినహా మరేమి ఉండదు. సోనియా ఏమి చేస్తుందో .. పార్టీ ఏదిశగా నడిపిస్తుందో చూడాలి.